జ‌గ‌న్ ఎదుట మ‌హిళా మంత్రి భావోద్వేగం

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎదుట మ‌హిళా యువ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. వేలాది మంది హాజ‌రైన బ‌హిరంగ స‌భ‌లో త‌న ఉన్న‌తికి కార‌ణ‌మైన జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పే క్ర‌మంలో ఆమె…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎదుట మ‌హిళా యువ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. వేలాది మంది హాజ‌రైన బ‌హిరంగ స‌భ‌లో త‌న ఉన్న‌తికి కార‌ణ‌మైన జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పే క్ర‌మంలో ఆమె ఆనంద భాష్పాలు రాల్చ‌డం అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఎమ్మెల్యేగా తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న చిలక‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఫ్యామిలీ డాక్ట‌ర్ కార్య‌క్ర‌మాన్ని సీఎం చేతుల మీదుగా మంత్రి ర‌జిని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి మాట్లాడుతూ సాధార‌ణ బీసీ మ‌హిళ అయిన త‌న‌కి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశం ఇవ్వ‌డంతో పాటు మంత్రిని చేశార‌ని కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. త‌న రాజ‌కీయ జీవితం, ప‌ద‌వులు, రాజ‌కీయ భ‌విష్య‌త్తు మీరు పెట్టిన భిక్షే అని జ‌గ‌న్‌ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఆనంద‌భాష్పాలు రాల్చ‌డం స‌భికుల్ని సైతం ఉద్వేగానికి లోను చేసింది.

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విడ‌ద‌ల ర‌జిని చిలక‌లూరిపేట టికెట్‌ను ద‌క్కించుకున్నారు. నాటి మంత్రి పుల్లారావుపై విజ‌యం సాధించారు. రెండో ద‌ఫా కేబినెట్‌లో అనూహ్యంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఎంతో మంది సీనియ‌ర్ నేత‌ల్ని సైతం కాద‌ని జ‌గ‌న్ కేబినెట్‌లో చోటు పొందారు. కీల‌క‌మైన వైద్యారోగ్య‌శాఖ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్నారు. త‌న‌ను రాజ‌కీయంగా ప్రోత్స‌హిస్తున్న వైఎస్ జ‌గ‌న్‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల సాక్షిగా ఆమె క‌న్నీటితో కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డం విశేషం. ఇదిలా వుండ‌గా ఈ స‌భ‌లో పంచ్ డైలాగ్‌ల‌తో చంద్ర‌బాబుపై మంత్రి విరుచుకుప‌డ్డారు.

నలుగురు ఎమ్మెల్యేలను కొనొచ్చేమో, నాలుగు టీవీలు.. పత్రికలు ఉండొచ్చేమో, నాలుగు పార్టీలతో పొత్తు ఉండొచ్చేమో  కానీ, గుర్తు పెట్టుకోండి చంద్రబాబూ నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో మీరు ఎప్పటికీ ఉండర‌ని తేల్చి చెప్పారు. ఆ స్థానం జగనన్నదంటూ సీఎం అభిమానాన్ని మంత్రి రజిని చూర‌గొన్నారు. దుష్టచతుష్టయం ఎన్ని పన్నాగాలు పన్నినా, భూమి చీలినా, నింగి కుంగినా, అన్యాయానికి ఓటమి తప్పదని హెచ్చ‌రించారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఓటమి, జగనన్నకు గెలుపు తథ్యమని మంత్రి రజిని హుషారుగా చెప్పారు.