ఏపీ ప్రభుత్వం కరోనాను డీల్ చేయడం గురించి తటస్థులు, కాస్త అవగాహన ఉన్న వారు అభినందిస్తున్న అంశం స్కూళ్లను మూత వేయకపోవడం. ఏపీతో పాటు స్కూళ్లను, కాలేజీలను కరోనా కారణంగా మూత వేయని మరో ప్రభుత్వం కర్ణాటక. కరోనా సెకెండ్ వేవ్, ఫస్ట్ వేవ్ సమయాల్లో కూడా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో కూడా ఈ రెండు ప్రభుత్వాలూ స్కూళ్లను నిరవధికంగా మూత వేయలేదు.
కర్ణాటకలో అయితే కొన్ని పరీక్షలను కూడా నిర్వహించారు. ఏపీలో మాత్రం ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తామంటూ కొందరు గయ్యిమన్నారు. పిల్లలకు పరీక్షలు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో నారా లోకేష్, పవన్ కల్యాణ్ వంటి వాళ్ల పోరాటం అంతా ఇంతా కాదు! టెన్త్, ఇంటర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పెట్టకుండానే పాస్ చేయాలని వీరు డిమాండ్ చేశారు. అప్పట్లో లోకేష్ బాబు పరీక్షలు పెట్టుకుండా పిల్లలను పాస్ చేయించడం లో ఘన విజయం సాధించారు కూడా!
ఇక ఇప్పుడు లోకేషుడు పిల్లలకు స్కూళ్లు వద్దని, సెలవులు ప్రకటించేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం నాలుగు వేల స్థాయిలో కేసులు వస్తున్నాయి రోజువారీగా. పక్క రాష్ట్రాలతో పోల్చినా ఇది తక్కువే. కర్ణాటకలో ముప్పై వేల స్థాయి కేసులు, తమిళనాడులోనూ పదిహేను వేలకు పై స్థాయిలో కేసులు వస్తున్నాయి.
ఏపీలో ప్రస్తుతం కేసుల దృష్ట్యా స్కూళ్లను మూసి వేయాలని అనుకోవడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కేసులు పెరిగే తీరును బట్టి ముందు ముందు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఇక కరోనా అంటూ పిల్లలకు స్కూళ్లను మూసి వేయడాన్ని డబ్ల్యూహెచ్వో మేధావులతో మొదలుపెడితే, సామాజిక వేత్తలు, వైద్య పరిశోధకులు కూడా అభ్యంతరం చెబుతూ ఉన్నారు. కరోనా ఇప్పట్లో పోదు.. కరోనా శాశ్వతంగా ఉంటుంది, కొత్త వేరియెంట్లు వస్తూనే ఉంటాయి… ఇలా అని స్కూళ్లను మూసేసి, లాక్ డౌన్లు పెట్టేయడం ఏ మాత్రం పరిష్కారం కాదని చెబుతూ ఉన్నారు.
మరి ఆ మేధావులు, సామాజికవేత్తలు, వైద్య పరిశోధకులు.. స్కూళ్లను మూయవద్దు అంటుంటే, లోకేష్ మాత్రం స్కూళ్లను మూసి వేయించడానికి, పరీక్షలను రద్దు చేయించడానికి తెగ ప్రయాస పడుతూ ఉన్నారు. మరి ఈ పోరాటాన్ని లోకేష్ ప్రారంభించారు. పవన్ కల్యాణ్ తోడు కావడమే తరువాయి! స్కూళ్లను మూసి వేయడం వల్ల పిల్లల మానసిక పరిస్థితి దెబ్బతినడంతో పాటు, అనేక సామాజిక దుష్పరిణామాలు కూడా ఏర్పడతాయని వారు ఆర్థిక మేధావులతో మొదలుకుని, సామాజిక వేత్తలు, వైద్య పరిశోధకులు కూలంకషంగా వివరిస్తున్నారు. అయితే లోకేష్ వంటి అదేదో విదేశీ వర్సిటీ మేధావి మాత్రం స్కూళ్లను మూయాల్సిందే అని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి స్కూళ్లను మూసి వేయడమే సమస్యకు పరిష్కారమని ఇక పచ్చమీడియా వర్గాలు, టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైనికులు చర్చలు, రచ్చలు చేసి నిరూపించడమే తరువాయి!