నిన్నంతా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి అందరికీ తెలిసిందే. పుష్ప-2 హడావిడిలో పడిపోయిన మైత్రీ మూవీ మేకర్స్, తమ హీరో పవన్ కల్యాణ్ సెట్స్ పైకి వచ్చిన విషయాన్ని ప్రకటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఉదయం షూట్ స్టార్ట్ అయితే, పొద్దుపోయాక రాత్రి 10 గంటల టైమ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు, పవన్ వచ్చినట్టు ఓ పోస్టర్ వదిలారు. సరిగ్గా ఇక్కడ్నుంచే అసలు రచ్చ మొదలైంది.
పోస్టర్ తో పవన్ ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచామని యూనిట్ భావించింది. కానీ అక్కడ్నుంచే అసలు కథ షురూ అయింది. పవన్ తో షూటింగ్ మొదలైందంటూ పోస్టర్ రిలీజ్ చేయగా, అసలు అందులో ఉన్నది తమ హీరో పవన్ కాదంటూ వాదించడం మొదలుపెట్టారు కొంతమంది ఫ్యాన్స్. ఈరోజు పొద్దున్నుంచి ఇదే చర్చ.
ఈ చర్చ అక్కడితో ఆగలేదు. కుర్చీలో వెనక్కుతిరిగి అలా కూర్చున్నది పవన్ కాదని, స్వయంగా దర్శకుడు హరీశ్ శంకర్, గబ్బర్ సింగ్ గెటప్ లో అలా కూర్చొని ఫొటో దిగాడని కొందరు వాదించడం మొదలుపెట్టారు. రిలీజ్ చేసిన పోస్టర్ ను క్లోజప్ లో స్క్రీన్ షాట్స్ తీసి మరీ హరీశ్ కు ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు.
వెనక నుంచి చూస్తే ఆ హెయిర్ స్టయిల్ హరీశ్ శంకర్ దిలానే కనిపిస్తోంది. కానీ పవన్ లేకుండా, ఆయన డూప్ కింద హరీష్ ను కూర్చోబెట్టి, పోస్టర్ రిలీజ్ చేసేంత ధైర్యం యూనిట్ చేయదు. ఈ సంగతి పక్కనపెడితే, పవన్ నిన్న సెట్స్ పైకి వచ్చాడన్నది వాస్తవం.
పవన్ పై మొదటి రోజు తీసిన ఫొటోను కాస్త ఎడిటింగ్ చేసి, ఫొటోషాప్ లో కలర్ కరెక్షన్ చేసి విడుదలచేసేటప్పటికి రాత్రి అయింది. అందుకే లేట్ అయింది తప్ప, కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నట్టు అందులో ఉన్నది హరీశ్ శంకర్ కాదని, పవన్ కల్యాణ్ మాత్రమేనని యూనిట్ లో సభ్యులు అంటున్నారు.