బిహార్ ఎన్నికల్లో సాంకేతికంగా ఎన్డీయే కూటమి విజయం సాధించినా.. సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నది తేజస్వి యాదవ్ మీదే! అతడున్న పరిణామాల్లో బిహార్ ఎన్నికలను ఎదుర్కొని ఎన్డీయే కూటమికి ముచ్చెమటలు పట్టించాడంటూ జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తీరును ప్రస్తావిస్తూ.. గతంలోని నంబర్లను బేరీజు వేసి వారు తేజస్వి ని అభినందిస్తూ ఉన్నారు. అన్నింటికి మించి అతడి వయసు చిన్నది. 31 యేళ్ల వయసులోనే ఈ స్థాయిలో ప్రజా మద్దతును సంపాదించడంటే.. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడికి రాజకీయంగా ఉజ్వల భవిష్యత్ ఉండే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తూ ఉన్నారు.
బిహార్ లో భారతీయ జనతా పార్టీకి నాయకత్వ లోటు కొట్టుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ వేరే చెప్పనక్కర్లేదు. నితీష్ కథ అయిపోయింది. మళ్లీ ముఖ్యమంత్రి అయితే కావొచ్చు గాక.. అయన పరపతిలేని సీఎంగానే నిలవబోతున్నారని స్పష్టం అవుతోంది.
ఇలాంటి నేపథ్యంలో బిహార్ రాజకీయానికి తేజస్వియాదవ్ కీలకం కాబోతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత పర్యాయం బిహార్ సార్వత్రిక ఎన్నికల్లో ఆర్జేడీ దాదాపు 80 స్థానాల్లో నెగ్గింది. ఈ సారి వచ్చింది అంతకన్నా ఐదు తక్కువే! అయితే.. అప్పుడు పోటీ చేసిన సమీకరణాలు వేరు, ఇప్పుడు పోటీ చేసిన తీరు వేరు.
నాటి ఎన్నికల్లో జేడీయూ- కాంగ్రెస్ లతో కలిసి ఆర్జేడీ పోటీ చేసింది. అప్పుడు బీజేపీ మాత్రమే ప్రత్యర్థి. లాలూ, నితీష్ లు చేతులు కలిపి అప్పుడు ప్రచారం చేసుకున్నారు, ఎన్నికల వ్యూహాలను రచించారు. మోడీ అప్పటికి కొత్త ప్రధానమంత్రి మాత్రమే.
ఇప్పుడు మాత్రం ఆర్జేడీ సొంతంగా బరిలోకి దిగినట్టే, కాంగ్రెస్ వల్ల లాభం కన్నా, నష్టమే ఎక్కువ జరిగింది. కమ్యూనిస్టుల ప్రభావం తక్కువే. ఇలాంటి నేపథ్యంలో ఆర్జేడీ సోలోగా కష్టపడి కాంగ్రెస్, కమ్యూనిస్టులకు సీట్లను పంచడమే తప్ప వాళ్ల వల్ల ఆర్జేడీకి ఒరిగింది లేదు. ఈ పరిణామాల్లో నాడు సాధించిన 80 సీట్ల కన్నా, ఇప్పుడు వచ్చిన 75 సీట్లే గొప్ప విజయం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ప్రతిపక్షంలో ఉండి కష్టపడితే.. తేజస్వి యాదవ్ కు ఉజ్వల భవితవ్యం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ, నితీష్ వంటి ఉద్ధండులను ఎదుర్కొని 31 యేళ్ల వయసు వ్యక్తి ఓడిపోయినా, గెలిచినట్టే అనే అభిప్రాయాలను జాతీయ రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.