పవన్ Vs బన్నీ.. మరో ఇరకాటంలో ‘మైత్రీ’

కొన్ని నెలల కిందటి సంగతి.. సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు నిలిచాయి. ఆ రెండు సినిమాల్ని నిర్మించింది ఒకే సంస్థ. ఒకే టైమ్ లో రిలీజ్ కూడా చేయాల్సి వచ్చింది. దీంతో…

కొన్ని నెలల కిందటి సంగతి.. సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు నిలిచాయి. ఆ రెండు సినిమాల్ని నిర్మించింది ఒకే సంస్థ. ఒకే టైమ్ లో రిలీజ్ కూడా చేయాల్సి వచ్చింది. దీంతో ఆ సినిమాల ప్రమోషన్ టైమ్ లో చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది మైత్రీ మూవీ మేకర్స్.

వీరసింహారెడ్డి అప్ డేట్ ఇచ్చిన ప్రతిసారి మెగాఫ్యాన్స్ నుంచి విమర్శలు తప్పలేదు. అదే విధంగా వాల్తేరు వీరయ్యను సెలబ్రేట్ చేసిన ప్రతిసారి నందమూరి అభిమానుల సెగ తప్పలేదు. అయితే సక్సెస్ ఫుల్ గా ఆ రెండు సినిమాల్ని రిలీజ్ చేసింది. రెండు పెద్ద సినిమాల ప్రచారాన్ని బ్యాలెన్స్ డ్ గా చేసిందనే క్రెడిట్ కూడా అందుకుంది 'మైత్రీ'.

అయితే ఈసారి మైత్రీకి అలాంటి క్రెడిట్ దక్కలేదు. ఈరోజు కూడా 2 సినిమాల్ని బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది ఈ సంస్థకి. ఓవైపు పుష్ప-2 గ్లింప్స్ రిలీజ్ చేసింది. మరోవైపు పవన్ కల్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ ను స్టార్ట్ చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు సమప్రాధాన్యం ఇవ్వడంలో సదరు నిర్మాణ సంస్థ ఫెయిలైంది.

ఈరోజు పొద్దున్నుంచి పుష్ప-2 గ్లింప్స్ కే ప్రాధాన్యం ఇచ్చింది మైత్రీ. పవన్ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైందనే విషయాన్ని కనీసం మాటమాత్రానికైనా ప్రస్తావించలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. పుష్ప-2పై సోషల్ మీడియా పేజీలో 10 పోస్టులు పెట్టిన నిర్మాణ సంస్థ, పవన్ సినిమా సెట్స్ పైకొచ్చిందని ఒక్క పోస్ట్ పెడితే ఏమౌతుందంటూ ప్రశ్నిస్తున్నారు.

పవన్ సినిమా మొదలైందంటూ పోస్టు పెడితే బన్నీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భయంతో మైత్రీ నిర్మాతలు వెనక్కి తగ్గారనే చర్చ కూడా సోషల్ మీడియాలో ఊపందుకుంది. అటు హరీశ్ శంకర్ మాత్రం 'ఎన్నాళ్లో వేచిన ఉదయం' పాటతో మేటర్ ను బయటపెట్టాడు.

మొత్తమ్మీద ఒకేసారి రెండు పెద్ద అప్ డేట్స్ ఇచ్చే క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ ఫెయిలైంది. పవన్ సినిమా అప్ డేట్ ను పూర్తిగా పక్కనపెట్టింది. మరోవైపు రిలీజ్ కు రెడీ అయిన మీటర్ అనే సినిమాకు, పుట్టినరోజు జరుపుకున్న రష్మికకు మంచి ప్రాధాన్యం ఇచ్చింది సదరు సంస్థ. దీంతో పవన్ ఫ్యాన్స్ కోపం మరింత ఎక్కువైంది.