‘ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే’ అనం సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. సొంత ప్రయోజనం లేకుండా ఎవ్వరూ ఏ పనీ చేయరు.. అనేది దీని భావం. మామూలు భాషలో మనం దీనిని స్వార్థం అంటుంటాం. అది తప్పేమీ కాదు. కానీ, తన స్వార్థం లేకుండా ఏ పనీ చేయకపోవడం వరకు భరించవచ్చు, అదే సమయంలో తన స్వార్థం కోసం ఇతరుల్ని బలి తీసుకునేలా వ్యవహరిస్తానంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? అలాంటి స్వార్థ బుద్ధి వారి పట్ల ఎవరికైనా భయమే తప్ప నమ్మకం ఉండదు.
చంద్రబాబునాయుడు తాజాగా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఒక కథ చెప్పారు. విశాఖకు రాజధాని వస్తున్నదంటే.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే ఓర్వలేక అక్కడి ప్రజల్లో భయాలను వ్యాప్తి చేయడం మాత్రమే లక్ష్యంగా బతుకున్న చంద్రబాబునాయుడు.. అదే ప్రయత్నం మరోసారి చేశారు.
విశాఖలో భూకబ్జాలు జరుగుతున్నాయని ప్రస్తావిస్తూ నలభై వేల కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నదని గాలిలో ఆరోపణలు చేశారు. అలాగే ‘‘నాకు తెలిసిన వ్యక్తి ఆస్తిని రాయించుకున్నారని తెలిసి, ఆయనతో మాట్లాడా. మీ తరఫున పోరాడతా అన్నా. కానీ వారు భయపడి వద్దన్నారు..’ అంటూ తను చెప్పదలచుకున్న కథలో కేరక్టర్ల పేర్లు వివరాలు లేకుండా జాగ్రత్తగా అల్లి వినిపించారు.
ఒకవేళ ఆయన చెప్పింది నిజమే అనుకుందాం. చంద్రబాబునాయుడు స్వయంగా ఫోను చేసి నీ తరఫున పోరాడతా అని అన్నారంటే, ఆయనెవరో గానీ బాబు గారికి చాలా దగ్గరి స్నేహితుడే, పరిచయస్తుడే అయి ఉండాలి. లేకపోతే ఏదో పార్టీ కార్యకర్తల ద్వారా అటువైపునుంచి ‘మాకోసం పోరాడాలంటూ’ వినతులు వస్తాయ తప్ప ఇటునుంచి ఉండదు. మరి చంద్రబాబుకు అంతటి పరిచయస్తుడు, తన కష్టార్జితమైన భూమి పోతే.. చంద్రబాబు అంతటి వాడు పోరాడుతానని అంటూ ఎందుకు భయపడ్డాడు? దాని అర్థం మూడేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఉన్న చంద్రబాబునాయుడు ను ఆయన స్నేహితుడు కూడా నమ్మడం లేదన్నమాట.
అధికారంలో ఒక పార్టీ ఉన్నంత మాత్రాన, ఆస్తిని రాసివ్వమని అడిగితే.. ఎవరు పడితే వాళ్లు రాసిచ్చేస్తారా? లీగల్ తగాదాలు ఉన్నవారు మాత్రమే ఆస్తుల్ని తక్కువ ధరకు అమ్ముకుంటారు. తతిమ్మా ఎవ్వరూ ధర కూడా తగ్గరు.
ఆయనెవరో గానీ, చంద్రబాబు చెప్పినట్టుగా భయపడిన మాట నిజం. కానీ, పోరాటం మొదలైతే ఎవరో తనను ఏదో చేస్తారని కాదు. పోరాటం పేరు చెప్పి తన జీవితాన్ని బజారుకీడ్చి చంద్రబాబునాయుడు తన స్వార్థానికి వాడుకుంటాడేమో అని. చంద్రబాబు తీరు తెలిసిన వారు ఎవ్వరైనా ఆయన తమను వాడుకుంటారే తప్ప.. తమకు న్యాయం జరగడానికి పోరాడరని అర్థం చేసుకుంటారు. అందుకే చంద్రబాబు వినిపించిన కబ్జాల కథ పండలేదు. రక్తి కట్టలేదు. ఆయన మీద అపనమ్మకాన్నే అది ధ్వనించింది.
చంద్రబాబునాయుడు చేసే పోరాటాలు అంటే.. ఎవరికీ నమ్మకం లేదని నిరూపించింది. ఆయన ఏం చేసినా ఆయన స్వార్థం కోసమే చేస్తారు తప్ప ప్రజల కోసం కాదని అందరూ గ్రహిస్తున్నారనడానికి ఇది తార్కాణం.