మండలి రద్దు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ మంతనాలే సాగించినట్టుగా తెలుస్తోంది. మండలి రద్దు ఊహాగానాలకు ఊతం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సోమవారం ఆ అంశంపై శాసనసభలో చర్చ కూడా జరగనుంది. మండలి రద్దు తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే మండలి రద్దు గురించి ఏపీ ప్రభుత్వం వద్ద కొన్ని పునరాలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇదే సమయంలో వికేంద్రీకరణ బిల్లు సెలెక్టివ్ కమిటీ వద్దకు వెళ్లలేదని మండలి చైర్మన్ షరీఫ్ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. ఆ బిల్లు అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో మండలిలో మళ్లీ ఆ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లూ చేసుకుని మళ్లీ ఆ బిల్లులను మండలిలో ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో మండలి సభ్యులు ప్రభుత్వానికి అనుగుణంగా దారికి వస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మండలి తన పరిమిత పాత్రకు అనుగుణంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో మండలి రద్దు కన్నా దాన్ని దారికి తెచ్చుకునేందుకే ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వవచ్చు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా రేపటితో ఈ అంశంపై పూర్తి స్పష్టత రావొచ్చు.