మోత్కుపల్లి ఇక సన్యాసం తీసుకున్నట్లేనా?

మళ్లీ రాజకీయ అధికార వైభవం వెలగబెట్టడానికి రకరకాల ప్రయోగాలు చేసిన సీనియర్ నాయకుడు  మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు  ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. మోత్కుపల్లి నరసింహులు అంటే,…

మళ్లీ రాజకీయ అధికార వైభవం వెలగబెట్టడానికి రకరకాల ప్రయోగాలు చేసిన సీనియర్ నాయకుడు  మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు  ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. మోత్కుపల్లి నరసింహులు అంటే, చంద్రబాబు నాయుడును నమ్ముకుని రాజకీయంగా అందలాలు ఎక్కవచ్చునని ఆశలు పెంచుకొని పూర్తిస్థాయిలో భ్రష్టు పట్టిపోయిన నాయకుడు. టెక్నికల్ గా చూస్తే ఆయన ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీలోనే ఉన్నారు.  

తనకు ఎమ్మెల్యే టికెట్లు దక్కుతాయని ఆశపడి ఇన్నాళ్లూ ఆ పార్టీలో కొనసాగారు. కేసీఆర్ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేసిన తర్వాత.. మోత్కుపల్లికి మబ్బులు తొలగాయి. ఇప్పుడిక ఏం ఆలోచన వచ్చిందో గానీ.. మళ్లీ చంద్రబాబునాయుడు పాట పాడుతున్నారు.

చంద్రబాబునాయుడు అరెస్టును అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఖండించాలట. ఆయనను అరెస్టు చేసినందుకు ప్రజలు జగన్ కు గుణపాఠం చెబుతారట. అలాగని ఆయన జోస్యం చెబుతున్నారు.

మోత్కుపల్లి నర్సింహులు.. రాష్ట్రవిభజన తర్వాత తెలుగుదేశం పతనం అయిపోయినప్పటికీ.. చంద్రబాబును నమ్ముకుని ఆ పార్టీలోనే చాలాకాలం కొనసాగారు. చంద్రబాబునాయుడు రాజ్యసభ సభ్యత్వంగానీ, భాజపాతో కలిసి ఊరేగుతున్నాడు గనుక.. తనకు గవర్నరు పోస్టుగానీ ఇప్పిస్తారని మోత్కుపల్లి కలలు కన్నారు. 

కానీ, చంద్రబాబునాయుడు తన అవసరాలకు ఇతరులను వాడుకోవడమే తప్ప.. వారికి ఉపయోగపడే రకం కాదని ఆయనకు స్పష్టత రావడానికి చాలా కాలం పట్టింది. తర్వాత తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెసులోకి వెళ్లారు. అక్కడి సమీకరణాలు ఎందుకు చేదుగా అనిపించాయో తెలియదు గానీ.. తర్వాత.. భారాసలోకి వెళ్లారు. కేసీఆర్ కి ఒకప్పటి సహచరుడుగా, సీనియర్ గా తనను నెత్తిన పెట్టుకుంటారని ఊహించారు. కానీ అలా జరగలేదు. ఆయన ఆశించిన ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు భారాసను కూడా వీడుతారనే ప్రచారం జరుగుతోంది.

సడెన్ గా చంద్రబాబునాయుడును కీర్తించడం చేస్తున్నారు. జగన్ ను నమ్మి ఏపీ ప్రజలు మోసపోయారట. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోత్కుపల్లి ఎన్టీఆర్ ఘాట్ లో నిరసన దీక్షచేపడతారట. చంద్రబాబు కోసం ఆయన సొంత పార్టీ వాళ్లు చేస్తున్న దీక్షలే మొక్కుబడిగా సాగుతున్నాయి. 

ఇక తెలంగాణలో ఎవ్వరికీ అవసరం లేని నాయకుడుగా మిగిలిపోయిన మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేస్తే ఎవరు పట్టించుకుంటారు? అనేది అర్థం కావడం లేదు. ఆయన ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనని.. అందుకే తెలంగాణలో శవాసనం వేసిన తెలుగుదేశం అధినేతను కీర్తిస్తూ పొద్దుపుచ్చుతున్నారని ప్రజలు  అనుకుంటున్నారు.