జనసేనాని పవన్‌కల్యాణ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయనపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఢిల్లీలో పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తు కుదుర్చుకుం దామని బీజేపీ పెద్దల ఎదుట మరోసారి పవన్ ప్రతిపాదించడంపై రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. టీడీపీతో పొత్తు ప్రస్తావనపై బీజేపీ పెద్దలు పవన్‌కు తలంటు చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇద్దరికీ విశ్వసనీయత లేదన్నారు. చంద్రబాబు ఎజెండాతో ఢిల్లీ వెళ్లాడా? లేక బీజేపీ పెద్దలు పిలిస్తే వెళ్లాడా? అనే విషయమై పవన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్‌ను మిత్రపక్షంగా గెలిపించే ప్రయత్నాన్ని పవన్‌కల్యాణ్ చేయకపోవడం విచిత్రంగా వుందని అన్నారు.
పవన్‌కు ఢిల్లీ బీజేపీ పెద్దలు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని ప్రజలు అనుకుంటున్నారని భరత్ చెప్పు కొచ్చారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దని ఆయన విన్నవించారు. పవన్ ఢిల్లీలో చేసే పనుల్నీ నవ్వు లాటగా ఉన్నాయన్నారు. మిత్ర ధర్మం పాటించని పవన్‌ను ఢిల్లీ పెద్దలు ఎందుకు గౌరవిస్తారని ఎంపీ ప్రశ్నించారు.
గతంలో పాచిపోయిన లడ్డూలని బీజేపీ పెద్దల్ని విమర్శించిన పవన్‌కల్యాణ్, మళ్లీ ఏ సఖ్యత కోసం ఢిల్లీ వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ రెండు రోజులు కనపడితే, మూడు రోజులు కనపడడని ఆయన ఎద్దేవా చేశారు.
బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ కోసం పవన్ ఎదురు చూడడం జనసేన శ్రేణుల్ని సైతం ఆవేదనకు గురి చేస్తోంది. ఏపీలో పెద్ద హీరోగా అభిమానాన్ని పొందిన పవన్‌కల్యాణ్ …ఢిల్లీలో బీజేపీ పెద్దల కోసం పడిగాపులు కాయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఈ మాత్రం దానికి ఢిల్లీ వెళ్లడం దేనికనే ప్రశ్న ఎదురవుతోంది.