Advertisement

Advertisement

indiaclicks

Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ‘యజ్ఞం’ కథ ఓ వార్నింగ్

ఎమ్బీయస్‍: ‘యజ్ఞం’ కథ ఓ వార్నింగ్

రాముడు చెప్తున్నాడు - ‘ఏభై ఏళ్ల క్రితం మా నాన్న నాకు, మా తమ్ముడికి ఐదెకరాల పల్లం, ఏడు ఎకరాల మెట్ట యిచ్చి పోయేడు. ఐదారేళ్ల తర్వాత మేం విడిపోయాం. ఆ పాటికి యిద్దరికీ చెరో వీసెన్నర వెండి, రెండేసి తులాల బంగారం, చిన్న కొంప ఉన్నాయి. మా మాలవాళ్లకి సాధారణంగా మెరక పొలాలు వుండేవి. కొంతమంది భూములు దున్నుకుంటూ, మరి కొంతమంది కూలీ పనికి వెళుతూ వుండేవారు. ఎవరో మరీ లేనివాళ్లు కంబార్లుగా వుండేవారు. (కంబారి అంటే పాలేరు, ఒక్క యజమానిని అంటిపెట్టుకునే వుండాలి. ఇంట్లోనూ, పొలంలోనూ పనిచేస్తూ చేదోడువాదోడుగా వుండాలి. ఎక్కువ కూలీ యిస్తారు కదాని వేరే వాళ్ల దగ్గరకు వెళ్లడానికి లేదు). రైతులంతా వరి, గంటి, చోడి, జొన్న యిలాటి తిండిగింజలే పండించేవారు. అందరికీ తిండుండేది. బట్టలంటారా, కనీసం గోచీలుండేవి. కలిగినవాళ్లయినా పది బట్టలు కట్టేవారు కాదు. ఆడవాళ్లలో ఉన్నవారు బంగారపు నగలు, లేనివాళ్లు వెండి నగలు వేసుకునేవారు.

ఇలాటి పరిస్థితుల్లో వేరుశెనగ, పొగాకు వంటి వర్తకం పంటలు వచ్చాయి. షావుకార్లు వాటి గురించి నచ్చచెపితే పేదవాళ్లు భయపడ్డారు కానీ పెద్ద రైతులు వేసి చూద్దామన్నారు. అంతవరకు రూపాయల చలామణీ పెద్దగా లేదు. ఏవో వుండేవంటే ఉండేవి. ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ దినుసుల్లో సాగేవి. డబ్బు మసలడం మొదలెట్టాక అన్నీ వాటి లెక్కల్లోనే సాగాయి. అవంటే మాలాటివాళ్లకు భయం. సాధ్యమైనంత వరకు దినుసుల్లోనే కానిచ్చేవాళ్లం. వాటిల్లోనూ దగాలుండేవి. ఏ దినుసైనా మేం అమ్మబోతే రూపాయికి ఐదు కుంచాలు. కొనబోతే మూడు కుంచాలు. మేం కొనేటప్పుడు కుంచాలు చిన్నవి, అమ్మేటప్పుడు పెద్దవి. ఇదెక్కడ ధర్మమయ్యా? అంటే వర్తకధర్మం అనేవాడు కోమటయ్య. వర్తకం పంటలు వచ్చాక రూపాయల మాయలు కూడా వచ్చాయి.

సీమ నూలు వచ్చాక ఊళ్లో సాలెవాళ్ల మగ్గాలు మూలపడ్డాయి. తిండికి చాలా కష్టపడేవాళ్లు. వర్తకం పంటలు వచ్చాక వాళ్లలో సగం మంది షావుకార్లు అయిపోయారు. తక్కినవాళ్లు వాళ్ల చుట్టూ తిరుగుతూ చిన్న షావుకార్లయ్యారు. పంట తయారు కాగానే షావుకారు వచ్చి ‘పుట్టి వేరుశెనగ ధర యింతరా, దానిపై తరుగింతరా, కొలత పాత్ర యిదిరా, ఇవన్నీ తీసివేస్తే నీకింత వస్తుంది.’ అనేవాడు. అన్నిటికీ సరే అనేవాళ్లం. అవసరమైతే డబ్బు తీసుకునేవాళ్లం. లేకపోతే మీ దగ్గరే వుంచండి అనేవాళ్లం. ఆ రోజుల్లో రైతులు షావుకార్లకు మదుపు పెట్టేవారు, షావుకార్లు రైతులకు వడ్డీలు చెల్లించేవారు. షావుకార్లు ఎంత తిన్నా రైతులకు కొంత గిట్టుబాటు వుండేది. కాబట్టి ఎంత ఒద్దనుకున్నా రైతులు ఆ పంటలకు ఎగబడ్డారు. తర్వాత్తర్వాత ధరలు పెరిగిపోవడం, పడిపోవడం జరిగేది. పంట దిగుబడి చేతికి రాగానే దాని ధర పడిపోయేది. మరోదాని ధర పెరిగేది. దేని ధర ఎందుకు పెరుగుతుందో ఎవరికీ తెలిసేది కాదు. ఈ ఊపుతాపుల్లో కిందనున్న షావుకార్లు పైకి, పైనున్న రైతులు కిందికి తూగిపోయారు. పదేళ్లు గిర్రున తిరిగేటప్పటికి నాయుళ్ల భార్యల నగలు షావుకార్ల భార్యల మెళ్లో కనబడసాగాయి. షావుకార్లు బరంపురం నుంచి గుంటూరు దాకా తిరగడాలు ఎక్కువయ్యాయి.

ఇక నా కథకు వస్తే, 35 ఏళ్ల క్రితం గోపన్న గారు మెరక పంటల వ్యాపారంలోకి దిగుతూ నీ వేరుశెనగ పంటను నేను కొంటాను అన్నాడు. నేను సరేనన్నాను. అప్పణ్నుంచి ఐదారేళ్లు యిద్దరం పైకి వచ్చాం. తర్వాతేమైందో తెలియదు. ఆ బాబు పైకి వెళుతూనే వున్నాడు, నేను కిందకి జారిపోతూ వచ్చాను. ఆరెకరాలు కరిగిపోయాయి, ఇంట్లో ఆడవాళ్ల నగలు మాయమయ్యాయి. నేనే కాదు, మా పేటలో మూడువంతుల మంది, గొల్లల్లో చాలామంది, కాపుల్లో కొందరు యీ సుడిగుండంలో పడి మునిగిపోయారు. షావుకారు వద్ద అప్పు తీసుకుంటే ఏమౌతుందో తెలిసితెలిసీ రైతు ఆ వలలో పడుతూనే వచ్చాడు. రైతులు మునిగారు, ఆ తర్వాత షావుకార్లూ మునిగారు. పాతికేళ్ల నాడు 60 వేల దాకా వర్తకంలో తిప్పేవాళ్లు పదిపదిహేను మంది ఉండేవాళ్లు. చిన్నచిన్న వర్తకులూ వుండేవారు. ఇప్పుడా డబ్బంతా ఏమైంది?

పన్నులొచ్చాక పొగాకు వర్తకాలు దెబ్బ తిన్నాయి. పడమటివాళ్లు వీళ్లను నంచేసుకున్నారు. వేరుశెనగ, మిరప విషయంలో వీళ్ల కంటె పెద్ద వర్తకులు కొందరు జంక్షన్లలో మిల్లులు పెట్టి వీళ్లను ముంచేశారు. అయితే ఆ మిల్లులు యిప్పుడున్నాయా? వాటి కంటె పెద్ద మిల్లులు వచ్చి వాటిని మింగేశాయి. అవైనా వుంటాయా? వాటిని కూడా మింగేవి యిప్పటికే ఎక్కడో పుట్టి పెరుగుతూ వుంటాయి. వర్తకం జూదం అంటారు. మీరు జూదం ఆడితే గెలవాలి కదా, నన్ను ముంచి, కొన్నాళ్లకు నువ్వు కూడా మునిగిపోతున్నావే! మరి ఎందుకు ఆడుతున్నావ్? శ్రీరాములు నాయుడు బాబూ, నువ్వు వూరుకి వచ్చి మా బతుకులు బాగు చేస్తానన్నావు. హైస్కూలన్నావు, కో-ఆపరేటివ్ గొడౌన్లన్నావు, నూతులన్నావు. మేం శ్రమదానం చేశాం. కొంతమందికి కూలి దొరికింది కూడా! కొంతకాలానికి కొత్త పనులు తేలేకపోయావు, కూలీ పోయింది.

నువ్వు రోడ్లు వేయించావు, దాని మీద జీపులు, లారీలు తిరుగుతున్నాయి. మా బళ్ల బేరాలన్నీ పోయాయి. గతంలో 25,30 కుటుంబాలు బళ్ల బేరాల మీదే బతికేవి. కరంటు తెచ్చి పంపింగు మెషిన్లు పెట్టించావు. ఏతాలు తోడే మా కూలివాళ్ల నోట్లో మట్టిపడింది. రైసు మిల్లు వచ్చింది. కలిగినవాళ్ల యిళ్లల్లో కూలికి దంచే జనానికి గింజ పుట్టడం మానేసింది. రైసు మిల్లాయన నువ్వు చేసే పనుల కోసం ఇరవై ఎకరాలు పుణ్యానికి యిచ్చాడు. దేవుడు మెచ్చి ఆయన చేత రైసు మిల్లు పెట్టించాడు. డబ్బు వచ్చిపడుతోంది. అలాగే యింకో ఆయన స్కూలు కోసం దానంగా భూములిచ్చాడు. స్కూలు వచ్చాక చుట్టూ ఉన్న భూముల రేట్లు పెరిగి, స్థలాలు అమ్మితే నష్టం పూడి, లాభాలు వచ్చిపడ్డాయి. మరి నీ మంచిపనులకు మేమూ శ్రమను దానంగా యిచ్చాం. మరి దేవుడు మాకేమీ యివ్వలేదే! ఉన్న కూలి ఊడగొట్టేడే!

గతంలో అయితే యింత కూలీ కావాలని గట్టిగా అడగగలిగే వాళ్లం. ఆ పప్పులుడకకుండా మిషిన్లు తెచ్చారు. దానికోసం కరంటు, రోడ్లు తెచ్చుకున్నారు. చదువుకున్న కూలివాళ్లు కావాలని స్కూలు పెట్టించారు. రేపుపొద్దున్న దున్నడానికి, ఊడవడానికి, కోతలకు కూడా మిషన్లు వచ్చాక మా అవసరమే లేకుండా పోతుంది. ఇవన్నీ నువ్వు ముందే ఊహించి చేశావనటం లేదు. నువ్వు పుణ్యం అనుకుంటూ మొదలుపెట్టిన యజ్ఞం పాపంలో దింపింది. దిగాక తెలిసీ తెలియక అందరం కూరుకుపోతున్నాం. గోపన్న గారి సంగతికి వస్తే, ఈ 35 ఏళ్లలో యిచ్చిపుచ్చుకోవడాల్లో, వడ్డీలెక్కల్లో షావుకారి సొమ్ము నేను తిన్నానో, నా సొమ్ము ఆయనే తిన్నాడో యీనాటికి అప్పంటూ యిది తేలింది. నిన్న రాత్రి నేను నా కొడుకులతో యిదంతా మాట్లాడి భూమి అమ్మకతప్పదురా అన్నాను.

అప్పుడు నా నాలుగో కొడుకు సీతారాముడు ‘నువ్వూ, ఊళ్లో పెద్దలూ అంతా మంచివాళ్లే కావచ్చు, చెడు చేసినా మంచి ఉద్దేశంతోనే చేసి వుండవచ్చు. ‘ఉన్న కాసింత భూమి అమ్మి, బతుకు గడవడానికి కంబారిగా మారిపో’ అని చెప్పడం కూడా నా మేలు కోరే కావచ్చు. కానీ నేను భూమి అమ్మడానికి ఒప్పుకోను. షావుకారి అప్పు నేను కాదనను. ఎప్పటికైనా తప్పకుండా తీరుస్తాను. చచ్చినంత కాలం చాకిరీ చేయమన్నా చేస్తాను. కానీ భూమి అమ్మడానికి ఒప్పుకోవడమనేది నా బొందిలో ప్రాణం వుండగా జరగదు. నేను సంతకం పెట్టను.’ అన్నాడు. అప్పుడు నేను ‘రేపు నేను పంచాయితీలో యిదంతా చెప్తాను. అంతా విని శ్రీరాములు బాబు ఏం చెప్తాడో అదే చేస్తాను.’ అని చెప్పాను.’’ – అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.

అంతా విని శ్రీరాములు దీర్ఘాలోచనలో పడ్డాడు. అది చూసి ఆశ వదులుకున్న రాముడు కాగితం మీద వేలు ముద్ర వేశాడు. తర్వాత కొడుకుల్నీ, మనవల్నీ వేయమన్నాడు. అందరూ వేస్తున్నారు. సీతారాముడి వంతు వచ్చేసరికి అతను గిర్రున వెనక్కి తిరిగి పారిపోయాడు. దాంతో యిప్పటిదాకా రాముడి ఉపన్యాసాన్ని అసహనంగా వింటూ వున్న నాయుళ్లు కొందరికి కోపాలు వచ్చాయి. ఇంత పొగరా అనుకుంటూ బలమైన చేపాటి కర్రలు పట్టుకుని సీతారాముణ్ని లాక్కుని రావడానికి బయలుదేరారు. వాళ్లను చూసి మాలలు కొందరు ‘తొందరపడకండి, బాబూ’ అన్నారు. శ్రీరాములు లేచి ‘ఆగండి, ఆగండి’ అన్నాడు. ఇంతలో సీతారాముడు తిరిగివచ్చాడు, భుజం మీద గోనెమూటతో! వచ్చి తండ్రితో ‘సంతకం పెట్టవద్దని నేను చెప్పినా పెట్టావు, నా కొడుకు నా మాట ఎలా దాటతాడనుకున్నావ్. నాకూ కొడుకున్నాడు. నాకూ వాడి మీద హక్కుంది. చూసుకో.’ అంటూ గోనెబస్తా దులిపాడు.

దానిలోంచి ఒక తలా, చిన్న దేహం నేలమీద రాలాయి. అందరూ నిర్ఘాంతపోయారు. సీతారాముడు తండ్రిని చూసి ‘నేనెంతో చెప్పాను. సంతకం పెడితే నేను ఛస్తాను, నిన్ను చంపుతాను అన్నాను. అయినా నువ్వు వినలేదు. నీకు జనం మెప్పు కావాలి. ధర్మం తప్పడన్న పేరు కావాలి. మమ్మల్ని చచ్చేదాకా బానిస బతుకు బతకమన్నావు. నీకు తెలివిడి లేనప్పుడు సరే, యిప్పుడు అన్నీ తెలిశాక కూడా ఆ మాటే అనడం నాకిష్టం లేదు. నా కొడుకు మీద నాకు ఆశ ఎక్కువ. నా కొడుకు బానిస బతుకు బతకడు. నా కొడుకు కంబారి కాడు. అందుకే వాడి దగ్గరకు వెళ్లి ఒరే బానిస బతుకు బతుకుతావా, నా చేతిలో చస్తావా అన్నాను. వాడు పరిగెట్టుకుని వచ్చాడు. చటుక్కున నరికేశాను. నువ్వూ తండ్రివే, నేనూ తండ్రినే ఎవరు గొప్పో నువ్వే చెప్పు.’ అని అడిగాడు.

ఆ బీభత్సం చూసి జనాలు కకాపికలవుతూంటే ‘బాబూ జడిసిపోకండి, జనం మీద చెయ్యెత్తగల మనిషినైతే కన్నబిడ్డను చంపుకుంటానా?’ అన్నాడు. ఆ తర్వాత కర్రలు పట్టుకున్నవాళ్ల కేసి చూసి ‘బాబూ, తొందరపడకండి. నేను ఉరికి సిద్ధం. నన్ను కొడితే మీరు ఉరిలో పడతారు. మీ బిడ్డల ఉసురు నాకేల తగలాలి?’ అన్నాడు. తర్వాత శ్రీరాములు కేసి తిరిగి ‘నువ్వు వట్టి వెర్రివాడివి. లోకమంతా నువ్వు చెప్పినట్లు నడవాలని నీ మనసులో ఉద్దేశం. ఈ రాజ్యాన్ని, నిన్నూ ఏలే దొరలెవరో నీకు తెలియదు. వాళ్లకి కావలసిన మంచిని చేస్తున్నంతకాలమే నీకు మర్యాద. ఆ తర్వాత నువ్వెవరో, వాళ్లెవరో. ధర్మపన్నాలెంత వరకూ? నువ్వు చెప్పినట్లు వినేవరకూ..’ అన్నాడు. ఇంతటితో కథ ముగిసిపోయింది.

