ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీలో పయనించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలనే జగన్ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం కావడం, న్యాయస్థానం మెట్లు ఎక్కడం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగిన దృష్ట్యా , దాన్ని పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టాలనే నిర్ణయం రాజకీయ రంగు పులుముకుంది.
ఈ సందర్భంగా ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకించిన పవన్‌కల్యాణ్, చంద్రబాబునాయుడితో పాటు ఉపరాష్ట్రపతి పిల్లలు ఏ మాధ్యమంలో చదువుకుంటున్నారో, చదువుకున్నారో చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా ప్రశ్నించారు. మరికొందరు వితండ వాదనను కూడా తెరపైకి తేవడం చూశాం. ఆంగ్ల మాధ్యమం అమలుతో ఏపీలో క్రిస్టియానిటీకి జగన్ శ్రీకారం చుట్టారనే పొంతన లేని, అభ్యంతరకర వాదనను కూడా తెరపైకి తెచ్చిన దుర్మార్గులున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించుకోవడంతో మరోసారి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియంతో పాటు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం తీసుకురావాలని కూడా కేబినెట్ తీర్మానించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ఆంగ్ల మాధ్యమం అమలుకు వచ్చిన అడ్డంకులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.