ఎమ్బీయస్‍: కారా మాస్టారితో…

కథారచయిత కాళీపట్నం రామారావుగారు కారా మాస్టారిగానే సుప్రసిద్ధులు. వృత్తిరీత్యా ఆయన స్కూలు టీచరు కావడం చేతనే కాదు, కథాకారులందరికి పెద్దదిక్కుగా అవతరించడంతో.. అనవచ్చు. గతంలో నేను పరిచయం చేసిన ‘‘యజ్ఞం’’ కథ ఆయనకు గురుస్థానాన్ని…

కథారచయిత కాళీపట్నం రామారావుగారు కారా మాస్టారిగానే సుప్రసిద్ధులు. వృత్తిరీత్యా ఆయన స్కూలు టీచరు కావడం చేతనే కాదు, కథాకారులందరికి పెద్దదిక్కుగా అవతరించడంతో.. అనవచ్చు. గతంలో నేను పరిచయం చేసిన ‘‘యజ్ఞం’’ కథ ఆయనకు గురుస్థానాన్ని కల్పించింది. ఉత్తరాంధ్రలో యీయన, రావిశాస్త్రి, బీనాదేవి, బలివాడ, అవసరాల, భరాగో వంటి వారెందరో ఉద్యమస్ఫూర్తితో కథలు రాశారు. ఇప్పటికీ కథకుల్లో ఆ ప్రాంతంవారి వాటా చాలా ఎక్కువ. కారా మాస్టారితో నాకు వ్యక్తిగత పరిచయం ఏర్పడి, కొనసాగింది. ఆ విషయాలు రాయడం ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. దీనిలో నా ప్రస్తావన రావడం తప్పనిసరి. రచయిత రచనలు, వాటి నాణ్యత పాఠకలోకానికి తెలుస్తాయి. కానీ వ్యక్తిగా వారు ఎటువంటివారు, వారిలో ఏయే గుణాలున్నాయి అనేది వారితో మసలినవారికి మాత్రమే తెలుస్తుంది.

ఈ రెండూ వేరేవేరే లక్షణాలు. ఆత్రేయ కవిగా మనకు ఆరాధ్యుడు. కానీ ఓ పట్టాన రాయక, నిర్మాతలను ఏడిపించేవారు కాబట్టి, వారు చూసే కోణం వేరేలా వుంటుంది. అలాగే శ్రీశ్రీ. మహాకవే. కానీ వ్యక్తిగా ఆయనతో వేగినవారికి ‘అబ్బ’ అనిపిస్తుంది. ‘‘నా చైనా యాత్ర’’ అని శ్రీశ్రీ పుస్తకం వుంది. దానిలో ఆయన చైనా విశేషాల కంటె ఎక్కువగా ‘‘అనుగ్రహం’’ (1978) సినిమా నిర్మాతలు ఎలా బాధపెట్టారో ఎక్కువ రాసుకున్నాడు. శ్రీశ్రీ తమను ఎంత హింసించాడో ఆ నిర్మాతలు పత్రికలకు చెప్పుకున్నారు తప్ప పుస్తకాలు రాయలేదు. శ్రీశ్రీ తన భార్య సరోజతో ఎలా వ్యవహరించారో కళ్లారా చూసిన చిత్రకారుడు బాలి తన ఆత్మకథలో రాశారు.

అందరు రచయితలు, కళాకారులు వ్యక్తులుగా ఆమోదయోగ్యులు కానక్కరలేదు. సీతారామశాస్త్రి గారికి నివాళి వ్యాసంలో నేను ‘‘హాసం’’ ఎడిటరుగా పనిచేసిన రాజా స్వభావం గురించి రాస్తే ఒక పాఠకుడు ఆయన రచనల గురించి రాశారు. ఆ ప్రతిభ వుంది కాబట్టే ఆయన సంపాదకుడి స్థాయికి ఎదగగలిగాడు. కానీ ఆయనతో వ్యవహరించే వారి అవస్థ వాళ్లకే తెలుస్తుంది. అలాగే కొందరి ఔన్నత్యం వారితో సంపర్కం వున్నవాళ్లకే తెలుస్తుంది. రచయితలుగా, వ్యక్తులుగా ఉభయత్రా మన్నన పొందగలిగినవారు ధన్యులు. రచయిత వృత్తి జీవితం గురించి. వారు గతించిన వందల సంవత్సరాల తర్వాత కూడా పుస్తకాల్లో చూసి రాసేయచ్చు. వ్యక్తిత్వం రాయడానికి, వారి సమకాలీనులై వుండి, వాళ్లతో కాస్తయినా వ్యవహారం సాగాలి. నాకు అలా చాలా కొద్దిమందితో మాత్రమే పరిచయం వుంది. వారిలో మాస్టారు ఒకరు. చిన్నప్పటి నుంచి ఆయన కథలు చదివిన పాఠకుడిగా ఆయన ఘనత తెలుసు. అందుకే 1994లో ఆయన వద్ద నుంచి ఉత్తరం రాగానే కొండెక్కినంత సంతోషం కలిగింది.