అందరికీ అర్థం కావాలని, ఉత్తరాంధ్ర యాస లేకుండా రాశాను. కథ యిదే వరుసలో వుండదు. ఒక్కొక్కళ్ల వైపు నుంచి చెప్పుకుంటూ వస్తుంది. పాత్రల తీరుతెన్నుల గురించి వర్ణనలుంటాయి. పెద్ద కథను క్లుప్తంగా చెప్పడంలో అందం చెడిపోయి వుంటుంది. వీలైతే ఒరిజినల్ చదవండి. నిద్ర పట్టదు. 57 ఏళ్ల క్రితం రాసిన కథ యిది. అప్పటికంటె యిప్పుడు పరిస్థితి మరీ అధ్వాన్నమై పోయింది. పల్లెలు మరింత నాశనమయ్యాయి. పనుల కోసం నగరాలకు, యితర రాష్ట్రాలకు వలసలు పెరిగిపోయాయి. గతంలో రైతుల ఆత్మహత్యలుండేవి కావు. ఇప్పుడు అవీ జరుగుతున్నాయి. తెలంగాణ రైతుల సంగతే చూడండి, ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది, వరి ఉత్పత్తిని పెంచమంది, పంట చేతికి వచ్చినదాకా వుండి, మేం కొనం అంటోంది. కేంద్రం మాట తప్పిందా, రాష్ట్రం తప్పిందా యిది రైతుకి ఎందుకు? నాకు ఎకరాకు కోటి రూపాయలు వస్తోంది అన్నారు కెసియార్ ఓ ట్రాక్టరు ఎక్కి, టోపీ పెట్టుకుని తీయించుకున్న ఫోటోతో! ఇప్పుడు కిలో కూడా కొనం అంటున్నారు. ఫలానా పంట వేయండి, ఫలానాది వేయకండి అని గైడెన్స్ యివ్వాలిగా! ఇచ్చారా?

కేంద్రం సాగుబిల్లుల పేర వ్యవసాయాన్ని కార్పోరేట్లకు అప్పగించేద్దామని చూసింది. బిహార్‌లో యీ ప్రయోగం సఫలం కాలేదని తెలిసినా ముందుకు వెళ్లింది. ఎన్నికలయ్యాక పేరు మార్చి మళ్లీ తేవచ్చు. ఈ కథలో రైతే కాదు, వ్యాపారి కూడా బాధితుడే. మన కళ్లతో చూశాం, ఇద్దరు, ముగ్గురు కలిసి పెట్టే సూపర్ మార్కెట్లు వచ్చేసరికి చిన్న చిన్న కిరాణా కొట్లు మూతపడి, వాళ్లు రోడ్డున పడ్డారు. తర్వాత సూపర్ మార్కెట్ చైన్‌లు వచ్చాయి. ఒక బ్రాండ్ వాడు, బాగా నడిచే సూపర్ బజార్లను కొనేయడం మొదలుపెట్టాడు. హైపర్ మార్కెట్ అంటూ మరొకడు వచ్చి వాడిని కొనేశాడు. మళ్లీ ఆ బ్రాండ్‌ను యింకోడు..! హైదరాబాదులోనే గత 30 ఏళ్లలో ఎన్నో సూపర్ మార్కెట్లు వచ్చాయి, కనుమరుగయ్యాయి. ఇప్పుడ ఫ్యూచర్ గ్రూపు చేతులు మారుతోంది. దేశీయ దిగ్గజం రిలయన్సుకి, విదేశీ దిగ్గజం అమెజాన్‌కు మధ్య పోరు నడుస్తోంది. మధ్యలో ఆన్‌లైన్ బిజినెస్ అన్నిటినీ దెబ్బ కొడుతోంది.

