ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ బతుకులపై గన్ ఎక్కు పెట్టారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఐఆర్ 27% కంటే తక్కువగా 23% ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల 4% వేతనాల్లో కోత పడుతుందని వాపోతున్నారు. జగన్ ప్రభుత్వ చర్యల వల్ల సర్వీస్ అంతా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. హెచ్ఆర్ఏ స్లాబ్ 12/14.5/20/30% నుంచి 8/16/24%లకు తగ్గింపు ఫలితంగా 12 హెచ్ఆర్ఏలోపు వారు 4%, 14.5%లోపు వారు 6.5%, 20%లోపు వారు 12%, అలాగే 30%లోపు ఉన్న వారు 14% చొప్పున జీతాల్లో కోతను భరించాల్సి వుంటుందని చెబుతున్నారు.
దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఎంతగా అంటే…తిట్టడానికి సంస్కారం అడ్డొచ్చి, వ్యంగ్యాన్ని జోడించి కీర్తించేంతగా. ఇటీవల పీఆర్‌సీ విషయంలో ఎలాగోలా ఉద్యోగ సంఘాల్ని ఒప్పించిన ప్రభుత్వం…హెచ్ఆర్ఏ విషయంలో ఉద్యోగుల భయాన్ని సీఎం జగన్ నిజం చేశారు. వేతన సవరణకు సంబంధించిన జీవోలు సోమవారం అర్ధరాత్రి విడుదల చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశాన్ని పసిగట్టొచ్చు. ఇప్పటికే ఐఆర్ 27శాతం కంటే తక్కువ ఫిట్‌మెంట్ (23.29 శాతం) ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నాయకులు మినహా, ఉద్యోగులంతా అసంతృప్తిగా ఉన్నారు. కనీసం హెచ్ఆర్ఏ విషయంలోనైనా కాసింత పెంపుదల ఉంటుందని ఉద్యోగులు ఆశించారు.
పెంపు కథ దేవుడెరుగు…ఉన్నది కూడా తగ్గించేసి తమది ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వమని సీఎం జగన్ తన చర్యల ద్వారా సంకేతాల్ని పంపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, డీఏల్లోనూ ఉద్యోగులకు ఝలక్ ఇవ్వడంతో తమ జీతాలు తగ్గుతాయనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం పెంచిన జీతాలు ఈ నెల నుంచే అని గొప్పగా ప్రచారం చేసుకుంటుంటే, మరోవైపు తగ్గిన వేతనాలు ఇప్పటి నుంచే అమలు అని ఆవేదన నిండిన వ్యంగ్యోక్తులతో విరుచుకుపడుతున్నారు.
కొత్త వేతన సవరణ ఉత్తర్వులపై ఉద్యోగులు తమ ఆవేదనను, నిరసనను సృజనాత్మకంగా సెటైర్స్‌తో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న వివిధ పోస్టులను పరిశీలిద్దాం.
‘సీఎం సార్ మహానుభావుడు. ఆంథ్రప్రదేశ్ లోని ఉద్యోగులు, పింఛనర్లు బతికినంత కాలం ఫొటోపెట్టుకొని పూజించుకునే మహా మనిషి. ప్రపంచ ఆర్థిక శాస్త్రాన్ని తిరగరాసిన అపర కౌటిల్యుడు. 17-01-2022 అర్ధరాత్రి సమయంలో ఆంథ్రప్రదేశ్ లోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల జీతాలు తగ్గిస్తూ రివర్స్ పీఆర్‌సీ జీఓలు జారీచేసిన అపర మేథావులు మన పాలకులు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు ఇంటి అద్దె 20% ను 16% కు, 14.5 ను 8% చేసి ఇంటి అద్దెను కూడా కోతవేసిన ఘనుడు మన ప్రియతమ సీఎం సార్’
‘నగర పరిహార భత్యం కట్. విజయవాడ, విశాఖ, వెలగపూడి మినహా అన్ని నగరపాలక సంస్థలకు, పట్టణాలకు, పల్లెలకు 8% ఇంటి అద్దె ప్రకటించి అందరినీ సమానం చేసి అసమానతలు తొలగించి కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని స్వాతంత్ర్యభారతంలో ఆచరణలో చూపిన మార్క్సిస్ట్ మేధావి మన సీఎం సార్. జీతం తగ్గించుకొని హుషారుగా, ఆనందంగా, ఆడుతూ పాడుతూ జయహో, జయ, జయహో అంటూ కేరితంలు కొడుతూ నేటి నుంచి ఆందోళనల మధ్య ఆనందంగా పని చేస్తారు’
‘ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న వరాలు 1.రివర్స్ పీఆర్‌సీ 2.హెచ్ఆర్ఏ కోత 3.సీసీఏ (సిటీ కాంపన్సేటరీ అలవెన్స్) తీసివేత 4.ఐదు సంవత్సరాల పీఆర్‌సీ తీసివేత ..వెరసీ నెల జీతం కోత’ అని ఉద్యోగులు తమ గోడును సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఉద్యోగుల ఆగ్రహాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేక ఢీ అంటే ఢీ అని వారిని కూడా ప్రత్యర్థి వర్గంగా భావిస్తుందా? అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే.