కర్నూలు జిల్లా నంద్యాల్లో పోలీసుల వేధింపుల కారణంగా ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై రాజకీయం చేయబోయిన టీడీపీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులు అయిన పోలీసులకు బెయిల్ ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ బాహాటంగా తప్పు పట్టింది.
టీడీపీ ఏపీ విభాగం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయంలో ఆక్షేపించారు. అయితే ఇక్కడ విడ్డూరం ఏమిటంటే.. బెయిల్ ఇచ్చేది ప్రభుత్వం కాదు, కోర్టు. కానీ టీడీపీ బెయిల్ ను తప్పు పట్టింది.
ఇటీవలే కొన్ని కేసుల్లో కొంతమంది టీడీపీ వ్యక్తులకు బెయిల్ రావడంపై సోషల్ మీడియా ఘాటుగా స్పందించింది. అవి కూడా తీవ్రమైన కేసులే. ఆ కేసుల్లో కోర్టులు ఎలా బెయిల్ ఇచ్చాయి? అని ప్రశ్నించిన కొంతమందిపై కేసులు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో కామెంట్లపై కేసులు పెట్టారు. కేవలం బెయిళ్ల గురించి వ్యాఖ్యానించినందుకు కోర్టులో మళ్లీ కేసులు పెట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం పై కేసులో నిందితులకు బెయిల్ దక్కడంపై తీవ్రంగా స్పందించింది!
బహుశా కోర్టు తీర్పులపై ఇష్టానుసారం మాట్లాడే హక్కు టీడీపీకే ఉంది కాబోలు. టీడీపీ కోర్టుల తీరును తప్పు పట్టినా కేసులు ఉండవు కాబోలు! ఆ సంగతలా ఉంచితే.. నంద్యాల కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించింది స్వయానా టీడీపీ వ్యక్తే అని, వృత్తి రీత్యా లాయర్ అయిన ఒక టీడీపీ నేత , టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవిని పొందిన వ్యక్తి..
ఈ కేసులో నిందితుల తరఫున వాదించి బెయిల్ ఇప్పించారనే విషయం బయటకు వచ్చింది. దీంతో టీడీపీ గొంతులో పచ్చివెలగకాయ పడింది. నిందితుల తరఫున వాదించి బెయిల్ ఇప్పించేదీ తెలుగుదేశం నేతలే, బెయిల్ ఎలా ఇస్తారంటూ గగ్గోలు పెట్టేదీ టీడీపీ నేతలేనా? అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది.
దీంతో డ్యామేజ్ కవరేజ్ మొదలుపెట్టింది పచ్చ పార్టీ. సదరు లాయరు ఉన్నట్టుండి టీడీపీకి రాజీనామా చేశారట, అలాగే ఈ కేసు నుంచి తప్పుకున్నారట! ఇలా ఉన్నాయి పచ్చపార్టీ డ్రామాలు. డ్యామేజ్ కవరేజ్ కోసం ఈ పాట్లన్నీ పడుతూ ఉన్నారు.