ఇన్నాళ్లకు కేంద్రం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. సమస్త బూతు వ్యవహారాన్ని తీసుకువచ్చి ఇళ్లలో కుమ్మరిస్తున్న ఓటిటి ప్లాట్ ఫారమ్ లకు ముకుతాడు వేయాలని నిర్ణయించింది.
వెబ్ సిరీస్ ల పేరిట వెర్రితలలు వేస్తున్న శృంగారాన్ని రంగరించి, అసభ్య సన్నివేశాలను మేళవించి, పరమ బూతు రోతల మాటలు మూటకట్టి వదుల్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు వెబ్ సిరీస్ లు అయితే చెప్పనక్కరలేదు. అక్రమ సంబంధాలు, విచ్చలవిడి శృంగారం తప్పమరేమీ కాదు.
కాస్త బాగున్న మంచి వెబ్ సిరీస్ లు అమెజాన్ ప్రయిమ్, నెట్ ఫ్లిక్స్, లాంటి వాటిల్లో వున్నా, వాటి తెలుగు డబ్బింగ్ ల్లో బూతులు దట్టించి వదులుతున్నారు. నోటితో మాటాడలేని బూతులు వెబ్ సిరీస్ ల్లో వినాల్సి వస్తోంది.
ఇక ఓటిటి ల సంగతి అలా వుంటే హిందీలో ఓటిటి లకు తక్కువ, యూ ట్యూబ్ చానెళ్లకు ఎక్కువ. వీటిల్లో విచ్చలవిడి శృంగార చిత్రాలు యాభై, వంద చెల్లించి చూడొచ్చు. ఇవి చూసే ఆర్జీవీ లాంటి వాళ్లు ఇలాంటి వ్వవహారం తెలుగుకు కూడా పరిచయం చేయాలని ప్రయత్నించారు. ఇక కొన్ని వెబ్ సైట్లు అయితే శృంగార కథలను నేరుగా కొన్ని, పిక్చరైజ్ చేసి కొన్ని ఆన్ లోకి వదుల్తున్నాయి.
నిజానికి ఓ అనుమానం.
బూతు సినిమాల సిడిలు అద్దెకు ఇస్తే పోలీసు కేసు. అదే ఆన్ లైన్ లో డబ్బులకు చూపిస్తే నో కేస్.
పోర్నో పత్రికలను పుస్తకాల రూపంలో అమ్మితే నేరం. కానీ ఆన్ లైన్ లో కి వదిల్తే, ఎవరికి ఎవరో?
ఇకనైనా ప్రభుత్వం మేల్కోవడం మంచిదయింది. పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న యూ ట్యూబ్ చానెళ్లను, ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లను కట్టడి చేయాలని ఇప్పటికైనా నిర్ణయించుకోవడం మంచి విషయం.