సమీక్ష: ఆకాశం నీ హద్దురా
రేటింగ్: 3/5
బ్యానర్: 2డి ఎంటర్‍టైన్‍మెంట్, సిఖ్యా ఎంటర్‍టైన్‍మెంట్
తారాగణం: సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్‍బాబు, పరేష్ రావల్, ఊర్వశి, కరుణాస్ తదితరులు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
కూర్పు: సతీష్ సూర్య
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మిరెడ్డి
కథనం: సుధ కొంగర, షాలిని ఉషాదేవి, ఆలిఫ్ సుర్తీ, గణేషా
నిర్మాత: సూర్య, గునీత్ మోంగా
కథ, దర్శకత్వం: సుధ కొంగర
విడుదల తేదీ: నవంబరు 12, 2020
వేదిక: అమెజాన్ ప్రైమ్
అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించిన ‘ఎయిర్ డెక్కన్’ గోపీనాధ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలిగా సుధ కొంగర ప్రతిభ ఏమిటనేది మరోసారి చాటి చెబుతుంది. సామాన్యుడు కూడా ఫ్లయిట్‍లో ప్రయాణించగలగాలి… అందరికీ అందుబాటులోకి ఫ్లయిట్ టికెట్ ధరలను తీసుకురావాలనేది ఇందులోని హీరో కల. ‘సింప్లి ఫ్లయ్’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో తాలూకు సంక్లిష్టమైన స్వప్నాన్ని దర్శకురాలు సుధ కొంగర సింప్లిఫై చేసి చెప్పిన విధానం సగటు సినీ ప్రేక్షకుడిని సయితం అమితంగా మెప్పిస్తుంది.
ఏవియేషన్ బిజినెస్ అంటేనే సామాన్యులకు అర్థం కాని టెర్మినాలజీ… సరంజామా వుంటుంది. దర్శకురాలు సుధ కొంగరకు అది తెలుసు. అందుకే హీరో స్వప్నం ఏమిటి… అది ఎలా సాధ్యమనే విషయాన్ని ‘ఉడిపి హోటల్ దోశ’ ఉపమానంగా చెప్పిన సన్నివేశం అటు పెట్టుబడి పెట్టడానికి వచ్చినవాడినే కాదు ఇటు చూస్తోన్న ప్రేక్షకుడిని కూడా కన్విన్స్ చేసేస్తుంది. మరో సందర్భంలో టర్బోప్రాప్ ఫ్లయిట్స్ని పిచ్చుక ఉదాహరణతో పోల్చి చెప్పడం కూడా హీరో ఏమి చేయబోతున్నాడనే దానిపై స్పష్టత ఇస్తుంది. ఇలాంటి తెలివైన సన్నివేశాలకు తోడు హీరో కలతో కనక్ట్ అవడానికి బలమైన బ్యాక్‍స్టోరీని కూడా ఆమె రాసుకుంది.
మొదటి గంటలో హీరో ఎందుకు అంతగా ఈ బిజినెస్ చేయాలని ఆరాట పడుతున్నాడనేది అర్థం కాదు. కానీ ఒక్కసారి అతని అనుభవం ఏమిటనేది తెలిసినపుడు హృదయం బరువెక్కుతుంది. అతని కల నిజం కావాలనే కోరిక బలపడుతుంది. ఇలాంటి కనక్ట్ ఏర్పరిచిన తర్వాత ఇక హీరో ఎగరడమే ఆలస్యం అన్నంత వరకు తీసుకెళ్లి రెక్కలు విరిచేయడం ఇంటర్వెల్ పాయింట్. ధనికులతో పేదవాడు చేసే యుద్ధంలో అతడికి అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లు, ఒడిదుడుకులు ఈ చిత్రానికి ఫ్యూయల్. అయితే కేవలం ఈ ఒక్క అంశాన్ని మాత్రమే చూపిస్తే విసుగొచ్చేసేది.
ప్యారలల్‍గా లవ్‍స్టోరీని జత చేసి నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ‘గురు’ సినిమాలో మాదిరిగానే సుధ కొంగర ఈసారి కూడా ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్‍ని రాసుకుంది. కల కంటున్న భర్తను ఆర్థికంగా, హార్దికంగా సపోర్ట్ చేసే భార్య పాత్రలో అపర్ణ బాలమురళి ఆకట్టుకునే నటన కనబరిచింది.
ఈ ఇద్దరి మధ్య క్రియేట్ చేసిన మూమెంట్స్, వారి కెమిస్ట్రీ ఈ కథకు వున్న అప్పీల్‍ని విస్తరింపచేసింది. అలాగే హీరో తన స్వప్నం కోసం అలుపెరగని పోరాటం చేయడం కోసం స్ఫూర్తి పొందడానికి వీలుగా అతని తండ్రి పాత్ర ఉత్ప్రేరకం అవుతుంది. తల్లి, స్నేహితుల పాత్రలతో ఎమోషనల్‍గా మరింతగా కనక్ట్ చేసే సన్నివేశాలు కథానాయకుడి ప్రయాణాన్ని, అంతిమంగా అతడి విజయాన్ని ఆస్వాదించేట్టు చేస్తాయి.
