ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్‌లతోనే పీడ విరగడ అయ్యిందని సంతోషించిన వాళ్లకి నిరాశే ఎదురైంది. వదల బొమ్మాళి.. నిన్ను వదల అని సినిమా డైలాగ్ చెప్పినట్టు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వెంటాడుతోంది. ఒకవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నా…మన వరకూ రాదులే అనే నిర్లక్ష్యమే మన కొంప ముంచుతోంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో 4 వేలకు కొత్త కేసులు నమోదయ్యాయి. గత నాలుగైదు రోజులుగా 4 వేలకు ఏ మాత్రం కేసులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యారోగ్యశాఖ తాజా నివేదికల ప్రకారం గడిచిన 24 గంటల్లో 22,882 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 4,108 పాజిటివ్ కేసులొచ్చాయి.
ఇందులో కేవలం రెండు జిల్లాల్లోనే కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరులో 1,004, విశాఖపట్నం జిల్లాలో 1,018 కేసులు నమోదయ్యాయి. వెస్ట్‌గోదావరి జిల్లాలో అత్యల్పంగా 46 కేసులు నమోదు కావడం సంతోషించదగ్గ విషయం.
అలాగే గతంలో కరోనా కల్లోలం సృష్టించిన కర్నూలు జిల్లాలో తాజాగా 85 కేసులు రావడం మంచి పరిణామమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టిస్తుందోననే ఆందోళన మాత్రం ఉంది.