బాబు ఆనందం ఆవిరి

విశాఖ జిల్లా టూర్ కి చాన్నాళ్ల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారు ఉత్తరాంధ్రాలో తిరిగి పుంజుకున్నామని ఒక ఎమ్మెల్సీ సీటు గెలిచామన్న ఉత్సాహంతో ఆయన ఉన్నారు. అయితే విశాఖ జిల్లా టీడీపీలో…

విశాఖ జిల్లా టూర్ కి చాన్నాళ్ల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారు ఉత్తరాంధ్రాలో తిరిగి పుంజుకున్నామని ఒక ఎమ్మెల్సీ సీటు గెలిచామన్న ఉత్సాహంతో ఆయన ఉన్నారు. అయితే విశాఖ జిల్లా టీడీపీలో మాత్రం ఇద్దరు సీనియర్ నేతల మధ్య అలాగే వర్గ పోరు సాగుతోంది.

వారే మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు. చంద్రబాబు విశాఖ వస్తే ఎపుడూ అయ్యన్న వెంట ఉంటారు ఇక గత నాలుగేళ్లుగా టీడీపీలో పెద్దగా కనిపించని గంటా ఈసారి మాత్రం బాగానే హడావుడి చేశారు.

గంటా మళ్లీ రీ యాక్టివ్ కావడం, అధినాయకత్వం ఆయనను దగ్గరకు తీయడం అయ్యన్నపాత్రుడికి నచ్చడంలేదని ప్రచారం సాగుతోంది. పార్టీ కష్టకాలంలో వెంట ఉన్న వారికే తాను ప్రాధాన్యత ఇస్తాను అని చంద్రబాబు ఆ మధ్య దాకా ప్రకటనలు చేస్తూ వచ్చారు.

ఇన్నాళ్ళు కేసులు పెట్టించుకుని పోలీసులతో గొడవ పడి అన్ని కష్టాలు ఎదుర్కొన్న వారికి ప్రయారిటీ ఇవ్వాల్సిందే అన్నది అయ్యన్నపాత్రుడు వాదనగా ఉందని అంటున్నారు. చంద్రబాబు మాత్రం గంటాకు ఉన్న సామాజిక ఆర్ధిక బలాన్ని బేరీజు వేసుకుని ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్నారు.

ఈ పరిణామంతో అయ్యన్నపాత్రుడు తీవ్ర అసంతృప్తి గా ఉన్నారని అంటున్నారు. పార్టీకి దూరంగా ఉంటూ ఇతర పార్టీల వైపు చూసే వారిని అవకాశవాద రాజకీయాలు చేసేవారిని దగ్గరకు తీయడం ద్వారా అసలైన క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని అయ్యన్న అభిప్రాయపడుతున్నారు.

విశాఖలో చంద్రబాబు నిర్వహించిన ఉత్తరాంధ్రా ప్రాంతీయ సదస్సులో సైతం అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఎడముఖం పెడముఖంగా కనిపించారు. ఇక అయ్యన్న బాబు పక్కనే కూర్చుని తాను సీనియర్ నేతను అని చెప్పుకున్నారు. ఉత్తరాంధ్రాలో మళ్ళీ టీడీపీ పుంజుకుంటుందని భావిస్తున్న వేళ బాబు ఆనందం ఆవిరి చేసేలా పరిణామాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.