నా తొలికథ 1973లో ఆంధ్రపత్రిక వీక్లీలో పడింది. అప్పట్లో అది, ఆంధ్రప్రభ పేరున్న వారపత్రికలు. కానీ నేను మరో 20 ఏళ్ల పాటు రచనా వ్యాసంగాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. రాయటంలో కంటె చదవటంలోనే ఎక్కువ ఆనందం కలిగేది కాబట్టి, సగటున ఏడాదికి ఒక రచన కంటె చేయలేదు. వాటిల్లో కొన్ని కథలు ఇంగ్లీషులో రాశాను. ఇంగ్లీషు పత్రికలలో వచ్చేవి. 1993 ప్రాంతంలో ఒక ఐడియా వచ్చింది. భానుమతి ‘అత్తగారు’ తరహాలో తెలుగులో ఒక పాత్రను అల్లుకుని వరుసగా హాస్యకథలు రాస్తే ఎలా వుంటుందాని. నాకు పిజి ఉడ్‌హౌస్ యిష్టం కాబట్టి, ఆయన సృష్టించిన జీవ్స్ స్ఫూర్తిగా ‘అచలపతి’, ఊస్టర్ స్ఫూర్తిగా ‘అనంతశయనం’ పాత్రలు సృష్టించి ఓ 15 కథలు రాద్దామనుకున్నాను. ముందుగా మూడు కథలు రాశాను. అప్పట్లో ప్రీమియర్ పత్రికగా వెలుగొందుతున్న ‘‘రచన’’ మాసపత్రికకు నా స్కీము వివరిస్తూ యీ కథలు పంపాను.

రచనకు కర్త, కర్మ, క్రియగా సంపాదకుడు శాయిగారున్నా, ఆయన సంపాదక సలహామండలి అని పెట్టుకుని దానిలో కారా గారు, కవనశర్మగారు, వివినమూర్తి గారు యిలాటి వాళ్లను పెట్టుకున్నారు. ఈ కథలను శాయిగారు కారా మాస్టారికి పంపారు. అవి చదివి మాస్టారు నాకు డైరక్టుగా 29.4.94న ఒక ఉత్తరం రాశారు. అప్పటిదాకా ఆ కథలు ఆయన పరిశీలనకు వెళ్లాయన్న సంగతి నాకు తెలియదు. ఎడిటింగ్ టీములో వున్నా మేస్టారికి ఎంత వినయం ఉందో మీకు తెలియాలని ఆ ఉత్తరం యథాతథంగా యిస్తున్నాను. ‘శ్రీయుతులు ప్రసాద్ గారికి – నమస్కారం. రచన సంపాదకుల కోరికపై మీ వోడ్‌హౌస్ తరహా కథళు చదివేను. సబ్జక్ట్స్‌ మీవి. తరహా అతనిదీ అన్నారు. ఆ కథలు అక్షరాలా అలాగే సాగాయి. నేను గత యాభైయేళ్లకు పైగానే, తెలుగు కథని శ్రద్ధతో చదువుతున్నాను. విమర్శకుణ్ణి కాను. ఓఠ్ఠి పాఠకుణ్ణి.

