విమర్శలపై ‘ఉ..ఊ’ అంటున్న సంగీత దర్శకుడు

'ఊ అంటారా మావ.. ఉఊ అంటావా' అంటూ సమంతపై తీసిన ఐటెంసాంగ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మగవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొంతమంది ఈ పాటపై విమర్శలు చేశారు. ఓ రాజకీయ నాయకుడైతే, భక్తిపాట సాహిత్యాన్ని…

'ఊ అంటారా మావ.. ఉఊ అంటావా' అంటూ సమంతపై తీసిన ఐటెంసాంగ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మగవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొంతమంది ఈ పాటపై విమర్శలు చేశారు. ఓ రాజకీయ నాయకుడైతే, భక్తిపాట సాహిత్యాన్ని ఇలా రక్తిపాట కింద మార్చేశారని, ఐటెంసాంగ్ కోసం వాడేశారంటూ విమర్శలు చేశారు.

ఎట్టకేలకు ఈ విమర్శలపై స్పందించాడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. పురుషుల్ని అసభ్యంగా చిత్రీకరించే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టంచేసిన డీఎస్పీ.. పైపెచ్చు ఆ ఐటెంసాంగ్ తో సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చాం అంటున్నాడు.

“చంద్రబోస్, సుకుమార్ కలిసి ఈ సాహిత్యంతో నా దగ్గరకొచ్చారు. ఇలాంటి విమర్శలు వస్తాయని మేం అప్పుడే ఊహించాం. కానీ మేం నిజాయితీగా పనిచేశాం. ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయాలనేది మా ఉద్దేశం కాదు. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితుల్ని చెప్పాలనుకున్నాం, అదే చెప్పాం. అంతే తప్ప మగాళ్లంతా ఇంతే అంటూ జనరలైజ్ చేసి చెప్పడం మా ఉద్దేశం కాదు.”

ఇలా తన పాటను సమర్థించుకున్నాడు దేవిశ్రీప్రసాద్. చిత్రపరిశ్రమలో ఎన్నో పాటల్లో మహిళల్ని అసభ్యంగా చూపించారని, ఎన్నో పాటల్లో మహిళల్ని కించపరిచేలా సాహిత్యం ఉందని… అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్నాడు దేవిశ్రీ. 

చాలామంది లేడీ ఫ్రెండ్స్, మహిళా జర్నలిస్టులు, లెక్చరర్స్ నుంచి తనకు కాల్స్ వస్తున్నాయని, ఐటెంసాంగ్ లో మంచి సందేశం ఇచ్చారంటూ అంతా తమను మెచ్చుకుంటున్నారని అన్నాడు దేవి. తాము ఎవ్వర్నీ కించపరచలేదని, కేవలం సమాజంలో ఉన్న పరిస్థితిని మాత్రమే వివరించామంటున్నాడు.