కథానాయకుడి స్వప్నంలో ఏదో సాధించాలనే స్వార్ధం కంటే సామాన్యుల కోసం ఇది చేసి పెట్టాలనే నిజాయితీ ఎక్కువ వుండడం ఈ కథ తాలూకు మరో ప్రత్యేక లక్షణం. ఆ పాత్ర తాలూకు నిజాయితీ, నిబద్ధతలను సూర్య తన కళ్లల్లోనే చూపించిన విధానం నటుడిగా అతడి స్థాయిని తెలియజేస్తుంది. ఏ మూమెంట్‍లోను అతడు యాక్ట్ చేస్తున్నట్టు కాకుండా నిజంగా ఇదే కల కోసం తపిస్తోన్న వాడిగానే కనిపిస్తాడు.
వరుస పరాజయాలు స్టార్‍ని ఎఫెక్ట్ చేయవచ్చు కానీ యాక్టర్‍ని ఇబ్బంది పెట్టలేవని, మంచి కథ, ప్రతిభకు తగ్గ పాత్ర దొరికితే అలవోకగా న్యాయం చేసేస్తారని నిరూపించాడు. ఇక విలన్‍గా పరేష్ రావల్ పాత్రను రెగ్యులర్ కార్పొరేట్ విలన్‍గా చూపించడం, ఈ హీరో-విలన్ ట్రాక్‍లో అంత క్రియేటివిటీ లేకుండా రెగ్యులర్‍గా సాగిపోవడం చిన్న వీక్‍లింక్. అలాగే మోహన్‍బాబు, వినోదిని పాత్రలకు పరిచయ సన్నివేశాల్లో ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆ తర్వాత హీరో జర్నీలో కనిపించదు.
డైరెక్టర్ విజన్‍ని సినిమాటోగ్రాఫర్ తెర మీదకు తీసుకురాగలిగితే అదెంత గొప్పగా వుంటుందనే దానికి విమానం టేకాఫ్ అవుతుండగా… బైక్‍పై ఆకాశంలోకి సూర్య ఎగురుతున్న భావన కలిగించే షాట్ బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమాటోగ్రాఫర్‍తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ కూడా ఈ అండర్‍డాగ్ స్టోరీని ఇన్‍వాల్వ్ అయి చూసేట్టు చేసారు.
సుధ కొంగర ఓ ఇన్‍స్పయిరింగ్ స్టోరీ తీసుకుని దానిని కమర్షియల్ మీటర్‍లో ఉంచి తెరకెక్కించడంతో ఒక గొప్ప కథ చెప్పడమే కాదు… దానికి మాగ్జిమమ్ రీచ్ వుండేట్టు చూడడం కూడా దర్శకుడి బాధ్యతేనని చూపించారు. మెలోడ్రామాకు ఎక్కడ ఎండ్ పెట్టాలి… ఎంత మోతాదులో చూపిస్తే ఎఫెక్టివ్ అనిపిస్తుంది అనే దానిపై ఆమె కొంచెం తడబడినా కానీ ఓవరాల్‍గా ఆ ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు.
ఉదాహరణకు హీరో తండ్రి చనిపోయే సన్నివేశం, హీరో స్వప్నానికి చాలా మంది సాయపడే సన్నివేశం సుదీర్ఘంగా సాగుతూనే వుంటాయి. పాయింట్ ఏమిటనేది రిజిస్టర్ చేసేసాక, ఎమోషన్ కూడా వర్కవుట్ అయిపోయాక ఆ సాగతీత అనవసరం. ఇదే ధోరణి హీరో జర్నీలో అప్ అండ్ డౌన్స్ లోను కనిపిస్తుంది. సెకండ్ హాఫ్‍లో మళ్లీ మళ్లీ ఆటంకాలు ఎదురు కావడం, అతను మరో దారి కనుగొని మళ్లీ ప్రయత్నించడం ఎమోషన్‍ని రుద్దుతోన్న భావన కలిగిస్తుంది. అయితే కథానాయకుడి విజయాన్ని ఆస్వాదించలేనంతగా అది విసిగించలేదనుకోండి.
అండర్‍డాగ్స్ కథలెప్పుడూ ఆసక్తి కలిగిస్తాయి, ఇన్‍స్టంట్‍గా కనక్ట్ చేస్తుంటాయి. ఆకాశం నీ హద్దురా వాటితో పాటు ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలను కూడా మిస్ కాకపోవడంతో పరిపూర్ణత సంతరించుకుంది. ఓటిటి ద్వారా వచ్చిన చాలా సినిమాలు నిరాశ కలిగిస్తోన్న సమయంలో ఈ చిత్రం సినీ ప్రియులు కోరుకుంటోన్న ఉపశమనం ఇస్తుంది.
బాటమ్ లైన్: కలలకు రెక్కలొస్తే…!
గణేష్ రావూరి