‘తెలుగులో సీరియస్ కథ అభివృద్ధి చెందినంతగా హాస్యకథ, వ్యంగ్యకథ అభివృద్ధి కాలేదు. తగినవారు ప్రయత్నిస్తే యీ రకం కథలు లక్ష్యసాధనతో సహా, చాలా ప్రయోజనాలు సాధించగలుగుతాయి. మీరింకా యిలాంటి కథలు రాస్తామన్నారు కాబట్టి నాది ఒక్క కోరిక. నే చదివిన మూడు కథల్లో ఒకదాని విషయం – పిల్లల మీద నేటి సినీమాప్రభావానికి సంబంధించినది. మీ కథలు, యికముందు రాయబోయేవి, అలా వర్తమానంలోని విషయాల మీద సాగితే అందుకనుగుణ్యమైన పాత్రలు తీసుకుంటే, మీ రెన్నుకున్న వోడ్‌హౌస్ మార్గం మరింత ఫలప్రదం కాగలదనిపించింది. ఈ నాలుగు మాటలూ రచయితగా మీ స్వతంత్రాన్ని గౌరవిస్తూనే మీ రచనలు నాలో కలిగించిన హోప్, ప్రేరణలతో రాసేను. అపార్థం చేసుకోరని ఆశిస్తూ.. భవదీయుడు కా.రామారావు. పిఎస్. రచన, బహుశ, ఆ మూడు కథల్నీ స్వీకరించగలదనే అనుకుంటాను.’

అప్పటిదాకా రచయితగా నేను గుర్తింపేమీ తెచ్చుకోలేదు. నేనెవరో ఆయనకు తెలియదు. అయినా ఒక ఔత్సాహిక రచయితను ఆయనంతటి మేరుపర్వతం ఒంగి వెన్నుతట్టిన తీరు చూడండి. అందుకే ఆ ఉత్తరాన్ని భద్రపరచుకున్నాను. ‘‘రచన’’ ఆ సీరీస్‌ను ఆమోదించింది. లోగో కోసం బాపుగార్ని, అప్పటికే పరిచయమైన ముళ్లపూడి రమణ గారి ద్వారా ఎప్రోచ్ అయ్యాను. బాపుగారికి కథలు నచ్చి, లోగో గీసి యిచ్చారు. ఆ సందర్భంగా కారా మాస్టారి ఉత్తరంలో విషయాలు రమణ గారికి చెప్తే ఆయన ‘మాస్టారు మంచివాడే కానీ ప్రతీవాళ్లని సామాజిక స్పృహ చట్రంలోకి లాగేస్తారు. రావిశాస్త్రిలా ఆ మాయలో పడకండి.’ అని సలహా యిచ్చారు. ‘అబ్బే, లెఫ్ట్ కానీ, రైట్ కానీ, భక్తి కానీ, ద్వేషం కానీ ప్రచారం చేయడానికి సాహిత్యాన్ని వాడుకుంటే డ్రామా చచ్చిపోతుందని నా అభిప్రాయమండి. కథ కథగానే వుండాలనుకుంటాను.’ అన్నాను. అచలపతి కథలు అలాగే సాగాయి. నాకు చాలా గుర్తింపు తెచ్చాయి.

మాస్టారి ఉత్తరానికి నేను జవాబు రాశాను. ఆయనా, కవనశర్మగారు మద్రాసు మీదుగా బెంగుళూరు వెళుతున్నామని, వీలైతే స్టేషన్‌లో కలవమని రాశారు. 6.6.1994న సెంట్రల్‌లో వాళ్లిద్దరినీ మొదటిసారి కలిసి, వారి పుస్తకాలపై ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నాను. నాకు కవనశర్మగారూ చాలా యిష్టం. రచయితగానూ, వ్యక్తిగానూ కూడా గొప్పవారు. హాసం నడిపే రోజుల్లో నేను ఉడ్‌హౌస్ మరో పాత్ర బింగో లిటిల్ ఆధారంగా ‘రాంపండు’ అనే పాత్ర సృష్టించి, ‘రాంపండు లీలలు’ అనే కథామాలిక రాసి, పుస్తకంగా వేసినప్పుడు ముందుమాట రాసిపెట్టారు. నేను 1995 జూన్‌లో మద్రాసు నుంచి హైదరాబాదుకు బదిలీ అయి వచ్చేశాను. 1997లో సాహిత్య ఎకాడమీ సభలు జరిగినప్పుడు మాస్టారు శ్రీకాకుళం నుంచి వచ్చారు. అప్పటికే ఆయన ‘కథానిలయం’ యజ్ఞం ప్రారంభించారు.

