టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే బాబు తనయుడు, టీడీపీ యువ నేత నారా లోకేశ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. లోకేశ్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
కరోనా థర్డ్ వేవ్ రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో పలు రంగాల ప్రముఖులు మహమ్మారి బారిన పడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ కోవలో తాజాగా రాజకీయ రంగం నుంచి చంద్రబాబు పేరు ఆ జాబితాలో చేరడం గమనార్హం. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్టు చంద్రబాబు ట్విటర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా చంద్రబాబు కోరారు. తండ్రీకొడుకు ఒక రోజు వ్యవధిలో మహమ్మారి బారిన పడడం గమనార్హం. తమ నాయకులు త్వరగా కోలుకోవాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొన్ని చోట్ల ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.
ఇదిలా వుండగా కరోనా థర్డ్ వేవ్ ఏ ఒక్కర్నీ వదిలి పెట్టేలా లేదు. పల్లె,పట్టణం, నగరం అనే తేడా లేకుండా దూసుకొస్తున్నట్టు… నమోదవుతున్న కేసులే తెలియజేస్తున్నాయి.