ఇప్పుడు పచ్చ మీడియాకి ఆ దమ్ముందా?

రెండేళ్ల క్రితం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశులో నిర్బంధ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే ఆలోచన చేయగానే ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. పచ్చ మీడియా భగ్గుమంది. తెలుగుభాషకి అన్యాయం జరిగిపోతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా…

రెండేళ్ల క్రితం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశులో నిర్బంధ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే ఆలోచన చేయగానే ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. పచ్చ మీడియా భగ్గుమంది. తెలుగుభాషకి అన్యాయం జరిగిపోతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా ఢిల్లీలో ఉన్న కొందరు తెలుగు పెద్దలు కూడా వాపోయారు.

ఇప్పుడు అదే పని తెలంగాణాలో కేసీయార్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి ఇంగ్లీష్ మీడియం పెట్టే దిశగా అడుగులేస్తున్నారు. 

మరిప్పుడు పచ్చ మీడియాకి నోరు లేస్తుందా? ఢిల్లీలోని తెలుగు పెద్దలు మళ్లీ వాపోతారా? చంద్రబాబు గట్టిగా ప్రశ్నిస్తారా? 

అబ్బే…తెరాసా మీద, కేసీయార్ మీద నోరెత్తే ధైర్యం వీళ్లకెక్కడ? 

పవన్ కళ్యాణ్ అయితే అప్పట్లో, “తెలుగు భాషని చంపేస్తే మట్టిలో కలిసిపోతారు” అన్నాడు. మరిప్పుడు కేసీయార్ ని ఆ మాట అనగలడా? ఏంటి అనేది? ఆస్తులు మీద భయంతో పవర్ స్టార్ కి పవర్ కట్టైపోదు. 

ఏబీయన్ అయితే ఏకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టి ఆంధ్రలో క్రైస్తవాన్ని పెంచే ఆలోచనలో ఉన్నాడు జగన్ అని ప్రచారం చేసారు. అసలు ఇంగ్లీష్ మీడియం వల్ల క్రైస్తవం పెరగడమేంటి? లాజిక్కుందా? 

మరి వేదికలమీద అనర్గళంగా తెలుగు పద్యాలు చెప్పి శభాషనిపించున్న తెలుగు భాషాప్రేమికుడు, సనాతన యజ్ఞాలు చేస్తూ యాదాద్రిని సైతం కట్టి హిందూ మతానికి కేరాఫ్ గా నిలుస్తున్న కేసీయార్ కూడా క్రైస్తవ మత వ్యాప్తికి ఇంగ్లీషు మీడియం పెడుతున్నారని ఏబీయన్ కూయగలదా? కూయాలనే ఆలోచనకే తడిసిపోతుంది కదా లోపల.  

అసలు ఇంగ్లీషు మీడియంలో చదివితే తెలుగు చచ్చిపోతుందని ఎందుకనుకుంటారో కొందరు మహానుభావులు. 

కేవలం తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల తెలుగు పలకలేకపోతున్నారని రాష్ట్రమంతా అలాగే ఉంటారనుకోవడం పొరపాటు. 

ఆ మాటకొస్తే తెలుగు మీడియంలో చదివి కూడా తెలుగు తప్పుల్లేకుండా రాయలేనివాళ్లు కూడా మన చుట్టూ కనిపిస్తుంటారు. 

ఇక్కడ ఆసక్తిని బట్టి, విద్యార్థుల ఐక్యూని బట్టి భాషాప్రావీణ్యం వస్తుంది తప్ప ఇంగ్లీషుని దూరంగా పెట్టడం వల్ల కాదు. 

అసలు ప్రతి మనిషి మాతృభాష ఎలాగూ మాట్లాడతాడు. ఆ భాషతో పాటు కనీసం మరొక రెండు భాషల్లో అనర్గళమైన నైపుణ్యం తెచ్చుకోవడం అవసరం. దానివల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అందుకే కదా చంద్రబాబు గారి మనవడికి చిన్నప్పటినుంచీ చైనీస్ కూడా నేర్పిస్తున్నారు. 

ఇంట్లో పిల్లలకి ఇంగ్లీషుతో ఆగకుండా విదేశీ భాషలు నేర్పించేస్తూ ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని మాత్రం తెలుగు మీడియం కే పరిమితం వేయడం వెనుక నాయకుల ఉద్దేశ్యమేంటి? 

ఏమన్నా అంటే జెర్మనీవాళ్లు జెర్మనీ భాషలోనూ, చైనావాళ్లు చైనీస్ లోను చదువుకుంటున్నారు…ఒక్క భారతీయులకే ఇంగ్లీష్ మోజు అంటూ అరకొర తెలివిని ప్రదర్శిస్తుంటారు కొందరు కుహనా మేధావులు. 

కాస్త ప్రస్తుత ప్రపంచం వైపుకు చూస్తే అర్థమౌతుంది. 

ఇప్పటికే చైనాలోని స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టేసారు. రానున్న రోజుల్లో చైనా వాళ్లకి చైనీస్ తో పాటు ఇంగ్లీషులో కూడా అనర్గళమైన ప్రావీణ్యం వస్తుంది. ప్రపంచంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇంగ్లీష్ ఆవశ్యకతని ప్రతి దేశం గుర్తిస్తోంది. 

“మాతృభాష కళ్లు. ఇంగ్లీషు భాష కళ్లజోడు” అనేది నిజమే. ఇక్కడ కళ్లజోడు పెట్టుకుంటే ఉన్న కళ్లు కనపడవని కాదుగా. ఇంకాస్త బాగా కనపడుతుందని అర్థం చేసుకోవచ్చుకదా…! దేంట్లోంచైనా కళ్లతోనే చూడాలి. అదేదో కళ్లజోడు పెట్టుకుంటే కళ్లుపోతాయన్న చందాన స్టేట్మెంట్లిచ్చారు కొందరు. 

మనకి నచ్చని వాళ్లు గొప్పపని చేసినా అందులో బొక్కలు వెతకాలనిపిస్తుంది. అది మానవనైజం. కానీ అదే పని పలువురికి ఆదర్శమవుతున్నప్పుడు కళ్లు తెరుచుకోవాలి. 

మన దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ 100% ఇంగ్లీష్ మీడియం విద్య ఇచ్చి చూస్తే రానున్న 20 ఏళ్లల్లో దేశంలోని యువత ప్రపంచాన్ని ఎలా ఏలుతుందో చూడొచ్చు. 

అంతే తప్ప ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివే ప్రజలు కనుమరుగైపోతారేమోననే భయం అర్థం లేనిది. ఆ అర్థం లేని భయంతో పచ్చ మీడియా భాషని ఉద్దరించే వాళ్లలాగ పోసుగొట్టి ఇంగ్లీషు మీడియం చదువులకి అడ్డం పడడం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకి చేసే అతి పెద్ద ద్రోహం అవుతుంది. 

శ్రీనివాసమూర్తి