ఆయన తన ఉత్తరంలో రాసుకున్నట్లు ఓఠ్ఠి పాఠకుడు మాత్రమే అయితే ఆయన మరణానంతరం 30, 40 ఏళ్లకు మర్చిపోయే ప్రమాదం వుండేది. కానీ తెలుగు కథ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా వుండేట్లు చేసిన మహత్కార్యం – కథానిలయం. పాతకాలంలో కథలు కంచికి చేరాయనేవాళ్లు. ఈ కాలంలో ప్రతి తెలుగు కథ చేరవలసిన చోటుగా కథానిలయం వుండాలనే దీక్షతో మేస్టారు కథానిలయం మొదలుపెట్టారు. ఆయన సామాన్య కుటుంబీకుడు. పిల్లలున్నారు. అయినా కూడబెట్టుకున్న డబ్బుతో శ్రీకాకుళంలో కొనుక్కున్న స్థలాన్ని దీనికి విరాళంగా యిచ్చేశారు. శేషజీవితాన్ని దాన్ని నడపడానికి, అభివృద్ధి చేయడానికి వినియోగించారు. ఆయన చిత్తశుద్ధిని, కార్యదీక్షను చూసి ముచ్చటపడిన ఎందరో నిధులు సేకరించి అందించారు. ఒక ట్రస్టు ఏర్పడి, ఆర్థిక వ్యవహారాలన్నీ చూసింది. అక్కడ భవంతి లేచింది. 1997 ఫిబ్రవరిలో ఒక సరస్వతీ మందిరంగా, ఒక రిసెర్చి సెంటరుగా, కథల కాణాచిగా వెలసింది. దినదినాభివృద్ధి చెందుతూనే వుంది.

ఏ తెలుగు కథైనా సరే అక్కడ దొరుకుతుంది. ప్రతి పత్రికలో అచ్చయిన కథను అక్కడ భద్రపరుస్తారు. చక్కగా యిండెక్స్ అయివుంటుంది. సాహిత్యంలో ఒక ప్రక్రియకై ప్రత్యేకంగా లైబ్రరీ వుండడం ప్రపంచంలో అదే ప్రథమప్రయత్నమట. కథలతో బాటు రచయితల వివరాలు కూడా అక్కడ భద్రపరచాలని మేస్టారి ప్రయత్నం. చాలామంది తెలుగు రచయితలు తమ కథలను భద్రపరచుకోరు. తమ వివరాలు తెలుపుకోరు. ఎన్ని కథలు రాశారంటే చెప్పలేరు. కాపీలు పంపమంటే పంపరు. రికార్డు చేయడం, భద్రపరచడం తెలుగువాళ్లకి చేతకాని పని. ఇలాటి రచయితలను మోటివేట్ చేయాలని మాస్టారు స్వయంగా హైదరాబాదు వచ్చారు. సాహిత్య ఎకాడమీ సమావేశానికి వచ్చి, కథలను రక్షించి, ఒక చోట దాచి వుంచవలసిన అవసరం గురించి ప్రతి రచయితకు నచ్చచెప్పడం ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ షీట్లు తయారుచేసి, వాటిలో తమ వివరాలు నింపమని అందర్నీ అడగసాగారు. నిజమైన నిస్వార్థ సాహిత్యసేవకుడంటే ఆయనే!

నేను ఆయన్ను పలకరించి, ఆ షీటు చూసి, దానిలో కొన్ని మార్పులు సూచించాను. అప్పటికే ముళ్లపూడి వెంకటరమణ గారి అసంఖ్యాకమైన రచనలను సేకరించి లోటస్ 123 సహాయంతో తేదీల వారీగా, సబ్జక్టువారీగా వింగడించిన అనుభవం నాకుంది. మాస్టారి కోరికపై అప్పటికప్పుడు మార్చిన షీటును కంప్యూటరులో తయారుచేసి కాపీలు పట్టుకుని వచ్చి యిచ్చాను. నేను చేసిన పని చిన్నదే. దానికే ఆయన బ్రహ్మానంద పడిపోయారు. గమనించండి, దీనిలో ఆయనకు ఏ లాభమూ లేదు. ఆయనకు రావలసిన పేరు అప్పటికే వచ్చేసింది. ఇదంతా తక్కిన రచయితల కోసం, తెలుగు కథ ఆయుర్దాయాన్ని పొడిగించడం కోసం! అప్పణ్నుంచి మా మధ్య బంధం బలపడింది. నా దగ్గరున్న వివరాలు ఆయనకు పంపేవాణ్ని. అప్పట్లో నేను విరివిగా రాసేవాణ్ని. వాటి గురించి ఆయన వ్యాఖ్యానిస్తూండేవారు.

