తమ పార్టీ ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీలు త్యాగాలకు సిద్ధం కావాలని ఆయన ప్రకటించారు. ఒకవేళ మండలి రద్దు అయితే.. తెలుగుదేశం పార్టీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎమ్మెల్సీ పదవులు పోతే సదరు నేతలు ఎంతమంది తెలుగుదేశంలో ఉంటారో కూడా ఎవరికీ తెలియదు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వారికి త్యాగధనులు కావాలనే పిలుపును ఇచ్చారు.
త్యాగం చేస్తే చరిత్రలో నిలిచిపోతారంటూ చంద్రబాబు నాయుడు వారిని ఊరడింపు ప్రకటనలు కూడా చేశారు. అయితే అలాంటి మాటలతో ఎంతమంది సమాధానపడతారు..అనేది సందేహమే. మండలిలో మళ్లీ వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం చర్చకు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు గనుక ఎమ్మెల్సీలు మళ్లీ అడ్డుపడితే మండలి రద్దుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. అలా కాకుండా వ్యవహారం సాఫీగా సాగిపోతే.. మండలి రద్దు కాకపోవచ్చు అనే అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మరింత ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది. తమ పార్టీ ఎమ్మెల్సీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేస్తోందంటూ తెలుగుదేశం ఆరోపిస్తూ ఉంది. భారీగా డబ్బులను ఆఫర్ చేస్తూ ఉన్నారని టీడీపీ నేతలు అంటున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీలకు వైసీపీ నేతలు ఐదు కోట్ల రూపాయల వరకూ ఆఫర్ చేస్తున్నారని, దాంతో పాటు మళ్లీ పదవులు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని.. టీడీపీ ఆరోపిస్తూ ఉంది. అయితే ఆ ఆఫర్లను తమ వాళ్లు రిజక్ట్ చేస్తూ ఉన్నారని కూడా టీడీపీ చెబుతోంది. మరి రిజక్ట్ చేస్తున్నట్టు అయితే ఇక టీడీపీకి భయమెందుకో!