జనసేనాని పవన్‌కల్యాణ్‌ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ఆడిన డ్రామాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. బాబు ఎంతో ముందు చూపుతో వ్యూహం రచించినప్పటికీ, అది సత్ఫలితాలు ఇవ్వలేదు. బీజేపీపై బాబు సంధించిన పవన్‌కల్యాణ్ అస్త్రం తుస్సుమంది. సమయం, సందర్భం లేకుండా పవన్‌కల్యాణ్ తమతో పొత్తుకు వెంపర్లాడడం వెనుక దురుద్దేశాన్ని బీజేపీ ముందే పసిగట్టింది. పవన్ పొత్తు ప్లాన్ వెనుక మాస్టర్ మైండ్ చంద్రబాబుదని బీజేపీ పెద్దలు పసిగట్టారు. అందుకే పవన్‌కల్యాణ్ ఆటలేవీ సాగలేదు.
బీజేపీతో పవన్ పొత్తు కుదుర్చుకోవడం వెనుక కారణాలేంటో ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోగానే చంద్రబాబు అప్రమత్తం అయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టి, విస్తృతంగా ప్రచారం చేయడంతో చంద్రబాబుపై బీజేపీ గుర్రుగా ఉంది. దీంతో రాజకీయంగా తనపై బీజేపీ కన్నెర్ర చేస్తుందని చంద్రబాబు భయపడ్డారు. ఈ నేపథ్యంలో తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపి, కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. ఇంతటితో బీజేపీ ఆగ్రహం తగ్గదని బాబు గ్రహించినట్టున్నారు.
ఈ సందర్భంగా పవన్ అస్త్రాన్ని వ్యూహాత్మకంగా ప్రయోగించారు. పొత్తు పేరుతో నాటకానికి తెరలేపారు. బీజేపీ పెద్దల దగ్గరికి పదేపదే పవన్‌ను పంపారు. బాబు ఆదేశిస్తే చాలు… వెనుకా ముందూ, మంచీచెడూ ఆలోచించకుండా చేయడానికి పవన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారనే ప్రచారం గురించి తెలిసిందే. అందుకు తగ్గట్టే పవన్ కూడా వ్యవహరించారు. ఇదేంటబ్బా… ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కదా, తమతో పొత్తు కోసం పవన్ ఎందుకు తహతహలాడుతున్నారని బీజేపీకి అనుమానం వచ్చింది. పైగా సార్వత్రిక ఎన్నికల్లో కనీసం తమకు అరశాతం ఓట్లు కాని రాని సంగతి తెలిసి కూడా పవన్ ఆసక్తి చూపడం ఏంటని లోతుగా ఆలోచించింది.
సరే, తనకు తానుగా వస్తున్నప్పుడు కాదనడం ఎందుకులే అని బీజేపీ నేతలు అనుకున్నారు. మొత్తానికి అతి కష్టమ్మీద బీజేపీతో పవన్ పొత్తు కుదిరింది. అప్పటి నుంచి సీఎం జగన్‌కు సహాయ నిరాకరణ చేయాలంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం స్టార్ట్ చేశారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రులెవరూ తరచూ అపాయింట్‌మెంట్స్ ఇవ్వకూడదనే షరతులు పెట్టడం మొదలు పెట్టారు. అప్పుడు అర్థమైంది…పొత్తు కోసం పవన్ ఎందుకు వెంపర్లాడారో. ఇదంతా చంద్రబాబు బుర్రలో నుంచి పుట్టిన దుర్బుద్ధిగా బీజేపీ పెద్దలు గ్రహించారు.
పవన్‌ను పట్టించుకోవడం మానేశారు. దీంతో బీజేపీతో కలిసి పని చేయడానికి పవన్ ఇష్టపడలేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు లక్ష్యం నెరవేరదని అతి తక్కువ సమయంలోనే పవన్‌కు అర్థమైంది. ఎక్కడైనా కుక్క తోకని ఆడిస్తుంది. కానీ తోక కుక్కను ఆడించడం చూశామా? రాజకీయాల్లో తోక అనే పవన్ కల్యాణ్ దేశంలోనే అత్యంత శక్తిమంతమైన బీజేపీని ఆడించాలని అనుకుని అభాసుపాలయ్యారు. ఇప్పుడాయన బీజేపీ చేతిలో తనకు తెలియకుండానే ఇరుక్కున్నారు. ఇప్పుడు వారి నుంచి వేరు పడడం ఎలాగో పవన్‌కు అర్థం కావడం లేదు.
సదాశయంతో బీజేపీతో పొత్తు పెట్టుకుని వుంటే ఈ దురవస్థ వచ్చేది కాదు. ఒకవైపు పవన్ వంచన గురించి బీజేపీకి తెలిసొచ్చింది. కాదు, కూడదని బీజేపీతో వేరు పడితే… ఏం జరుగుతుందో అనేక ఉదంతాలు కళ్లెదుటే ఉన్నాయి. ఆ భయమే పవన్‌ను వెంటాడుతోంది. దిక్కుతోచని స్థితిలో పవన్ ఏదేదో మాట్లాడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు, పవన్ పప్పులు బీజేపీ వద్ద ఉడకలేదు. బీజేపీపై చంద్రబాబు విసిరిన పవన్ అస్త్రం అట్టర్ ప్లాప్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.