నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కాలం కలిసిరానట్టుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయించి, ఆయన్ను ఊచలు లెక్క పెట్టించాలనే కలలు కల్లలవుతుండడంతో పాటు తానే విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతా కాల మహిమ అంటే ఇదే కాబోలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ బెయిల్‌కు సంబంధించి , అలాగే ఆయనపై నమోదైన నేరారోపణలపై విచారణ ముందుకు సాగలేదనే ఆవేదన తెలిసిందే.
ఈ నేపథ్యంలో రఘురామపై సీబీఐ నమోదు చేసిన కేసు ఎట్టకేలకు విచారణకు వచ్చింది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ ప్రత్యేక జడ్జి వినోద్ యాదవ్ కేసు విచారణ ప్రారంభించారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లను న్యాయమూర్తి పరిశీలించారు. ఈ కేసులో రఘురామ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే.
తమిళనాడులోని తూత్తుకూడిలో విత్యుత్‌ప్లాంట్ నిర్మాణం పేరుతో రూ.947.71 కోట్లు రుణాలు తీసుకుని, నిబంధనలను ఉల్లంఘించి మోసానికి పాల్పడ్డారని రఘురామపై సీబీఐ కేసు నమోదు చేసింది. గత నెల 31న ఆయనపై సీబీఐ చార్జిషీటు కూడా దాఖలు చేయడం, ఆ వెంటనే విచారణకు రావడంతో…స్పీడ్ పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేశారు. తనకు గిట్టని వారిపై కోర్టుల్లో కేసులు వేస్తూ, ఒక్కోమారు మొట్టికాయలు తింటూ వార్తల్లో వ్యక్తిగా రఘురామ నిలిచారు. తాజాగా తన అవినీతిపై విచారణ ఎదుర్కోవాల్సి రావడంతో ఆయన ఏమంటారో మరి!