కుల, మతాల వారీగా ప్రజల్ని విభజించి రాజకీయాలు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. నిన్నమొన్నటి వరకూ కుల రాజకీయాలు చేసిన బాబు.. తాజాగా మతం ముసుగేసుకుని వస్తున్నారు. నంధ్యాలలో ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య ఘటనతో రాజకీయం చేయాలనుకున్న చంద్రబాబు.. ఆ వ్యవహారానికి పూర్తిగా మతం రంగు పులిమారు. ముస్లింలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందంటూ రెచ్చిపోయారు.
కట్ చేస్తే.. టీడీపీకి మతరాజకీయం పూర్తిగా రివర్స్ లో తగిలింది. నిందితులకు బెయిల్ ఇప్పించింది చంద్రబాబు పార్టీ మనిషేననే విషయం బయటపడ్డంతో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు బాబు. ప్రభుత్వంపై బురదజల్లడానికి తీసుకున్న బురద.. బాబు చేతులకే మట్టి అంటేలా చేసింది. ప్రజలంతా బాబు మత రాజకీయాల్ని బయటకు తీస్తున్నారు. బాబు హయాంలో జరిగిన దాడులన్నిటినీ ఏకరువు పెడుతున్నారు.
గతంలో గుంటూరులో నారా-హమారా పేరుతో జరిగిన సభలో.. ప్లకార్డులు పట్టుకున్న పాపానికి ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేసి, పోలీసులతో కొట్టించిన వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. మైనార్టీ బాలికపై జరిగిన దారుణాన్ని ప్రశ్నించినందుకు గుంటూరులో పోలీసులు ముస్లిం యువకులపై దేశద్రోహం కేసు పెట్టిన వ్యవహారం కూడా గతంలో టీడీపీ చేసిన తప్పుల్ని మరోసారి గుర్తు చేస్తోంది.
అన్నిటికంటే ముఖ్యమైనది రాజకీయంగా మైనార్టీలను బలిపశువుల్ని చేయడం. తన హయాంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు ముస్లింలపై దొంగ ప్రేమ నటిస్తున్నారంటూ వైసీపీ నేతలు దెప్పి పొడుస్తున్నారు. గతంలో ముస్లింలకు వైఎస్ఆర్ ప్రకటించిన రిజర్వేషన్లను కోర్టు కేసులతో చంద్రబాబు ఎలా అడ్డుకున్నారనే విషయం కూడా ఇప్పుడు ప్రస్తావనకు తెస్తున్నారు.
దీంతో సామాన్య ప్రజలందరికీ, టీడీపీ తను చేసిన తప్పుల్ని తానే మరోసారి గుర్తు చేసినట్టయింది. అంటే ఎరక్కపోయి ముస్లింలపై ప్రేమ ఒలకబోసిన చంద్రబాబు.. ఇప్పుడు వారితోనే చీవాట్లు తింటున్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో చంద్రబాబు చేసిన మత రాజకీయం కూడా ఇలాగే రివర్స్ ఆయనకు అయింది. జగన్ హిందువు కాదంటూ.. తిరుమల వెళ్లే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలంటూ నానా యాగీ చేశారు టీడీపీ నేతలు.
గతంలో జగన్ తిరుమల వెళ్లిన సందర్భంలో గొడవ చేయని బాబు, ఇప్పుడు కొత్తగా రచ్చచేయడం ఆయన మత రాజకీయాలకు పరాకాష్టగా మారింది. చివరకు ఆ ఎపిసోడ్ లో జగన్ హీరో అయ్యారు, చంద్రబాబు విలన్ గా మారారు.
అప్పుడు హిందు-క్రైస్తవ మతాల్ని వాడుకున్న చంద్రబాబు, ఇప్పుడు హిందు-ముస్లిం అంటూ సమాజాన్ని రెండుగా విడదీయాలని చూస్తున్నారు.
ముస్లింలపై దాడులు జరుగుతున్నాయంటూ కుటిల రాజకీయాలకు తెరతీశారు. అయితే రివర్స్ లో.. బాబు చేసిన తప్పులన్నీ బైటకొస్తున్నాయి. చంద్రబాబు కుటిల పన్నాగాన్ని ప్రజలే విజయవంతంగా తిప్పికొడుతున్నారు. సోషల్ మీడియాలో బాబు చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.