లోకేశ్ అంటే సాక్షి మీడియాకి, వైసీపీ నేతలకు చాలా అలుసైంది. తమ అధినేత వైఎస్ జగన్‌ను ఎప్పటికైనా కాపాడేది లోకేశ్ మాత్రమేననే కనీస కృతజ్ఞత కూడా వారికి ఉండటం లేదు. లోకేశ్ పరువు తీయడం అంటే తమ పరువు తీసుకోవడమే అనే కనీస స్పృహ ఆ సాక్షి పత్రికకి ఉంటే ఇలా చేసేవారా?
“చినబాబు చిరుతిండి -రూ.25 లక్షలండి” శీర్షికతో 2019, అక్టోబర్ 22న సాక్షిలో ప్రచురించారు. కోటి విద్యలు కూటి కోసమే అని పెద్దలు ఊరికే చెప్పారా? ఆ మాత్రం కామన్ సెన్స్ ఆ సాక్షికి ఉన్నట్టు లేదు. అయినా లోకేశ్ ఊళ్లో లేనప్పుడు రూ.25 లక్షల చిరుతిండి తిన్నారని రాస్తే ఎలా? కనీసం ఊళ్లో ఉంటే, సాక్షి చెప్పినంత కాకపోయినా, ఎంతోకొంత తిని ఉంటారులే అనుకోవచ్చు.
పాపం చినబాబు మనసు ఎంత విలవిలలాడి ఉంటుందో కదా? లోకేశ్ మనసును సాక్షి హర్ట్ చేసింది. ఏం తమాషా…అందుకే వాళ్లు రూ.25 లక్షలు తిండి అని రాస్తే…లోకేశ్ ఊరుకుంటాడా? జగన్మోహన్‌రెడ్డి ముక్కు పిండి రూ.75 కోట్లు రాబట్టి….అప్పుడు తన తడాఖా ఏంటో చూపాలనుకున్నాడు లోకేశ్.
లోకేశ్ అంటే అందరికీ లోకువే. పరువు నష్టం కింద జగన్ నుంచి రూ.75 కోట్లు వసూలు చేశాక ఆ సాక్షి, వైసీపీ వాళ్లు ఊరుకునే రకమా? ఈ సారి “చినబాబు చిరుతిండి -రూ.75 కోట్లు” అని రాస్తారేమో. అయినా మీరేమైనా అనుకోండి లోకేశ్ గారూ, మీ పరువు బరువు కేవలం రూ.75 కోట్లంటే నాన్న చంద్రబాబు గారికే అవమానం కదా సార్. రాజకీయాల్లో నాన్నది 40 ఏళ్ల ఘన చరిత్ర. ఇందులో 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవం. అలాంటిది ముష్టి రూ.75 కోట్లకు దావా వేసి….ఇప్పుడు నాన్నగారి పరువు పోగొట్టావ్ కదా సార్! ఏ రూ.750 కోట్లకు దావా వేసి ఉంటే కాస్తా పరువు దక్కేదేమో సార్.