రాజ‌ధానిలో ప‌వ‌న్‌కు 62 ఎక‌రాల భూమి?

“అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు రాజ‌ధాని మార్చాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెనుక పెద్ద కుట్ర ఉంది. కేవ‌లం వైసీపీ నేత‌లు భూదందా చేసేందుకే రాజ‌ధాని మార్చాల‌నుకుంటున్నారు” అని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నాడు.…

“అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు రాజ‌ధాని మార్చాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెనుక పెద్ద కుట్ర ఉంది. కేవ‌లం వైసీపీ నేత‌లు భూదందా చేసేందుకే రాజ‌ధాని మార్చాల‌నుకుంటున్నారు” అని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. ఢిల్లీలో బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను గురువారం క‌లిసిన త‌ర్వాత విలేక‌రుల‌తో మాట్లాడిన ప‌వ‌న్ అక్క‌డ కూడా ఇవే ఆరోప‌ణ‌లు చేశాడు. వైసీపీ భూదందాల‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్న ప‌వ‌న్‌కు రాజ‌ధాని అమ‌రావ‌తిలో 62 ఎక‌రాలు, ఆయ‌న మాతృమూర్తి అంజ‌నాదేవి పేరుపై 20 ఎక‌రాల‌ భూమి ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. కేవ‌లం ఆరోప‌ణ‌లే కాదు…ఆధారాలు కూడా చూపుతున్నారు.

ఒక చాన‌ల్‌లో జ‌రిగిన డిబేట్‌లో వైసీపీ అధికార ప్ర‌తినిధి ర‌విచంద్రారెడ్డి ఈ సంచల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పాటు ఆధారాల‌ను కూడా లైవ్‌లో చూపి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ర‌విచంద్రారెడ్డి చెప్పిన ప్ర‌కారం 2018, ఏప్రిల్ 13న కొణిదెల ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరుపై రాజుల‌పాలెం, లింగాయ‌పాలెంల‌లో స‌ర్వే నంబ‌ర్ 64 బీ, 67బీ, 83బీ, మంద‌డం ద‌గ్గ‌ర 131 ఎ, 139ఎలో 62 ఎక‌రాలు కొన్న‌ట్టు డాక్యుమెంట్స్ నంబ‌ర్ల‌తో స‌హా చూపుతూ ఆరోప‌ణ‌లు చేశాడు. ఈ భూమి విలువ రూ.2 కోట్ల 40 ల‌క్ష‌ల 46వేలు. అని పేర్కొన్నాడు.

అలాగే ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌ల్లి అంజ‌నాదేవి పేరుపై 2018, ఆగ‌స్టు 28న 20 ఎక‌రాలు కొన్న‌ట్టు చెప్పాడు. ఈ భూమి విలువ రూ.1కోటి 80 ల‌క్ష‌ల 20 వేలు. ఈ వివ‌రాలు వెల్ల‌డిస్తున్న‌ప్పుడు “నిజ‌మైన డాక్యుమెంట్సే” క‌దా అని యాంక‌ర్ స‌తీష్ ప్ర‌శ్నించ‌గా, “అన్ని ఆధారాలు పంపుతా… చూసుకోండి” అని ర‌విచంద్రారెడ్డి సూచించాడు. ఇంకా ఎక్క‌డెక్క‌డ భూములున్నాయో స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు అత‌ను వెల్ల‌డించాడు.
 
 అమ‌రావ‌తే రాజ‌ధాని అని  ప‌దేప‌దే ప్ర‌క‌టిస్తున్న ప‌వ‌న్‌కు ఆ ప్రాంతంపై ప్రేమ‌తో చెప్ప‌డం లేద‌ని ర‌విచంద్రారెడ్డి చెప్పాడు. కేవ‌లం త‌న భూముల‌పై మాత్ర‌మే ప‌వ‌న్‌కు ప్రేమ ఉంద‌ని తేల్చి చెప్పాడు.  ప‌వ‌న్ భూములు కొనింది నిజ‌మే అయితే ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ కిందికి రావు. కాక‌పోతే అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని పోరాటానికి దిగాల‌నుకుంటున్న ప‌వ‌న్ నిజాయితీని శంకించాల్సి వ‌స్తుంది.

అంతేకాదు  ప‌వ‌న్ పోరాటానికి పెద్ద విలువ ఉండ‌దు. వైసీపీ ఆరోప‌ణ‌లే నిజ‌మైతే ప‌వ‌న్‌కు క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టే. ఎందుకంటే ఇంత‌కాలం వైసీపీ నేత‌లు విశాఖ‌లో భూములు కొన్నార‌ని ఆరోపిస్తున్న ప‌వ‌న్‌…త‌న భూముల‌పై స‌మాధానం చెప్పుకోవాల్సి వ‌స్తుంది. కాగా ప‌వ‌న్‌పై వైసీపీ ఆరోప‌ణ‌లు, భూముల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి.