టెన్త్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ పాత్రపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ప్రశ్న పత్రం బయటకు వచ్చాక వాట్సప్‌లో సర్క్యూలేట్ చేశాడే తప్ప, అతని ప్రమేయం ఎక్కడని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నిలదీశారు. టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్‌ను హన్మకొండ న్యాయస్థానం విధించిన సంగతి తెలిసిందే.
రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికర వాదనలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ నుంచి వరంగల్‌కు బండి సంజయ్‌ను తీసుకెళ్లేందుకు 300 కిలోమీటర్లు తిప్పారని న్యాయస్థానం దృష్టికి ఆయన తరపు న్యాయవాది రామచంద్రరావు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అసలు సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని ప్రభుత్వ తరపు న్యాయవాదిని సీజే ప్రశ్నించారు.
ప్రశ్నపత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. పేపర్ బయటకు వచ్చాక వాట్సప్‌లో సర్క్యూలేట్ చేశాడే తప్ప, అతనే లీకేజీ చేశాడనేందుకు ఆధారాలు ఏవని సీజే ప్రశ్నించారు. అంతేకాదు, ప్రశ్న పత్రం ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత అది లీకేజ్ ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని ఎలా అయినా వాడుకోవచ్చని తెలిపింది.
ప్రభుత్వ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ కుట్రదారుడని విచారణలో తేలిందన్నారు. మరో నిందితుడు ప్రశాంత్, బండి సంజయ్‌కు మధ్య ఫోన్ సంభాషణ అనేకమార్లు జరిగిందని, ఇంకా ఆయన తన సెల్‌ఫోన్‌ను ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. అలాగే బండి సంజయ్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని సూచించింది.