2001 అక్టోబరులో నేను బ్యాంక్ ఉద్యోగం మానేసి ‘‘హాసం’’ పత్రికకు మేనేజింగ్ ఎడిటరు నయ్యాను. తొలి సంచిక కథానిలయానికి పంపాను. దానికి మేస్టారు ‘హాసం పత్రిక తొలి సంచిక అందింది. ముందుగా అభినందనలు. తర్వాత ధన్యవాదాలు. కొత్త పత్రికలు చాలా వస్తున్నాయి. వచ్చిన పత్రికల్లో చాలా ‘పత్రికలకు ఇవి కాని రోజుల’ని రుజువు చేస్తున్నాయి. హాసం అలాకాదు. ఈనాటి పాఠకుల నాడి తెలిసిన పత్రికగా కనిపిస్తోంది. ఆదర్శాలకు నీళ్లొదులుకోకుండా పత్రిక నిలబెట్టుకోడం ఎవరికో కాని సాధ్యం కాదు. మిమ్మల్ని నేనెరిగివాడిని. మీరనుకున్న తీరులో పత్రిక నడపగలరనే నా నమ్మకం. మీకూ పత్రికకూ శుభాకాంక్షలతో – కా.రామారావు.’ అని ఉత్తరం రాశారు. హాసం ప్రతి సంచికా కథానిలయానికి పంపేవారం. ప్రతి సంచికకు ‘చేరినది, ధన్యవాదాలు’ అంటూ పోస్టు కార్డు రాసేవారు. అక్కరలేదని చెప్పినా వినేవారు కారు. ఆ తరం వారి పద్ధతే అంత.

‘సాధారణంగా తక్కిన పత్రికలలో కథలు మాత్రం వుంచి, తక్కిన పేజీలు తీసేస్తున్నాం. ‘హాసం’ మాత్రం సంచిక మొత్తం వుంచుతున్నాం, దానిలో అనేకానేక యితర అంశాలున్నా!’ అని చెప్పారు. ధన్యులం అనుకున్నాను. ‘‘హాసం’’ మార్కెటింగు ప్రయత్నాల్లో భాగంగా 2003 సెప్టెంబరులో శ్రీకాకుళం వెళ్లి కథానిలయం చూడబోయాను. ఆయన సాదరంగా రిసీవ్ చేసుకుని అన్నీ దగ్గరుండి చూపించారు. అప్పుడు మా మధ్య జరిగిన ఒక సంభాషణ చెప్పాలి. కథానిలయంలో రచయితల లామినేటెడ్ ఫోటోలు ఎ3 సైజు కంటె పెద్దవి పెట్టారు. నాది కూడా పంపమని ఆయన చాలాసార్లే చెప్పారు కానీ మొహమాటపడి పంపలేదు. నేను వెళ్లినపుడు సూటిగా అడిగారు ‘ఎందుకు పంపటం లేదు?’ అని. ‘నేను రచయితనని గట్టిగా నమ్మకం కుదరటం లేదండి’ అన్నాను సిగ్గుపడుతూ.

‘మీకా సంకోచం అక్కరలేదు, మీ ‘అచలపతి కథలు’ స్థిరంగా నిలుస్తుంది. నేను ఎన్ని రాసినా ‘యజ్ఞం’ కథ ద్వారానే నన్ను గుర్తుంచుకుంటారు. మీకు అచలపతి అలాగే ఉంటుంది.’ అన్నారు. ఆయన ఎన్నో మంచి కథలు రాశారు. నా ప్రతి కథా ఆణిముత్యం, చరిత్రలో నిల్చిపోతుంది అని అనకుండా ఎంతో వినయంగా ఆ మాటలు చెప్పారు. నా రచనను ఆశీర్వదించారు. కానీ నా జంకు నాది. ఇప్పటికీ పంపలేదు. శ్రీపాద, మల్లాది, కొ.కు. వంటి వారి సరసన నా ఫోటో ఊహించలేను. 2004 డిసెంబరులో హాసం మూతపడింది. 2005 ఏప్రిల్ నుంచి హాసం పుస్తకాల ప్రచురణ మొదలుపెట్టాం. నేను విడిగా కూడా పుస్తకాలు ప్రచురించసాగాను. ఏ పుస్తకం వేసినా కథానిలయానికి పంపేవాణ్ని. అనేకమంది ఉత్సాహవంతుల సహకారంతో, వరప్రసాద్ వంటి సాహితీప్రియుల విరాళాలతో కథానిలయం విస్తరిస్తూ పోయింది. వేలాది పత్రికలు, కథాసంకలనాలు, వెయ్యి మంది రచయితల వివరాలు సేకరిస్తూ పోయింది. నేను విదేశీ క్రైమ్ రచనల ఆధారంగా థ్రిల్లింగ్ కథలు పేర రాసిన 38 కథలతో .38 కాలిబర్ అనే పుస్తకాన్ని 2005 సెప్టెంబరులో తయారు చేస్తే ఎన్.కె. పబ్లికేషన్స్, ఎన్‌కె బాబు గారు ప్రచురించారు. దాన్నీ కథానిలయానికి పంపాను.

