బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తదుపరి జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై రకరకాలుగా పడేలా ఉంది. లోక్ సభ ఎన్నికలకూ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రజలు ఓటేసే తీరు వేరేలా ఉంటుందని బిహారీలు స్పష్టతను ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో ఆర్జేడీకి కనీసం ప్రాతినిధ్యం దొరకలేదు! ఒక్క ఎంపీ సీటు రాలేదు! ఇప్పుడు అదే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలు అప్పుడు స్వీప్ చేశాయి. ఒక్కటంటే ఒక్క సీట్లో కాంగ్రెస్ గెలిచింది. మిగతావన్నీ నాటి ఎన్డీయే కూటమి సొంతం చేసుకుంది. అప్పుడు ఆరేడు సీట్లను నెగ్గిన ఎల్జేపీ ఇప్పుడు ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితం అయ్యింది! ఇలా లోక్ సభ ఎన్నికలకూ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకూ ఓటేయడంలో ప్రజల ప్రాధాన్యతలు వేరే ఉంటాయని స్పష్టం అవుతూ ఉంది.
ఇలాంటి క్రమంలో ఇంకా ఇతర రాజకీయ పరిణామాలను కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రభావితం చేస్తున్నాయి. అందులో ఒకటి.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ కు ఆర్జేడీ అధిక సీట్లను కేటాయించి నష్టపోయిందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ గుర్తును చూసి కొన్ని రాష్ట్రాల్లో ఓటు పడే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని అంటున్నారు.
ఒకవేళ ఆర్జేడీ కాంగ్రెస్ కు 70 సీట్లు కాకుండా తక్కువ సీట్లను కేటాయించి, ఆ స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను నిలిపి ఉంటే.. కచ్చితంగా ఆ పార్టీ విజయానికి చేరువయ్యేదని వారు తేల్చి చెబుతున్నారు. ఎన్డీయే కూటమికి వచ్చిన మెజారిటీ పెద్దదేమీ కాని నేపథ్యంలో..ఆర్జేడీ మరిన్ని సీట్లలో పోటీ చేసి ఉంటే విజయం అటు ఇటయ్యేదని అంటున్నారు.
ఈ క్రమంలో ఈ ప్రభావం తమిళనాడు మీద తప్పేలా లేదు. తమిళనాడులో కూడా కాంగ్రెస్ తోక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ డీఎంకే కూటమి పెద్దన్నగా ఉండబోతోంది. కాంగ్రెస్ అక్కడ ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తోంది. ఐదారు నెలల నుంచినే డీఎంకే- కాంగ్రెస్ సీట్ల షేరింగ్ మీద రచ్చ నడుస్తోంది.
తమకు కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే సోలోగా పోటీ చేయడం అనే బ్లాక్ మెయిల్ ను కాంగ్రెస్ బిహార్ లో చేసినట్టుగానే తమిళనాడులో కూడా చేస్తోంది. గెలవలేని వాళ్లకు సీట్లెందుకు అని ఇన్నాళ్లూ మిత్రపక్షాలు గట్టిగా ప్రశ్నించలేకపోయాయి. అయితే బిహార్ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది.
ఇచ్చిన సీట్లను గెలవలేక, కనీసం కమ్యూనిస్టు పార్టీ స్ట్రైక్ రేట్ కూడా సాధించలేని కాంగ్రెస్ పార్టీకి ఇక విలువ దక్కకపోవచ్చు. తమిళనాట డీఎంకే ఇదే స్పష్టం చేసే అవకాశాలున్నాయి. తాము ఇచ్చినన్ని సీట్లలో మాత్రమే పోటీ చేయాలని కాంగ్రెస్ ను ఆ పార్టీ నిర్దేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ కు వీలైనన్ని తక్కువ సీట్లను కేటాయించాలని డీఎంకే లో ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కు కాంగ్రెస్ కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లోకి నెట్టాయి బిహార్ ఎన్నికలు!