పాత గాయాన్ని మళ్లీ రేపుతున్న ఓటీటీ సంస్థ

థియేటర్లలో ఓ సినిమా ఫ్లాప్ అయితే, ఆ ప్రభావం అక్కడితో ఆగడం లేదు. ఫ్లాప్ అయినప్పుడు జరిగిన ట్రోలింగ్ ఒకలా ఉంటే, సదరు సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ట్రోలింగ్ నెక్ట్స్ లెవెల్ లో…

థియేటర్లలో ఓ సినిమా ఫ్లాప్ అయితే, ఆ ప్రభావం అక్కడితో ఆగడం లేదు. ఫ్లాప్ అయినప్పుడు జరిగిన ట్రోలింగ్ ఒకలా ఉంటే, సదరు సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ట్రోలింగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటోంది. స్క్రీన్ షాట్స్ కట్ చేసి మరీ మరోసారి మేకర్స్ ను ఆటాడుకుంటున్న రోజులివి. ఇలాంటి టైమ్ లో ఓ పాత గాయాన్ని మళ్లీ రేపుతోంది ఓ ఓటీటీ సంస్థ.

అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా చేసిన గాయాన్ని అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు మరిచిపోలేరు. ఏప్రిల్ లో రిలీజైన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నెలకొన్న వివాదాల సంగతి, అనీల్ సుంకర వేసిన ట్వీట్ల సంగతి అందరికీ తెలిసిందే.

మొత్తానికి ఏజెంట్ హంగామా, ఆ ప్రహసనం ముగిందని అంతా అనుకున్న టైమ్ లో మరోసారి ఈ సినిమా తెరపైకొచ్చింది. ఈనెల 29న ఏజెంట్ సినిమాను స్ట్రీమింగ్ కు పెడుతున్నట్టు ఓ ఓటీటీ సంస్థ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి ఏజెంట్ పై ట్రోలింగ్ మొదలైంది.

ఏజెంట్ సినిమా మూలంగా దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో అఖిల్, నిర్మాత అనీల్ సుంకర.. ఎన్నో ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు. ఇప్పుడీ ఓటీటీ స్ట్రీమింగ్ తో మరోసారి వీళ్ల ముగ్గురూ నెటిజన్లకు టార్గెట్ కాబోతున్నారు. ఇది ఫిక్స్.

ఏజెంట్ సినిమాపై విడుదలకు ముందు చాలా హోప్స్ పెట్టుకున్నాడు అఖిల్. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు హైదరాబాద్ లోని ఓ థియేటర్ కు పొద్దున్నే వచ్చాడు. అయితే ఇంటర్వెల్ కే అతడు థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ వెంటనే సినిమా రిజల్ట్ ఏంటనేది తేలిపోయింది. జనం ఈ సినిమాను ఓ రేంజ్ లో విమర్శించారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ఏజెంట్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి తప్పు చేశామని స్వయంగా నిర్మాత అనీల్ సుంకర ప్రకటించడంతో కామెంట్స్ మరిన్ని పెరిగాయి.

అలా కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్ గా నడిచిన ఏజెంట్ సినిమా, ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమారు రీ-ఎడిట్ చేసి, కొత్త వెర్షన్ ను ఓటీటీలోకి తీసుకురావడం కోసమే టైమ్ తీసుకున్నట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అవి నిజమా కాదా అనే విషయం 29న తేలిపోతుంది.