ఓటీటీలో ఓ సినిమా వస్తుందంటే అంతా అనుమానించే రోజులివి. థియేటర్లలో వస్తే ఎలాగూ ఫ్లాప్ అవుతుంది కాబట్టి ఓటీటీకి ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న టైమ్ ఇది.
ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఆ అనుమానాల్ని మరింత బలపరిచాయి. తాజాగా వచ్చిన సూర్య సినిమా మాత్రం ఆ డౌట్స్ ను పటాపంచలు చేసింది. ఎట్టకేలకు ఓటీటీ ఓ హిట్ సినిమాను చూసింది.
లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి ఇప్పటివరకు చాలా సినిమాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యాయి. అయితే అందులో ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు. పైపెచ్చు.. థియేటర్లలో రిలీజైతే కచ్చితంగా ఈ సినిమాలు ఫ్లాప్ అవుతాయనే అపప్రధను మూటగట్టుకున్నాయి.
భారీ అంచనాలతో తెరకెక్కిన V, నిశ్శబ్దం లాంటి సినిమాలు కూడా నిరాశపరచడంతో ఇకపై ఓటీటీలో ఇలాంటి సరుకే వస్తుందని అంతా అనుకున్నారు.
అటు ఓటీటీ సంస్థలు కూడా డైలమాలో పడ్డాయి. తాము తీసుకుంటున్న సినిమాలన్నీ బ్యాక్ ఫైర్ అవుతుంటే.. అసలు సమస్య ఎక్కడుందో అర్థంకాక తలలుపట్టుకున్నాయి.
థియేటర్లు లేక మేకర్స్, తమ సినిమాల్ని డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేస్తున్నారా.. లేక థియేటర్లలో ఆడవని నిర్థారించుకున్న తర్వాతే ఓటీటీకి ఇచ్చేసి సొమ్ములు చేసుకుంటున్నారా అనే డౌట్స్ అందర్లో ఉన్నాయి.
సరిగ్గా ఇలాంటి డోలాయమాన పరిస్థితుల్లో వచ్చింది ఆకాశం నీ హద్దురా సినిమా. సూర్య నటించిన ఈ సినిమా అతడి అపజయాలకు బ్రేకులేయడంతో పాటు ఓటీటీపై ఇన్నాళ్లూ నడుస్తున్న అనుమానాల్ని నివృత్తి చేసింది.
ఈ సినిమాతో సూర్య హిట్ కొట్టాడు అనే కంటే.. ఓటీటీలో ఇకపై కాస్త మంచి సరుకున్న సినిమాలు వస్తాయనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించింది.