అల వైకుంఠపురంలో హిందీ రిలీజ్ పట్ల బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేష్ రావల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు ఈ సినిమాను తాము రీమేక్ చేస్తూ ఉంటే, తెలుగు వెర్షన్ ను ఎలా విడుదల చేస్తారంటున్నారు పరేష్. తెలుగులో హిట్టైన ఈ సినిమాను ముందుగా అల్లు అరవింద్ హిందీలో రీమేక్ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు డేవిడ్ ధావన్ ఫ్యామిలీ వద్దకు వెళ్లింది.
సౌత్ సినిమాల హిందీ రీమేక్ విషయంలో డేవిడ్ ధావన్ ది అందె వేసిన చేయి అని వేరే చెప్పనక్కర్లేదు. డేవిడ్ ధావన్ తనయుడు రోహిత్ ధావన్ దర్శకత్వంలో ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ లతో ఈ హిందీ వెర్షన్ రూపొందుతూ ఉంది. పరేష్ రావల్ తాత పాత్రలో కనిపిస్తున్నట్టుగా ఉన్నాడు. మనీషా కొయిరాలా కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉంది.
మరి ఈ సినిమా రీమేక్ పనుల్లో వారుండగా… ఇంతలో అల వైకుంఠపురంలో హిందీ వెర్షన్ ఈ నెల ఇరవై ఆరున విడుదల అని ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమాను ముందుగా యూట్యూబ్, ఓటీటీల్లో విడుదల చేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే.. హిందీ రూపకర్తలు ఆ ప్రయత్నాలను డబ్బుతో ఆపినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా హిందీ డిజిటల్ రైట్స్ ను పొందిన వారు దీన్ని యూట్యూబ్ లో, ఓటీటీలో విడుదల చేయడానికి ప్రయత్నించారు. అయితే ఎనిమిది కోట్ల రూపాయలను చెల్లించి ఆ విడుదలను తాత్కాలికంగా ఆపారట హిందీ రీమేక్ ప్రొడ్యూసర్లు. ఆ ప్రయత్నాలను అలా ఆపినా, ఇంతలో థియేటరికల్ రిలీజ్ ప్రకటన వచ్చింది. దీని పట్ల పరేష్ రావల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఈ ప్రకటన తనకు షాక్ ను ఇచ్చిందంటున్నాడు. తెలుగు వెర్షన్ అనువాదం అయ్యి విడుదల అయితే, తమ సినిమా మార్కెట్ పై ప్రభావం పడుతుందంటూ ఆయన అంటున్నారు. మరి డిజిటల్ రిలీజ్ ను ఆపినట్టుగా, థియేటరికల్ రిలీజ్ ను ఆపడానికీ ప్రయత్నాలు చేస్తారా?