విప్లవవీరుడు బ్రిటిష్ వారి పోలీసా…?

ట్రిపుల్ ఆర్ కి ఇప్పటికి కొన్ని సార్లుగా కరోనా షాక్ ఇస్తోంది. దాంతో షూటింగులకు ఆటంకం ఏర్పడింది. ఆ మీదట రిలీజ్ కి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది చాలదన్నట్లుగా ఆ సినిమా కధ…

ట్రిపుల్ ఆర్ కి ఇప్పటికి కొన్ని సార్లుగా కరోనా షాక్ ఇస్తోంది. దాంతో షూటింగులకు ఆటంకం ఏర్పడింది. ఆ మీదట రిలీజ్ కి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది చాలదన్నట్లుగా ఆ సినిమా కధ విషయంలో ఇపుడు పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. మేకర్స్ అయితే ఇది పూర్తిగా కల్పిత కధ అని చెబుతూ వస్తున్నారు.

కానీ అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్, అలాగే కొమరం భీమ్ గెటప్ లో జూనియర్ ఎన్టీయార్ ఉన్నట్లుగా విడుదల చేసిన టీజర్స్ కానీ ఇతర ప్రచారం కానీ తెలియచేస్తోంది. మరోవైపు చూస్తే రామ్ చరణ్ బ్రిటిష్ వారి హయాంలో పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు.

దీంతో ఈ కధ ఏంటి అంటూ అల్లూరి యుజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఫైర్ అయ్యారు. అల్లూరి తెల్ల దొరల గుండెల్లో నిద్రపోయిన అరవీర భయంకర రూపం. అలాంటి అల్లూరిని బ్రిటిష్ పోలీస్ గా చూపించడం దారుణమని వీరభద్రరావు అన్నారు. దీని మీద మేకర్స్ లేఖ రాసినా తగిన రెస్పాన్స్ రాకపోవడంతోనే హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఆయన చెబుతున్నారు.

విప్లవ వీరుడు అల్లూరి లాంటి వారు చారిత్రక సంపదగా ఆయన అభివర్ణించారు. తనకు అల్లూరి పుట్టిన దగ్గర నుంచి ఆయన మరణించేంటంతవరకూ ఏ ఏడాది ఎక్కడ ఉన్నారు, ఎలా పోరాడారు, ఆయన జీవితం ఏంటి అన్న చారిత్రక విషయాలు పూర్తి ఆధారాలతో సహా ఉన్నాయని వీరభద్రరావు చెప్పారు.

ఇక వీరభద్రరావు తండ్రి పడాల రామారావు స్వాతంత్ర సమరయోధులు, అలాగే శతాధిక గ్రంధకర్తగా ఉన్నారు. ఆయన అల్లూరి జీవిత చరిత్రను ఆంధ్రశ్రీ పేరిట రాశారు. అదే నేటికీ ప్రమాణికంగా ఉంది. అప్పట్లో ఎన్టీయార్ అల్లూరి మీద సినిమా తీయాలనుకుని పడాల రామారావు రాసిన నవల‌నే ఆధారంగా తీసుకున్నారు. ఆ తరువాత కోని కారణాల వల్ల ఎన్టీయార్ ఆ సినిమాను ఆయన తీయలేదు. అలాగే అల్లూరి, కొమరం భీమ్ ఇద్దరూ కలసినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదని కూడా వీరభద్రరావు అంటున్నారు.

అల్లూరి దేశం కోసం బ్రిటిష్ వారితో పోరాడారని, కొమరం భీమ్ అయితే ఆదీవాసీల హక్కుల కోసం నాటి నిజం పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమైంచారని ఆయన గుర్తు చేశారు. అలాంటి మహనీయుల జీవిత చరిత్రను కల్పితం అంటూ తప్పుగా చెబితే భావి తరాలు ఎలా అర్ధం చేసుకుంటాయని వీరభద్రరావు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో న్యాయం కోసమే కోర్టుని ఆశ్రయించినట్లుగా ఆయన చెబుతున్నారు.

విశాఖ జిల్లాలో అల్లూరి మ్యూజియం విషయంలో కూడా పోరాడుతున్న వీరభద్రరావు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తన సొంత డబ్బులతో అల్లూరి స్మారక ప్రాంతాన్ని ఎప్పటికపుడు రిపేర్లు చేయిస్తున్న అల్లూరి వీరాభిమాని పడాల వీరభద్రరావు మాత్రం తాను ఎక్కడా తగ్గేది లేదు అంటున్నారు. అల్లూరి విషయంలో వాస్తవాలనే ట్రిపుల్ ఆర్ లో చూపించేలా చర్యలు తీసుకోవాలని పడాల డిమాండ్ చేస్తున్నారు.