2010లో మేస్టారు ఫోన్ చేశారు – ‘బాబూ, చిన్నప్పటి నుంచి డిటెక్టివ్, క్రైమ్ పుస్తకాలు చదివే అలవాటు లేదు. అవి చదవకూడదని యింట్లో చెప్పడం చేతనో ఏమో వాటి జోలికి పోలేదు. మీ .38 కాలిబర్ కూడా చదవలేదు. ఈ మధ్య కింద పడి, కాలు విరిగి మంచం మీద కొన్నాళ్లు వుండాల్సి వచ్చింది. ఏం తోచక మీ పుస్తకం మొదలుపెట్టాను. చాలా బాగున్నాయి. ఇన్నాళ్లూ చదవనందుకు యిదయ్యాను.’ అన్నారు. నేను సంతోషపడుతూనే ‘నా ఒరిజినల్ కథలు కావు కదా’ అని సిగ్గుపడ్డాను. ‘తెలుగు కథల్లాగానే రాశారు’ అంటూ ఆయన ‘అవునూ, ఆ పుస్తకాన్ని మీ భార్యకు అంకితం యిస్తూ ‘అగాథా క్రిస్టీని, విశ్వనాథ సత్యనారాయణను సమానంగా అభిమానించగల ఓ ‘చక్కని’ చదువరి, నా జీవన సహచరి ఎమ్మెస్ స్వాతికి..’ అని రాశారు. ఆవిడ మంచి పాఠకురాలా?’ అని అడిగారు.

‘అవునండి. తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు చాలా విస్తారంగా చదువుతుంది. రాయగలదు కూడా. అగాథా క్రిస్టీ ఒక నవలను ‘‘ఎవరు?’’ అనే పేరుతో తెలుగు పేర్లతో అనువదిస్తే ఆంధ్రప్రభలో సీరియల్‌గా వచ్చింది కూడా. కానీ రాయడంలో తనకు ఆసక్తి లేదు. చదవడమే యిష్టం.’ అన్నాను. ‘సంతోషం, ఆవిడ పక్కన వున్నారా? ఓ సారి మాట్లాడతాను.’ అన్నారు. మా ఆవిడకు చెప్తే జంకింది. ‘అంత పెద్దాయనతో నేనేం మాట్లాడతాను, వద్దువద్దు’ అంది. ఫర్వాలేదని నచ్చచెప్పి ఫోన్ యిచ్చాను. ఆయన ‘అమ్మా, నేను నా పుస్తకాన్ని పంపుతాను. చదివి ఎలా వుందో చెప్పాలి.’ అన్నారు. ‘అయ్యో, నేను చెప్పడమేమిటండి’ అంటూ యీవిడ మెలికలు తిరిగిపోయింది కానీ ఆయన పంపేశారు. మనసు ఫౌండేషన్ వారు వేసిన ‘కాళీపట్నం రామారావు రచనలు’ అనే 548 పేజీల పుస్తకమిది.

