మాట మార్చడం, రంగులు మార్చేయడం నితీష్ కుమార్ కు కొత్తేమీ కాదు. క్రితం సారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పోటీ చేసి, ఆ కూటమి ద్వారా ఓట్లను, సీట్లను పొంది, తీరా కొన్నాళ్లకు బీజేపీ తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత నితీష్ కుమార్ ది. ఆయన తీరును బిహారీలు చీత్కరించుకున్నారని, అందుకే ఆయన పార్టీ 40కు పైగా స్థానాలతో మూడో స్థానంలోకి పడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
నితీష్ అవకాశవాద తీరు లో చాలా చాప్టర్లున్నాయి. బిహారీలు ఆయనను తీవ్రంగా తిరస్కరించినా ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ క్రమంలో నితీష్ మరోసారి మాట మార్చారు. ఇవే తన చివరి ఎన్నికలు అంటూ తను ఇది వరకూ చేసిన కామెంట్ ను అంతా తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు నితీష్. తనకు ఇవే చివరి ఎన్నికలు కాదని, తను ఇంకా బరిలో ఉండబోతున్నట్టుగా ఈ జేడీయూ నేత మాట మార్చారు.
మూడో దశ పోలింగ్ కు ముందు తను తనకు ఇవే చివరి ఎన్నికలు అని చేసిన ప్రకటనకు అర్థం వేరేనంటూ నితీష్ చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల ప్రచార సభలో తను మాట్లాడింది, అదే తన చివరి ఎన్నికల ప్రచార సభ అనే ఉద్దేశంతోనంటూ నితీష్ ఇప్పుడు చెబుతున్నారు.
చివరి ఎన్నికలంటూ తను రాజకీయ రణరంగం నుంచి తప్పుకునే ప్రకటన ఏదీ చేయలేదని..ఇప్పుడు కొత్త వెర్షన్ చెబుతున్నారాయన. ఓటమి భయంతో నితీష్ ఆ ప్రకటన చేశారని, ఆఖరి దశ పోలింగ్ లో అయినా సానుభూతితో ఓట్లను పొందడానికి ఇవే తనకు చివరి ఎన్నికలంటూ నితీష్ ప్రకటించినట్టుగా అనేక మంది అభిప్రాయపడ్డారు.
ఆ పోలింగ్ ముగిసిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, ప్రజలు తనను తిరస్కరించినా తనే సీఎం అవుతున్న నేపథ్యంలో.. నితీష్ కుమార్ తను ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పింది ఉత్తుత్తినే అన్నట్టుగా స్పందిస్తున్నారు! అయినా కూటములే మార్చిన నితీష్ కు ఇలా మాట మార్చడం పెద్ద విషయం కాదేమో!