బండి సంజయ్ ను అరెస్టు చేయాలన్న కోరిక భారత రాష్ట్ర సమితి పెద్దలకు ఇవాళ్టిది కాదు. ఆయన కేసీఆర్, కేసీఆర్ కుటుంబ అవినీతి మీద పోరాటం అంటూ కూచోవడమే కాకుండా, ముఖ్యమంత్రి మీద ఇతర విమర్శలతో తీవ్రంగా విరుచుకుపడడం వారిని చాలాకాలంగా చికాకు పెడుతోంది.
పైగా గులాబీ తనయ కవిత పేరు లిక్కర్ స్కామ్ లో ప్రముఖంగా ప్రచారంలోకి రావడం.. ఆ నేపథ్యంలో ఆమెను ఈడీ దఫదఫాలుగా విచారించడం, అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడం, ముందుగానే కేసీఆర్ కూడా తన కూతురిని అరెస్టు చేస్తారంటూ ప్రకటనలు చేయడం లాంటి వ్యవహారాలు నడిచాయి.
కవితను బిజెపి అరెస్టు చేస్తే.. దానికి కౌంటర్ గా బండి సంజయ్ ను కూడా ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆ సమయంలో బాగా జరిగింది. కేసీఆర్ కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేశారని కొన్ని కేసులు ఆయనపై నమోదయ్యాయి.
అరెస్టు చేయడానికి వీలయ్యేలా.. ఎమ్మెల్సీ కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా పలుచోట్ల బండి సంజయ్ మీద అనేక కేసులు భారాస కార్యకర్తలు నమోదు చేశారు. ఈ రకంగా బండి సంజయ్ ను చాన్సు దొరికితే అరెస్టు చేయడానికి భారాస చాలాకాలంనుంచి వ్యూహాత్మక ఎత్తుగడలతోనే ఉంది. అయితే ఆ వ్యవహారాల్లో వారు ఎంత ప్రయత్నించినా.. అరెస్టు వరకు వెళ్లలేకపోయారు.
కానీ.. పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ అనే విషయంలో అనుకోకుండా హఠాత్తుగా బండి సంజయ్ ను అరెస్టు చేసి రెండు వారాల రిమాండుకు జైలుకు పంపే అవకాశం వారికి దొరికింది. నిజానికి అధికార పార్టీ ప్రయత్నపూర్వకంగా బండిని అరెస్టు చేయాలని వలపన్నినప్పుడు వారి పాచిక పారలేదు. కానీ ఇప్పుడు ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో ఆయన స్వయంగా వచ్చి ఇరుక్కున్నట్టు అయింది.
ఎవడో ఒక కుర్రవాడు బడిలోంచి ప్రశ్నపత్రం ఫోటోలు తీసుకుని దానిని వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేస్తే.. అక్కడినుంచి అది విపరీతంగా వైరల్ అయింది. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి బండి సంజయ్ అనేది పోలీసుల ఆరోపణ. రాష్ట్రప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ఆయన తన వారిద్వారా ఇలాంటి కుట్రకు తెరలేపారనే ఆరోపణలు వారు చేస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలను వారు కోర్టు ఎదుట ఎంతవరకు నిరూపించగలరు? అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతానికి బండి సంజయ్ ను జైల్లో పెట్టడం వరకు పాలకపక్షం అహం చల్లారుతుందేమో గానీ.. ఆయనను పూర్తిగా నేరస్తుడిగా నిరూపించడం కష్టమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.