ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా.. వారే విజేత. ఇదే ప్రజాస్వామ్యంలో చిత్రవిచిత్రం. ఒకవైపు మోడీ భక్తులు పరమానందంతో పరవశులు అయిపోతున్నా… తేజస్వి యాదవ్ అనే తొమ్మిదో తరగతి విద్యార్హత కలిగిన, 30 వయసున్న యువకుడి చేతిలో కమలం కూటమిగా వెళ్లి సాధించిన విజయం గొప్ప స్థాయిలో అయితే లేదని స్పష్టం అవుతోంది. సీట్ల లెక్కల్లోనే ఎన్డీయే కూటమి తృటిలో విజయం సాధించింది. అదే ఓట్ల లెక్కల్లోకి వెళితే.. విషయం మరింత వేరేలా ఉంది.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిస్తే.. కాంగ్రెస్ కన్నా తాము కాస్త ఎక్కువ ఓట్లను సాధించినట్టుగా బీజేపీ వాదులు ఇప్పటికీ వాదిస్తూ ఉంటారు. అదే బిహార్ విషయానికి వస్తే.. ఆర్జేడీ కూటమి కన్నా బీజేపీ కూటమికి ఎక్కువగా వచ్చిన ఓట్లు కేవలం 12వేల చిల్లర మాత్రమే! కచ్చితంగా చెప్పాలంటే 12,270 ఎక్కువ ఓట్లను సంపాదించింది బీజేపీ కూటమి!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రచారం, నితీష్ ఛరిష్మా.. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు న్యాయం జరగాలనే నినాదం.. వంటి వాటన్నింటినీ వాడి.. కాంగ్రెస్ ను గేలి చేసి, తేజస్వి యాదవ్ ను పనికిరానివాడిగా మీడియా చేత ప్రొజెక్ట్ చేయించి, యథారీతిన రాహుల్ ను పప్పుగా అభివర్ణించి, మళ్లీ వారినే యువరాజులు అంటూ ఎద్దేవా చేసి.. చివరకు 12,270 ఓట్ల మెజారిటీని సంపాదించింది ఎన్డీయే కూటమి!
మొత్తం పోల్ అయిన ఓట్లు 3.14 కోట్లు కాగా.. వాటిల్లో 1,57,01,226 ఓట్లు ఎన్డీయేకు రాగా, ఆర్జేడీ కూటమికి 1,56,88,458 ఓట్లు వచ్చాయి. ఎన్నికల ముందు ఆర్జేడీని చాలా తక్కువ చేసి చూపించింది మీడియా. అసలు పోటీనే ఉండదు, పోటీ చేయడం కూడా వేస్ట్ అన్నట్టుగా ఆ కూటమి తరఫున పని చేసే వాళ్ల స్థైర్యాన్ని మీడియా తన వంతుగా తీవ్రంగా దెబ్బతీసింది.
ప్రీ పోల్ సర్వేలు అంటూ.. ఆర్జేడీని చాలా తక్కవ చేసి చూపించింది. మోడీ ముందు, నితీష్ చరిష్మా ముందు తేజస్వి పిల్ల బచ్చా అన్నట్టుగా ఇష్టానుసారం కథనాలను వండి వార్చారు. అలాంటి ప్రొపగండాతో ఆర్జేడీ తరఫున నిలిచే వారి స్థైర్యాన్ని విజయవంతంగా దెబ్బతీశారు. అంతజేసినా.. ఆర్జేడీ తుదికంట పోరాడింది. మోడీ, నితీష్ ల జోడీ అన్ని అస్త్రాలనూ వాడింది. చివరకు మూడు కోట్లకు పై స్థాయి ఓట్లలో 12 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఇదే ఎన్నికలో నోటాకు పడిన ఓట్ల సంఖ్య లక్షల్లో ఉంది!