తెలంగాణలో మరోసారి కర్ఫ్యూ..?

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు ఇప్పటివరకూ ఏపీ కఠినంగా అమలు చేసింది. స్కూళ్లకు సెలవలు ఇచ్చే విషయంలో కానీ, నైట్ కర్ఫ్యూ అమలులో కానీ సెకండ్ వేవ్ వరకు ఏపీ ముందంజలో ఉంది. కానీ…

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు ఇప్పటివరకూ ఏపీ కఠినంగా అమలు చేసింది. స్కూళ్లకు సెలవలు ఇచ్చే విషయంలో కానీ, నైట్ కర్ఫ్యూ అమలులో కానీ సెకండ్ వేవ్ వరకు ఏపీ ముందంజలో ఉంది. కానీ థర్డ్ వేవ్ సమయానికి తెలంగాణ బాగా అలర్ట్ అయింది. ఏపీలో స్కూళ్లన్నీ యథావిధిగా తెరుస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం నెలాఖరు వరకు ఆన్ లైన్ క్లాసులు అని చెప్పేసింది. 

తాజాగా.. నైట్ కర్ఫ్యూ విషయంలో కూడా తెలంగాణ ఓ అడుగు ముందుకేసింది. ఏపీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ మొదలు కాబోతుండగా.. తెలంగాణలో మాత్రం ఈరోజు నుంచే నైట్ కర్ఫ్యూకి రంగం సిద్ధమవుతోంది. ఈరోజు జరగబోయే మంత్రి మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు.

టైమింగ్స్ తెలిస్తే షాకే..

సహజంగా నైట్ కర్ఫ్యూని రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు లేదా, 6 గంటల వరకు కొనసాగిస్తుంటారు. అలాంటిది తెలంగాణలో రాత్రి 9 తర్వాత నైట్ కర్ఫ్యూ పెట్టడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారట. సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర పడితే ఈరోజు రాత్రి 9 తర్వాత తెలంగాణలో అంతా బంద్.

తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ పోచారం సహా.. చాలామంది ఎమ్మెల్యేలు, నాయకులు కరోనాబారిన పడ్డారు. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, ఇతర దేశాల నుంచి రాకపోకలు యథావిధిగా కొనసాగుతుండటంతో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని నైట్ కర్ఫ్యూకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు చెబుతున్నారు.

గతంలో డిసెంబర్ 31 రాత్రి కూడా ఆంక్షలు అమలు చేయాలనుకుంది ప్రభుత్వం. అయితే హడావిడిగా ఆంక్షలన్నీ ఎత్తేయడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కానీ, అదే సమయంలో ఆరోపణలు కూడా ఎక్కువయ్యాయి. ఇక సంక్రాంతికి కూడా పెద్దగా ఆంక్షలేవీ లేకుండానే సరిపెట్టింది. ఇప్పుడిక పండగ సీజన్ పూర్తి కావడంతో తెలంగాణ సర్కారు కఠిన ఆంక్షలు తెరపైకి తెస్తోంది. ఇందులో భాగంగానే నైట్ కర్ఫ్యూ కోసం కసరత్తులు జరుగుతున్నాయి.

అదే జరిగితే పరిశ్రమకు పెద్ద దెబ్బ

ప్రస్తుతం వినిపిస్తున్నట్టు రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ పెడితే, టాలీవుడ్ కు అది పెద్ద దెబ్బ. రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటిగ్గా సెకండ్ షోలు రద్దయిపోతాయి. ఇప్పటికే ఏపీలో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చూసీచూడనట్టు వదిలేస్తున్నప్పటికీ.. అనిశ్చితి మాత్రం కొనసాగుతోంది. 

ఇలాంటి టైమ్ లో తెలంగాణలో కర్ఫ్యూ పెడితే.. ఆ ప్రభావం సినిమాలపై మరింత పడుతుంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతున్న బంగార్రాజు వసూళ్లపై కర్ఫ్యూ ప్రభావం గట్టిగా పడనుంది.