బాహుబలి ప్రభాస్ కు మైల్ స్టోన్ లాంటి సినిమా ఛత్రపతి. ఈ సినిమాలో ఇటు యాక్షన్, అటు ఎమోషన్ కంటెంట్ లు రెండూ తారాస్థాయిలో వుంటాయి.
రాజమౌళి భారీ సినిమాలు చేయకముందు మదర్ సెంటిమెంట్ తో చేసిన సూపర్ సినిమా ఇది. ఇన్నాళ్ల తరువాత ఈ సినిమాను ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారు. అది కూడా బాలీవుడ్ లో.
ఓ బాలీవుడ్ టీమ్ మొత్తం ఈ సినిమాను హిందీలోకి తీసుకెళ్తోంది. నిర్మాత, దర్శకుడు అంతా బాలీవుడ్ జనాలే.
అయితే హీరో మాత్రం మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మేరకు ప్రాజెక్టు ఫైనల్ అయినట్లు బోగట్టా. ఇవ్వాళో, రేపో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు సినిమాలు అన్నీ హిందీ లోకి డబ్ చేసుకుని, యూ ట్యూబ్ లో మిలియన్ల హిట్ లు కొల్లగొట్టాయి. అతని ఫైట్లకు హిందీ లో మంచి మార్కెట్ వుంది. బహుశా ఆ లైన్ లోనే ఈ ఆఫర్ వచ్చి వుంటుంది.
అయితే ఛత్రపతిలో యాక్షన్ సీన్లతో పాటు సెంటిమెంట్, ఎమోషన్ సీన్లకు కూడా అంతే ప్రాధాన్యత వుంటుంది. వాటిని పండించగల డైరక్టర్ అవసరం ఎంతయినా వుంది. అలాంటి డైరక్టర్ ఎవరు టేకప్ చేస్తున్నారో చూడాల్సి వుంది.