క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా?

తెలంగాణాలో బీజేపీ, బీఆర్ఎస్ యుద్ధం మొద‌లైంది. బండి సంజ‌య్ అరెస్ట్‌తో కేసీఆర్ తెగే వ‌ర‌కూ లాగారు. ఇక దూష‌ణ‌లు, ప్ర‌తిదూష‌ణ‌లు పేప‌ర్ లీకేజీ కేసులో సంజ‌య్ నేరం చేశాడ‌ని పెద్ద‌గా ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు.…

తెలంగాణాలో బీజేపీ, బీఆర్ఎస్ యుద్ధం మొద‌లైంది. బండి సంజ‌య్ అరెస్ట్‌తో కేసీఆర్ తెగే వ‌ర‌కూ లాగారు. ఇక దూష‌ణ‌లు, ప్ర‌తిదూష‌ణ‌లు పేప‌ర్ లీకేజీ కేసులో సంజ‌య్ నేరం చేశాడ‌ని పెద్ద‌గా ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. ప‌రీక్ష‌కి ముందే పేప‌ర్ బ‌య‌టికి వ‌స్తే కుట్ర కానీ, ప్రారంభ‌మైన త‌ర్వాత బ‌య‌టికి వ‌స్తే పెద్ద‌గా జ‌రిగే డ్యామేజీ లేదు. పైగా వాట్స‌ప్‌, ఫోన్‌కాల్స్ ద్వారా కేసును నిరూపించ‌లేరు. 

మామూలు మ‌నుషుల‌కే ప్ర‌తిరోజూ త‌లాతోకా లేని మెసేజ్‌లు, సేల్స్ ఫోన్ కాల్స్ వ‌చ్చే ఈ రోజుల్లో రాజ‌కీయ నాయ‌కులకు ఎన్ని వ‌స్తాయో ఊహించుకోవ‌చ్చు. పోటీ ప‌రీక్ష‌ల లీకేజీతో ఆల్రెడీ ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌చ్చింది, ఈ టెన్త్ పేప‌ర్‌తో బీజేపీకి రాజ‌కీయంగా లాభం కూడా లేదు.

అయినా ఒక‌వేళ బండి సంజ‌య్ అతి ఉత్సాహం చూపి వుంటే అది ఆయ‌న అజ్ఞానం. ఆయ‌న చ‌ర్య పార్టీకి చుట్టుకుంది కాబ‌ట్టి బీజేపీ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డుతుంది. అరెస్ట్ ఒక కుట్ర‌ని రాష్ట్ర‌మంతా ఆందోళ‌న‌లు చేస్తుంది. ఎక్క‌డిక‌క్క‌డ బీఆర్ఎస్‌పై నిప్పులు చెరుగుతోంది. ఇరువైపులా బ‌లం వుంది కాబ‌ట్టి ప్ర‌తిఘ‌ట‌న కూడా వుంటుంది.

పేపర్ లీకేజీ ఆర్థిక నేరం కాదు. అయితే పిల్ల‌ల భ‌విష్య‌త్తును కూడా లెక్క చేయ‌కుండా బీజేపీ రాజ‌కీయ కుట్ర చేస్తోంద‌ని బీఆర్ఎస్ దాడి చేస్తుంది. దీనికి ప్ర‌తిదాడి చేయ‌డానికి బీజేపీ ద‌గ్గ‌రున్న ఆయుధం క‌విత అరెస్ట్‌. లిక్క‌ర్ స్కామ్‌లో వంద‌ల కోట్లు చేతులు మారాయ‌ని అభియోగం. కేసులో వేగం పెంచితే అరెస్ట్ జ‌ర‌గ‌వ‌చ్చు. పేప‌ర్ లీకేజీ కంటే ఆర్థిక నేరాలకి జ‌నం ఎక్కువ స్పందిస్తారు.

అయితే సిసోడియాని అరెస్ట్ చేసినంత ఈజీ కాదు, క‌విత‌ని అరెస్ట్ చేయ‌డం. లెక్క‌లు చూసుకోవాలి. ఢిల్లీలో ఎన్నిక‌లు లేవు, త‌క్ష‌ణ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు లేవు. తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు. క‌విత‌ని వేధిస్తున్నార‌ని జ‌నం న‌మ్మితే అస‌లుకే మోసం. అందుకే ఆచితూచి ఆలోచిస్తున్నారు.

ఇదంతా కేసీఆర్ స్వ‌యంకృతాప‌రాధం. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ అడ్ర‌స్ లేకుండా పోయింది. కాంగ్రెస్‌ని చంపేస్తే ఎదురు లేద‌నుకున్నాడు. కాంగ్రెస్ మీద న‌మ్మ‌కం పోయేస‌రికి, జ‌నం ప్ర‌త్యామ్నాయంగా బీజేపీని ఎంచుకున్నారు. కేసీఆర్ కూతురిని కూడా ఓడించారు. తానే స్వ‌యంగా బీజేపీకి కేసీఆర్ ప్రాణం పోశాడు. 

ఎన్నిక‌లు ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి న‌ష్ట నివార‌ణ‌గా బీఆర్ఎస్ పెట్టాడు. బీజేపీకి హెచ్చ‌రిక చేయాల‌నుకున్నాడు. స‌త్తా చూపుతాన‌న్నాడు. క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో ఉనికిలో కూడా లేదు. రేపు ఆంధ్రా అయినా అంతే. త‌న బ‌లాన్ని అతిగా ఊహించుకుని, బీజేపీని త‌క్కువ అంచ‌నా వేసిన ఫ‌లితం ఇది.