తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన ఫలితం రావడంతో.. ఇప్పుడు అందరి దృష్టీ ఏపీలోని తిరుపతిపై పడింది. అక్కడా ఇక్కడా ఉప ఎన్నికకు కారణం ఒకటే. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరణించడంతో దుబ్బాకలో ఎన్నిక వచ్చింది.
అధికార వైసీపీకి చెందిన ఎంపీ మరణించడంతో తిరుపతిలో బైపోల్ వస్తోంది. తెలంగాణలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండిటికీ షాకిచ్చి మూడో పార్టీ విజయం సాధించడంతో.. ఏపీలో కూడా అలాంటి ఊహించని పరిణామం జరుగుతుందని కొందరు ఆశ పడుతున్నారు.
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీని కాదని, జనసేన-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు కొంతమంది. అయితే కూటమి విషయంలోనే ఇప్పుడు కొత్త చిక్కులు పుట్టుకొచ్చేలా కనిపిస్తున్నాయి.
కూటమి తరపున తిరుపతిలో బీజేపీయే పోటీ చేయాలని దాదాపుగా ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు, సభలు, సమావేశాలు పెట్టుకుంటున్నారు. కానీ జనసేనకు కూడా తిరుపతి బరిలో దిగాలనే ఆలోచన బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది.. దీనికి ఆ పార్టీ నేతలు రకరకాల కారణాలు చెబుతున్నారు.
తిరుపతి ఎమ్మెల్యేగా గతంలో చిరంజీవి గెలిచారని, అప్పట్నుంచి ప్రజారాజ్యానికి ఆ తర్వాత జనసేనకు అక్కడ విపరీతమైన ఫాలోయింగ్ ఉందని అంటోంది జనసేన సైన్యం.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాస్తో కూస్తో జనసేన బలంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా పరిధిలో వచ్చే నియోజక వర్గాల్లో తమ సత్తా చూపిస్తామని ఉవ్విళ్లూరుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువగా జనసేనకు ఓట్లు వచ్చాయని రుజువులు కూడా చూపిస్తున్నారు.
ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ కి కూడా తిరుపతి సెంటిమెంట్ బాగా ఉందట. ఓ దశలో పవన్ పోటీ చేసే రెండు నియోజకవర్గాల్లో ఒకటి తిరుపతిగా ఖరారు చేశారని, ఆ తర్వాత మరీ ఎక్కువగా కుల ఈక్వేషన్స్ వేసుకుని తిరుపతిని పక్కనపెట్టారని చెబుతారు.
అలా అప్పుడు పవన్ తిరుపతిని మిస్ అయ్యారని, లేకపోతే అక్కడ జనసేన జెండా రెపరెపలాడేదని, అన్నని అసెంబ్లీకి పంపిన తిరుపతి ప్రజలు, అదే నియోజకవర్గం నుంచి తమ్ముడ్ని కూడా ఆదరించేవారని జనసేన నాయకుల అభిప్రాయం.
అయితే ఇప్పుడు పార్లమెంట్ విషయానికొచ్చేసరికి.. పవన్ నేరుగా బరిలో దిగే అవకాశాలు లేవు. ఇప్పటికే ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త జనసేన తరపున పోటీ చేయడానికి పవన్ చుట్టూ తిరుగుతున్నారని కూడా తెలుస్తోంది.
జనసేన ఆలోచనలు ఇలా ఉంటే.. అటు బీజేపీ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. మరి పవన్ కల్యాణ్ తిరుపతి విషయంలో అంతర్మథనం చెందుతూనే ఉంటారా? లేక తన కోరిక బైటపెట్టి, అధిష్టానం వద్ద మాట నెగ్గించుకుని జనసేన అభ్యర్థిని బరిలో దింపుతారా..? వేచి చూడాలి.