పాపాల భైరవుడు జగనే అంటున్న బాబు

రాక రాక విశాఖ వచ్చిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడుని విమానాశ్రయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని పోరాడాలని అభ్యర్ధించారు. స్టీల్ ప్లాంట్…

రాక రాక విశాఖ వచ్చిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడుని విమానాశ్రయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని పోరాడాలని అభ్యర్ధించారు. స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని వినతి చేశారు.  

స్టీల్ ప్లాంట్ మీద పోరాడే విషయంలో తెలుగుదేశం స్టాండ్ ఏంటో బాబు చెప్పాలి. అయితే చంద్రబాబు మాత్రం వైసీపీ ప్రభుత్వం వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతోందని అక్కసు వెళ్లగక్కడం గమనార్హం. అధికారంలో ఉన్న వైసీపీదే స్టీల్ ప్లాంట్ పాపం అన్నట్లుగా ఆయన మాట్లాడారు.

ఎక్కడో పొరుగున తెలంగాణాలో ఉన్న బీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ మీద పోరాటానికి సిద్ధపడుతోంది. ఆ పార్టీకి చెందిన మంత్రి కేటీఆర్ కేంద్రానికి ప్రధానికి లేఖ రాశారు. ఆయన మోడీ వైఖరిని తప్పు పట్టారు కానీ ఏపీలోని ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదు.

స్టీల్ ప్లాంట్ అన్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్రం ఒక పాలసీగా పెట్టుకుని నష్టాలలో ఉన్న వాటిని అమ్మాలని భావిస్తోంది. దీని మీద కేంద్ర మంత్రులు కూడా మా సంస్థలు మా ఇష్టం అనే చెబుతున్నారు. అయినా కూడా చంద్రబాబు మాత్రం వైసీపీ ప్రభుత్వానిదే తప్పు అంటున్నారు.

బాబు చెప్పినట్లుగా వైసీపీదే తప్పు అనుకుందాం, తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీగా పోరాటం చేయాలి కదా. కేంద్రంలోని మోడీ సర్కార్ లక్షన్నర కోట్ల విలువ చేసే ప్లాంట్ ని ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తోందని గట్టిగా విమర్శలు చేయాలి కదా.

చంద్రబాబు మాత్రం జగన్ వల్లనే ప్రైవేట్ పరం అవుతోందని చెప్పడం చూసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు నిలువునా నీరు కారారు. ఏపీలోని రాజకీయ పార్టీలు తీరు ఇలా ఉండబట్టే  బీఆర్ఎస్ రంగ ప్రవేశం చేసి స్టీల్ ప్లాంట్ మీద మేము పోరాడుతామని అంటోంది. దేశంలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినా మోడీ సర్కార్ ని అనలేని నిస్సహాయ స్థితిలో ప్రతిపక్షం ఉంది. 

అన్ని పాపాలకూ జగనే కారకుడు అంటూ చంద్రబాబు తన రాజకీయం తాను చేస్తున్నారు. మోడీని పల్లెత్తు మాట అనకుండా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఎలాగో చంద్రబాబే చెప్పాలని అంటున్నారు.