గత ఏడాది అక్టోబర్ ఇరవై ఐదో తేదీన జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఆ అవార్డుల ప్రధానోత్సవంలో సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ స్టార్ హీరో ధనుష్ ఇద్దరికీ అవార్డులు దక్కాయి. మామా అల్లుళ్లు ఒకేసారి అలా అవార్డులు పొందడం ఆసక్తిదాయకమైన అంశంగా నిలిచింది సర్వత్రా. ఈ విషయాన్నే రజనీకాంత్ కూతురు, ధనుష్ భార్య ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆమె చాలా సంతోషంగా స్పందించారు.
దే ఆర్ మైన్.. అంటూ తన తండ్రి, తన భర్త ఒకేసారి అవార్డులు పొందడం పట్ల చాలా ఉత్సాహంగా స్పందించింది ఐశ్వర్య. దాదాపు మూడు నెలల కిందట ఐశ్వర్య స్పందన అది. ఇంతలో ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన వచ్చింది.
మరి ఒక జంట విడాకులు తీసుకోవడం అంటే… విబేధాల బుడగ పుట్టడానికి, అది పేలడానికి సమయం పట్టవచ్చు. కొందరికి ఈ విషయంలో సంవత్సరాల కొద్దీ సమయం కూడా పట్టవచ్చు. ధనుష్, ఐశ్వర్యల మధ్య విబేధాలు కూడా చాలా పాతవే అనే రూమర్లున్నాయి.
అయినప్పటికీ 18 యేళ్ల పాటు వీళ్లు అధికారికంగా భార్యభర్తలుగా చలామణి అయ్యారు. ధనుష్ ను మూడు నెలల కిందట కూడా ఐశ్వర్య ఓన్ చేసుకుంది. అతడు తన వాడని గర్వంగా చెప్పుకుంది.
మరి ఇంతలోనే వీరి వ్యవహారం విడాకుల వరకూ రావడం విశేషం. పరస్పర అంగీకారంతో వీరు విడిపోతున్నట్టుగా ప్రకటించుకున్నారు. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ ల తరహాలో వీరి వీడ్కోలు ప్రకటన ఉంది.