మొదటిపేజీలో ‘చి.సౌ. స్వాతీప్రసాద్‌కి ఆశీర్వచనాలతో, కా రామారావు, వికృతి ఉగాది పర్వదినాన’ అని సంతకం పెట్టి పంపారు. తర్వాత కొన్ని నెలలు యీవిడకు నిద్ర లేదు. ఆయన వినయానికి భయం వేసింది. ఎప్పుడైనా ఫోన్ చేసి ఎలా వుందని అడుగుతారేమో, అంతటి మహానుభావుడిపై ఏం వ్యాఖ్యానిస్తాం? అని. అదృష్టవశాత్తూ ఆయన ఆ విషయంగా ఫోన్ చేయలేదు. 2011లో స్వాతి వీక్లీ కథల పోటీలో బహుమతి పొందిన ‘అతీ, గతీ, సద్గతి’ అనే నా కథ ఆయనకు బాగా నచ్చింది. ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఆధ్యాత్మికత్వం పేర యీనాడు జరుగుతున్న వ్యాపారధోరణిని వ్యంగ్యంగా చెప్పినందుకు అభినందించారు. అప్పుడే ‘మీ కథల్లో విషయం చాలా వుండి, కథ కిక్కిరిసి పోతోంది.’ అని కామెంట్ చేశారు. ‘నిజమేనండి. ఈ రోజుల్లో కథాంశం పెద్దగా వుండక కథలు చదవడం మానేశారు. చదివినా పైపైన చదివి వదిలేస్తున్నారు. అందుకని నేను ఒక నవలికకు సరిపడా ప్లాట్ తీసుకుని, అనేక మలుపులతో ఎంత క్లుప్తంగా చెప్పగలనా అని ప్రయత్నిస్తున్నాను. అక్షరమక్షరం చదివితే తప్ప బోధపడిన రీతిలో రాస్తున్నాను.’ అని ఒప్పుకున్నాను. ఆయన నవ్వారు. అప్పటికి ఆయనకు 87 ఏళ్లు. ఆ వయసులోనూ కథలు చదువుతున్నారు, నిశితంగా పరిశీలించి, వ్యాఖ్యానిస్తున్నారంటే ఎంతో ముచ్చట వేసింది. ధన్యజీవి. నూరేళ్లు పూర్తి చేసుకుంటారనుకున్నాను. కానీ 97 ఏళ్లకే కాలం చేశారు.

ఆయన ప్రారంభించిన కథానిలయం మాత్రం ట్రస్టు సభ్యుల సహకారంతో, తెలుగు కథలకు చిరునామాగా కొనసాగుతోంది. దాని వెబ్‌సైట్ చూస్తే వాళ్ల కృషికి ఆశ్చర్యపడతాం. ఎన్నేళ్ల క్రితం కథైనా అక్కడ దొరుకుతుంది. దానికి ప్రధానంగా ప్రశంసించవలసినది బెంగుళూరులో నివసించే మన్నం వెంకట రాయుడు అనే ఎలక్ట్రానిక్స్ ఇంజనియర్‌ను. కార్డియాక్ సర్జన్ ఐన తన సోదరుడు ‘పద్మశ్రీ’ గోపీచంద్ (స్టార్ హాస్పటల్స్), యింకో సోదరుడు చంద్రమౌళితో కలిసి తలిదండ్రుల పేర్లు కలిపి ‘మనసు ఫౌండేషన్’ అని పెట్టి, తెలుగు సాహిత్యాన్ని డిజిటలైజ్ చేస్తూ అపూర్వమైన, అమోఘమైన కృషి చేస్తున్నారు. వాళ్లు కారా మేస్టారితో బాటు శ్రీశ్రీ, రావిశాస్త్రి, బీనాదేవి, గురజాడ, పతంజలి, జాషువా, శ్రీపాద, పఠాభి రచనాసర్వస్వాలు ముద్రించి చౌకధరల్లో అందిస్తున్నారు. పాత పత్రికలను డిజిటలైజ్ చేసి భద్రపరుస్తున్నారు. కథానిలయం వెబ్‌సైట్ నిర్వహిస్తున్నారు.

నిర్వాహకులైన రాయుడుగారు, శ్యామ్ నారాయణగారు, మేస్టారి కుమారుడు సుబ్బారావు గారు, వివినమూర్తిగారు, ఎవి రమణమూర్తిగార్లకు మేస్టారి ఆశీస్సులతో బాటు, తెలుగు పాఠకులందరి శుభకామనలు పుష్కలంగా లభిస్తాయి. మహనీయుడైన మా మాస్టారి స్మృతికి నతమస్తకుడనై అంజలి ఘటిస్తున్నాను. (ఫోటోలో కనబడుతున్నవి కథానిలయం, నాతో జరిపిన కరస్పాండెన్స్) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

[email protected]