ఒంగోలులో మంత్రి బాలినేని, సోమిశెట్టి సుబ్బారావు అనే కార్యకర్తపై దాడి చేయించారని ఆయన వైశ్య వర్గానికి చెందినవారని, వైశ్యులు వైసీపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారంటూ.. కుల చిచ్చు పెట్టాలని చూసింది టీడీపీ అనుకూల మీడియా. అయితే సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా సుబ్బారావు క్లారిటీ ఇవ్వడంతో ఈ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పడింది. గోతికాడ నక్కలకి అవకాశం మరోసారి మిస్ అయింది.
కేక్ కట్ చేసిన సుబ్బారావు..
సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా సోమిశెట్టి సుబ్బారావు గుప్తా విజయవాడ వెళ్లి మంత్రి బాలినేనిని కలిశారు. జగన్ పుట్టినరోజు కేక్ ని సుబ్బారావు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆ ఎపిసోడ్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ బాగు కోసమే తాను బాలినేని పుట్టినరోజు వేడుకల్లో అలా మాట్లాడానని, తాను మొదటి నుంచీ బాలినేని అనుచరుడినేనని చెప్పారు.
ఇప్పటికీ బాలినేనితో పాటే ఉంటానన్నారు. తన వ్యాఖ్యల వెనక ఎవరూ లేరని, తనపై మంత్రి దాడి చేయించారనడం అసత్యం అని వివరణ ఇచ్చారు.
సుభానీ ఓవర్ యాక్షన్..
సుబ్బారావు అనే వ్యక్తి కాస్త నోరు జారారు, అయితే అది బాలినేని పుట్టినరోజు వేడుక కావడం, సుబ్బారావు విమర్శలు చేసింది స్వయానా వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేపై కావడం కాస్త వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో సుబ్బారావుని మందలించడానికి బయలుదేరిన సుభానీ అనే వ్యక్తి అతడిని కొడుతూ వీడియో తీయడం సంచలనంగా మారింది. సారీ చెప్పించే క్రమంలో మరీ సినిమా స్టైల్లో ఓవర్ యాక్షన్ చేయడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో మంత్రి పేరు వాడటం మరింత సంచలనం అయింది.
దీంతో బాలినేని రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాను దాడి చేయించలేదని, అసలు అలాంటి పనులు చేయించే మనస్తత్వం తనకు లేదన్నారు బాలినేని. ఇంతలోనే సుబ్బారావు విజయవాడలో ప్రత్యక్షం కావడంతో వివాదం సద్దుమణిగింది. సుభానీ అనే వ్యక్తి ఓవర్ యాక్షన్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చారు సుబ్బారావు.
వైసీపీలో అందరూ కలసిపోవడం సంతోషకరమైన అంశమే అయినా.. ఈ ఎపిసోడ్ లో రాజకీయ లబ్ధి పొందాలనుకున్న టీడీపీకి మాత్రం షాక్ తగిలింది. టీడీపీ అనుకూల మీడియా కూడా దీన్ని వైశ్యులపై జరిగిన దాడిగా చిత్రీకరించాలని విఫలయత్నం చేసింది. చివరకు సుబ్బారావే.. బాలినేని వైపు వెళ్లడంతో ఇక సైలెంట్ అవడం తప్ప చేసేదేం లేదని అనుకుంటున్నారు టీడీపీ వర్గీయులు.