ఎన్నికల్లో గెలుపు అంటే ప్రజల మనసులను గెలవడమే. మొదట ప్రజాదరణ పొందేలా పార్టీలు వ్యవహరించాలి. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలమనే నమ్మకాన్ని, భరోసాను నింపగలిగినప్పుడే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుంది. ఇంప్రెషన్ అనేది అన్నిటికంటే ముఖ్యమైంది. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. బీజేపీ-జనసేన పొత్తు కుదుర్చు కున్న తర్వాత మొదటి సారిగా తిరుపతి ఉప ఎన్నిక జరగనుంది.
అయితే ఈ ఎన్నికలో కలిసి పోటీ చేయాలనుకుంటున్న రెండు పార్టీలు అందుకు తగ్గట్టు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయా? అంటే లేదనే సమాధానం వస్తోంది. దీనికి బీజేపీ ఒంటెత్తు పోకడలు, జనసేన అంటే లెక్కలేని తనమే కారణమనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
తెంలగాణలోని దుబ్బాకలో విజయం సాధించిన బీజేపీ ….ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో కూడా అది ఫలితాన్ని సాధిస్తామని ఆ పార్టీ సమరోత్సాహంతో చెబుతోంది. బీజేపీ ఉత్సాహాన్ని చూస్తే ….ఆ పార్టీనే బరిలో నిలిచేలా కనిపిస్తోంది. కానీ మాటల్లో మాత్రం జనసేన పేరు ప్రస్తావనకు తెస్తోంది. ఉప ఎన్నిక విషయమై మిత్రపక్షమైన జనసేనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు.
ఉప ఎన్నికకు శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకు నిన్న తిరుపతిలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ తెలంగాణలో దుబ్బాక ఫలితాన్ని తిరుపతిలో కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలోనూ బీజేపీ -జనసేన పవనాలే వీస్తాయన్నారు.
పేరుకు బీజేపీ -జనసేన మిత్రపక్ష పార్టీలే కానీ, ఆ రెండు పార్టీల నేతలు కలిసి ముందుకు సాగుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇంత వరకూ ఒక సమస్యపై ఉమ్మడిగా పోరు చేసిన దాఖలాలు కూడా లేవు. అంతర్వేది ఘటనపై కూడా బీజేపీ, జనసేన నాయకులు దాదాపు ఎవరికి వాళ్లు ఆందోళనలు నిర్వహించారు.
ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించాలనుకుంటున్న బీజేపీ కీలక నిర్ణయాల విషయంలో తమను కలుపు కెళ్లడం లేదనే అసంతృప్తిలో జనసేన నాయకులున్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో అధికారంలో ఉండడంతో తమ దగ్గరికే జనసేన నేతలు వస్తారనే భావన బీజేపీ నేతల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోందనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఎన్నికలో తామే నిలబడాలని నిర్ణయించుకుని, అభ్యర్థిని కూడా ఖరారు చేసుకున్న తర్వాత తమతో చర్చిస్తే ఏం లాభమని జనసేన నేతల వాదన. అడిగి మరీ పొత్తు పెట్టుకున్న జనసేనకు ఇంత కంటే బీజేపీ ఏం మర్యాద ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ వ్యవహార శైలిపై మాత్రం జనసేన గుర్రుగా ఉందన్నది మాత్రం వాస్తవం.