ఈ అల్లకల్లోలపు పరిస్థితిలో ఎన్నో సంస్థలు మూతపడుతున్నాయి. ఎంతోమంది ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోతున్నారు. రైతులు కూలీలవుతూంటే, వ్యాపారస్తులు ఉద్యోగులవుతున్నారు. అదుపులేని మెకనైజేషన్‌తో ఆ ఉద్యోగాలూ ఊడుతున్నాయి. కొత్త ఉద్యోగాలకు అనువుగా తమ టేలెంటును మలుచుకోవడం కొంతమంది చేతనౌతోంది, కొందరికి కావటం లేదు. పాఠకులలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొందరు ఒక మాల రైతుతో ఐడెంటిఫై చేసుకోలేక ‘ఇదెక్కడి సొద’ అని విసుక్కోవచ్చు. కానీ యిలా ఆలోచించి చూడండి, మీరు ఐటీలో చేరిన కొత్తల్లో 8 గంటలు, 10 గంటలు కష్టపడి పని చేసి కంపెనీని వృద్ధి చేశారు. యజమాని దాన్ని వేరేవాళ్లకు మంచి లాభానికి అమ్మేశాడు. కొత్త యజమాని అప్పటికే వున్న తన కంపెనీతో దీన్ని మెర్జ్ చేసినపుడు మీ ఉద్యోగాలు దండగనుకుంటే ఉద్యోగం పోతుందనే భయంతో మీరు రోజుకి 12 గంటలు పనిచేసి లాభాలు మరింత పెంచారు. ఉద్యోగం నిలిచింది.

కంపెనీ బ్రాండ్ యిమేజి పెరగడంతో మరో రెండేళ్లకు కొత్త యజమాని ఎంఎన్‌సికి అమ్మేశాడు. వాళ్లకు యిప్పటికే యితర దేశాల్లో యిలాటి వింగ్స్ వున్నాయి. కాస్ట్ కటింగ్ అంటూ మీ వింగ్ మూసేశారు. మిమ్మల్ని వేరే ప్లాట్‌ఫాంపై వర్క్ చేయమన్నారు. అక్కడ సరిగ్గా రిజల్ట్ చూపలేదని జీతం తగ్గించారు, బోనస్ అపేశారు, కర్మకాలితే మీ ఉద్యోగం పీకేశారు. గతంలో కంటె మీకు పని గంటలు పెరిగాయి. కుటుంబ జీవితాన్ని, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కంపెనీ అభివృద్ధికి కష్టపడ్డారు. కానీ మీకు ఉద్యోగం వుంటుందో లేదో అన్న నిరంతర ఆందోళనే మిగిలింది. కంపెనీ అభివృద్ధి చెంది మీ యజమానికి లాభం కలుగుతోంది. కానీ మీకు దాని ఫలాలు దక్కలేదు. అదీ కొంతకాలమే. ఒక స్థాయికి రాగానే మరో పెద్ద తిమింగలం అతన్ని బెదిరించో, భాగస్వాములను భ్రమపెట్టో కంపెనీ అతని దగ్గర నుంచి లాక్కుంటుంది. ఆ పనిలో సాయపడినవారికి కన్సల్టేషన్ పేరుతో భారీగా డబ్బు ముడుతుంది. నిరంతరం త్రిశంకు స్వర్గంలో వేలాడడంతో మీకు అల్సర్లు, బిపి మిగులుతాయి.  

గత 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ధనిక, పేద వ్యత్యాసం విపరీతంగా పెరిగిందట. మన దేశంలో ఆ తేడా మరీ ఘోరంగా వుందట. కరోనా వంటి మహమ్మారి ఆ తేడాను మరింత పెంచింది తప్ప, అందర్నీ లెవెల్ చేయలేదు. అసమానతలు పెంచే మన ఆర్థికవిధానాలు, ప్రణాళికలు మారాలని, అభివృద్ధి ఫలాలు అందరికే చేరే ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్ మనకు లక్ష్యం కావాలని యిది అన్యాపదేశంగా చెపుతుంది. దీన్ని ఒక ఆర్థికవేత్త వ్యాసంలా రాయకుండా, కథలా చెప్పడంలోనే కా.రా. గారి నేర్పు వుంది. చివరిలో గగుర్పాటు కలిగించి మర్చిపోకుండా చేసేశారు. వీలైతే చదవండి. ఈ ఒక్క కథతో కారా మాస్టారు తెలుగు కథకుల్లో విశిష్టస్థానం సంపాదించుకున్నారు. ఆయన వ్యక్తిత్వం గురించి, నాకు ఆయనతో వున్న అనుబంధం గురించి యింకో వ్యాసంలో రాస్తాను. (సమాప్తం) (ఫోటో - ధాన్యం సేకరణ కేంద్రం వద్ద ధాన్యం పోరబోసిన రైతులు, ఇన్‌సెట్ పింక్‌స్లిప్ బాధితుడు)

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?