గవర్నర్ తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారంటే.. ఏదో ప్రధాన విషయం చర్చకు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అయితే దీపావళి సందర్భం కావడంతో పండగ శుభాకాంక్షలు చెప్పడానికే సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలుస్తున్నారని కొంతమంది అంటున్నారు. రాజకీయ కారణాలు లేకుండా ఈ భేటీ పూర్తి కాదనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న హాట్ గాసిప్.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై గవర్నర్, సీఎం మధ్య చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శుభాకాంక్షలు కాకుండా నాలుగు అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయని అంటున్నారు.
1. మూడు రాజధానులు..
మూడు రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్ర వేసినా కూడా.. కోర్టులో కేసు నడుస్తోంది. సంస్థలను, కార్యాలయాలను తరలించకుండా ప్రభుత్వం చేతులు కట్టేసింది కోర్టు.
రాజధానిపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని అంటున్నా.. ఇప్పట్లోగా వ్యవహారం తేలేట్టు కనిపించడంలేదు. దీనిపై ఎలా ముందుకెళ్లాలి? రాజధానుల ఏర్పాటుపై కోర్టుల్లో అసలేం జరుగుతోంది.. వంటి అంశాలు గవర్నర్, సీఎం భేటీలో ప్రస్తావనకు వస్తాయని సమాచారం.
2. సుప్రీం చీఫ్ జస్టిస్ కి రాసిన లేఖ దుమారం..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సహా, రాష్ట్ర హైకోర్టులోని న్యాయమూర్తులపై సీఎం జగన్ నేరుగా చీఫ్ జస్టిస్ కి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది. లేఖ రాయడాన్ని సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ కొందరు తమ అభిప్రాయాలను వెళ్లడిస్తున్నారు.
జగన్ పై సుమోటోగా కేసు నమోదు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. రమణపై అంతర్గత విచారణ జరపాలనే డిమాండ్ కూడా ఉంది. పొలిటికల్ హీట్ పెంచిన ఈ వ్యవహారం కూడా సీఎం-గవర్నర్ మధ్య చర్చకు రావొచ్చు.
3. స్థానిక సంస్థల ఎన్నికలు..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ సహా ప్రతిపక్షాలు పట్టుబడుతున్న వేళ, ప్రభుత్వం మాత్రం ఎన్నికల వాయిదా కోరుతోంది. కరోనా సాకు చూపి ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, కరోనా పూర్తిగా తగ్గకముందే ఎందుకు తొందరపడుతున్నారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అసలు స్థానిక ఎన్నికలు జరపాలా? వద్దా? ఎన్నికలు అనివార్యమైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై చర్చ జరిగే అవకాశముంది.
4. నూతన జిల్లాల ఏర్పాటు..
రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటుకి కసరత్తులు మొదలు పెట్టింది. జనవరినాటికి జిల్లాల పేర్లు ప్రకటించి కార్యకలాపాలు మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీల పని పూర్తి కావొచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాల ఏర్పాటు, ప్రకటన, గవర్నర్ రాజముద్ర ఎప్పుడనే విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఈ నాలుగు అంశాలు ప్రధాన అజెండా అనుకుంటున్నా.. ప్రతిపక్ష నేతలపై సీబీఐ విచారణకు కేంద్రానికి సమర్పించిన నివేదికలు, తదనంతర పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశముందని అంటున్నారు. మొత్తమ్మీద చాన్నాళ్ల తర్వాత గవర్నర్ తో సీఎం జగన్ భేటీ, వాడివేడి రాజకీయ చర్చకు తావిస్తోంది.