దిల్ రాజును చూసి కుళ్లుకుంటున్న ఆ బ్యాచ్ ఏది?

“నాకొస్తున్న పేరుని ఓ బ్యాచ్ త‌ట్టుకోలేకపోతోంది. వెంట‌నే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. నేను నిజాయితీగా ఉన్నాను. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.” దిల్ రాజు తాజా స్టేట్ మెంట్ ఇది. ఇదేదో ఆయన ఫ్లోలో…

“నాకొస్తున్న పేరుని ఓ బ్యాచ్ త‌ట్టుకోలేకపోతోంది. వెంట‌నే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. నేను నిజాయితీగా ఉన్నాను. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.” దిల్ రాజు తాజా స్టేట్ మెంట్ ఇది. ఇదేదో ఆయన ఫ్లోలో చెప్పిన డైలాగ్ కాదు. అలా అని కొత్తగా చెప్పిన డైలాగ్ కూడా కాదు. ఇంతకుముందు ఓసారి ఇలాంటి ప్రకటనే చేశారు. ఇప్పుడు ఇంకాస్త స్పష్టంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో 'ఆ బ్యాచ్' ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంకాస్త వెనక్కు వెళ్తే..

సంక్రాంతి సినిమాల టైమ్ లో దిల్ రాజును విలన్ ను చేసే ప్రయత్నం జరిగింది. స్ట్రయిట్ సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రిలీజ్ అవుతున్న టైమ్ లో వాటికి పోటీగా పొరుగు హీరో నటించిన వారసుడు సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారంటూ చాలా రచ్చ జరిగింది. ఆ టైమ్ లోనే తనపై కొంతమంది తెరవెనక పని చేస్తున్నారని, తన పేరుప్రతిష్టల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దిల్ రాజు ప్రకటన చేశారు. అప్పుడు కొంతమంది వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చాయి.

అంతకు ముందు కూడా దిల్ రాజు ఇదే తరహా కామెంట్ చేశారు. తను గ్లామరస్ గా ఉంటాను కాబట్టే, తనపై వివాదాలు సృష్టిస్తున్నారంటూ ప్రకటన చేశారు. అయితే ఆ టైమ్ లో మీడియా మొత్తం గ్లామర్ అనే పదం చుట్టూ తిరిగింది తప్ప దిల్ రాజు స్టేట్ మెంట్ లోని అసలు అర్థాన్ని పట్టించుకోలేదు.

పైపై పలకరింపులు.. లోలోపల గుద్దులాటలు..

తనపై అసత్య ప్రచారం చేస్తున్నది, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తోంది ఎవరనే విషయం దిల్ రాజుకు తెలుసు. వాళ్లను తరచుగా ఆయన కలుస్తుంటారు కూడా. రెగ్యులర్ గా వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతుంటారు. కానీ బిజినెస్ దగ్గరకు వచ్చేసరికి దిల్ రాజు అంటే వాళ్లకు పడదు. తమను దాటి వెళ్లిపోయాడనే కుళ్లు కావొచ్చు, తమ మాట వినడం లేదనే అహం కావొచ్చు.. కారణం ఏదైనా దిల్ రాజుపై 'ఆ కొందరికి' కక్ష ఉందనేది వాస్తవం.

ఈ విషయం దిల్ రాజుకు కూడా తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన మరింత జాగ్రత్తగా ఉన్నారు. తను నిజాయితీగా ఉంటానని, కాబట్టి ఎవ్వరికీ భయటపడనంటూ స్టేట్ మెంట్ ఇవ్వడానికి కారణం అదే. మొన్నటికిమొన్న బలగం సినిమాకు సంబంధించి ఆయన ఓ కోణంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే, దాన్ని కొంతమంది వ్యక్తులు మరో కోణంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై దిల్ రాజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిమరీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

రిలీజ్ డేట్స్.. ఎవరికి వారే..

సందట్లో సడేమియా టైపులో రిలీజ్ డేట్స్ వ్యవహారం కూడా ఈ అంతర్యుద్ధానికి ఆజ్యం పోస్తోంది. నిజానికి ఈ విడుదల తేదీల యుద్ధాన్ని ముందుగా మొదలుపెట్టింది దిల్ రాజే. ఆ తర్వాత దాన్ని ఇతర నిర్మాతలు కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద నిర్మాతలంతా, మరో నిర్మాతతో సంబంధం లేకుండా తమ సినిమాల విడుదల తేదీల్ని ముందుగానే ప్రకటించేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచి డేట్స్ ను రిజర్వ్ చేసుకొని, ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తున్నారు.

వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే సినిమా కోసం ఇప్పుడే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడైనా చూశామా? ఈ సంక్రాంతి ఇలా ముగిసిందో లేదో, వచ్చే ఏడాది సంక్రాంతి కోసం కర్చీఫ్ వేస్తూ రిలీజ్ డేట్స్ ప్రకటించడం గతంలో చూశామా? కొన్ని పెద్ద సినిమాల విడుదలతేదీల్ని ఇంత ముందుగా ఎందుకిలా ప్రకటిస్తున్నారు? దీనికి కారణం టాలీవుడ్ నిర్మాతల మధ్య అంతర్యుద్ధం, ఆధిపత్య పోరు మాత్రమే. ఒక విధంగా ఈ ట్రెండ్ కు కారణం దిల్ రాజే.

మొత్తమ్మీద టాలీవుడ్ లో కరోనా తర్వాత నిర్మాతల వర్గాల్లో కూడా మార్పుచేర్పులు భారీగానే చోటుచేసుకున్నాయి. ఏ నిర్మాత ఏ వర్గం అనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. గ్రూపులన్నీ కళ్లకుకట్టినట్టు కనిపిస్తున్నాయి.