సినిమా వేరు, రాజకీయం వేరు. అక్కడ డబ్బులు ఇచ్చి చప్పట్లు కొడతారు. ఇక్కడ డబ్బులు తీసుకుని చప్పట్లు కొడతారు. అక్కడ ఒక పాటలో కోటీశ్వరుడైపోవచ్చు, నాయకుడైపోవచ్చు. ఇక్కడ పదేళ్ల నుంచి చప్పట్లు కొట్టినా, పాటలు పాడినా ఏమీ కాలేదు. ఎందుకంటే ఇది రియాల్టీ. అది భ్రాంతి.
పవన్‌కల్యాణ్‌కి ఇప్పటికైనా తత్వం బోధపడిందో లేదో తెలియదు. అంతన్నాడు, ఇంతన్నాడు గంగరాజని ఢిల్లీకి వెళ్లాడు. ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీతో కలిసి వుండాలో లేదో తెలియని స్థితి. ఇంత కాలం రాష్ట్ర నాయకత్వం కలిసి రావడం లేదన్నాడు. ఇప్పుడు కేంద్రం మాత్రం ఏం పట్టించుకుంది?
ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ముందస్తు అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అది కూడా జగన్ చేతిలో లేదు. కేంద్రం సానుకూలంగా వుండి, ఎన్నికల కమిషన్ అంగీకరించాలి. ఒకవేళ ముందస్తు లేదనుకున్నా గట్టిగా ఏడాది సమయం వుంది. చివరి రెండు నెలలు అంతర్గత సర్దుబాట్లు, బహిరంగ ప్రచారంతో అయిపోతుంది. మిగిలింది పది నెలలు. ఈ గ్యాప్‌లో నెత్తి మీద ఉన్న సినిమాలు చేస్తూ, పార్టీని నిలబెట్టాలి. ఇది సినిమాల్లో సాధ్యమేమో కానీ, ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు.
ఇప్పుడు ఆయన ముందున్నది బీజేపీతో కలిసి వుండాలా? లేదా? కలిసే ఉందామని అనుకుంటే టీడీపీ పొత్తుకి ఏ మేరకు సహకరిస్తుందో తెలియదు. బీజేపీతో వుంటే వామపక్షాలు దగ్గరికి రావు. సరే వాళ్లు వచ్చినా, ప్రయోజనం అంతంతే. బీజేపీ లేకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బేరసారాల స్థాయి ఎంత? ఎక్కడా కూడా కనీస కమిటీలు, కేడర్ లేని పార్టీకి టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది? ప్రభుత్వం అంటూ వస్తే పవన్ పొజీషన్ ఏంటి? సీఎం ఎలాగూ ఇవ్వరు.
కనీసం డిప్యూటీ అయినా ఇస్తారా? నంబర్ -2 కొడుకు లోకేశ్ వుండగా పవన్‌కి పెద్ద పీట వేయడానికి చంద్రబాబు ఏమైనా పిచ్చోడా? ఈ ఎత్తుగడల్లో సమర్థంగా వ్యవహరించడానికి పార్టీలో ఎవరైనా పెద్ద తలకాయలున్నారా? పదేళ్ల నుంచి పవన్, నాదెండ్ల, ఇప్పుడు నాగబాబు తప్ప, ఇంకెవరైనా కనిపించారా? వీళ్ల ముగ్గురిలో ఒక్కరికైనా రాజకీయ పరిజ్ఞానం, పరిపక్వత ఉన్నాయా? అభిమానుల ఈలలు నమ్ముకుని జల్లికట్టులోకి దిగుతున్న పవన్ అమాయకుడా? మూర్ఖుడా?
వైసీపీకి తొడలు కొట్టి, కొడకల్లారా అని తిడితే ఓట్లు పడతాయా? ఎన్నికల్లో గెలవాలంటే ఎన్నో వ్యూహ ప్రతివ్యూహాలు కావాలి. ప్రతి నియోజకవర్గంలో గట్టి కార్యకర్తలు కావాలి. బూత్ మేనేజ్‌మెంట్ నిర్వహించే శక్తివంతులు అవసరం. ఇప్పటికైనా ఆ దిశగా ప్రయత్నం జరుగుతూ వుందా?
వారాహి అని పెద్ద వెహికల్ తెచ్చి హడావుడి చేశారు. ఏమైంది అది? షెడ్‌లో రిపేర్ చేస్తున్నారా? లోకేశ్ యాత్రకి అడ్డమని వాయిదా వేసుకున్నారు. అభిమానులు ఎదురు చూసి వూసూరుమన్నారు. తన మాటకి ఎదురు చెప్పని పవన్‌కి చంద్రబాబు ధర్మబద్ధంగా సీట్లు ఇస్తాడా? న్యాయం, ధర్మం తన డిక్షనరీలోనే లేని చంద్రబాబు, చివరికి జనసేనలోకి కోవర్టులని పంపి పవన్‌ని పొలిటికల్ జోకర్‌గా మార్చడని గ్యారెంటీ ఏమైనా వుందా? పవన్ అసెంబ్లీలో అడుగు పెడితే చూడాలని ఆయన ప్రత్యర్థులకి కూడా వుంది. కనీస సీట్లతో అడుగు పెడితే గౌరవం. లేదంటే పరాభవం.
రాజకీయం తెలియకపోవడం తప్పు కాదు. కానీ పదేళ్లుగా తెలుసుకోలేక పోవడం ముమ్మాటికీ తప్పే!