తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణం రాజు అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల కులాల ప్రస్తావన తెచ్చి తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఆ కేసుపై విచారణకు హాజరు కావాల్సిందిగా ఇటీవల ఆయనకు ఏపీ సీఐడీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. అయితే నోటీసులు పొందిన తర్వాత రఘురామకృష్ణంరాజు విచారణకు హాజరు కాలేదు. అయితే తనపై కేసులను కొట్టి వేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఈ విషయంలో ఏపీ సీఐడీ అధికారులనూ, ఏపీ హోం శాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. అదనపు డీజీ సునీల్ కుమార్ ను వ్యక్తిగతంగా ప్రతివాదిగా తేల్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.
తనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, తన భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతిబంధకాలు కలిగించే విధంగా ఏపీ సీఐడీ వ్యవహరిస్తోందని రఘురామ తన పిటిషన్లో పేర్కొన్నట్టుగా సమాచారం. మరి తీవ్రమైన పుంతలు తొక్కుతున్న రఘురామ భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో కోర్టు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో!