ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్‌పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అది రిపబ్లిక్ టీవీపై కావడం గమనార్హం.
అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని అర్నబ్ గోస్వామి సుప్రీంకోర్టును కోరారు. అర్నబ్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా సాగుతోందని అన్నారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల బెంచ్ స్పందిస్తూ … ‘టీవీ చానెల్స్ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? రిపబ్లిక్ టీవీలో అతని అరుపులపై మీ ఎన్నికల భవిష్యత్ ఆధారపడిందా? మేం ఆ టీవీ చూడం.. కానీ, మహారాష్ట్ర సర్కార్ చేసింది సరైందిగా భావించడం లేదు. వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి దూస్తే మేమున్నామని గుర్తుంచుకోండి’ అని హెచ్చరిక చేసింది.
చివరికి అర్నబ్ గోస్వామితో సహా మరో ఇద్దరికి కూడా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రూ. 50 వేల వ్యక్తిగత పూచీ కత్తుతో బెయిల్ మంజూరు చేసింది. గత బుధవారం అరెస్టై జైలులో ఉన్న అర్నబ్‌కు, తిరిగి బుధవారమే బెయిల్ మంజూరు కావడం గమనార్హం.
కానీ ఈ కేసులో విచిత్రమైన పరిణామం ఏంటంటే… ఎవరైనా సీబీఐ దర్యాప్తు అంటే హడలి పోతారు. అదేంటో కానీ, అర్నబ్‌కు మాత్రం సీబీఐపై ఎక్కడా లేని నమ్మకాన్ని కనబరచడం ఆశ్చర్యం కలిగిస్తుంది.