కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. వైసీపీలో చోటు చేసుకున్న తీవ్ర విభేదాలు …ఇటీవల వీధినపడ్డాయి. ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన అభిమానులు ప్రొద్దుటూరులో ప్లెక్సీలు కట్టే సందర్భంలో వివాదం చోటు చేసుకుంది. రమేశ్ యాదవ్‌కు సీఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే తనకు ఎక్కడ ప్రత్యామ్నాయంగా ఎదుగుతాడోననే ఆందోళన, భయం ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిలో బలంగా నాటుకున్నాయి.
దీంతో ఎమ్మెల్సీని పార్టీ నుంచి పొమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయనే చర్చకు తెరలేచింది. మరోవైపు రమేశ్ యాదవ్‌పై వివక్ష, అణచివేత చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే రాచమల్లుపై బీసీలు, ఇతర అణగారిన వర్గాల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఏడాది క్రితం చేనేత వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు నందం సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యే, ఆయన అనుచరుల పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యే, ఆయన బామ్మర్దిపై కేసు నమోదు కాకపోయినప్పటికీ, ఆ హత్యతో అధికార పార్టీకి సంబంధం ఉందని ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు నమ్ముతున్నారు. దీంతో ప్రొద్దుటూరు నియోజక వర్గంలో బలమైన చేనేత కమ్యూనిటీలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉందనేది బహిరంగ రహస్యమే. తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ నాయకుడు రమేశ్‌పై మరో రకమైన వేధింపులకు పాల్పడుతున్నారనే విమర్శ పట్టణంలో ఉంది.
దీంతో ఈ నెల 16న ప్రొద్దుటూరులో నిర్వహించిన రమేశ్ యాదవ్ పుట్టిన రోజు వేడుకకు ఆ నియోజక వర్గంతో పాటు సమీపం లోని జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల నుంచి బీసీలు అధికంగా హాజరు కావడం కడప జిల్లాలో చర్చనీయాం శమైంది. ప్రొద్దుటూరులో బీసీ సామాజిక వర్గానికి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్సీపై ఇంతగా అణచివేత చర్యలు చేపట్టినా…వైసీపీ అధిష్టానం ఏ మాత్రం జోక్యం చేసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాగైతే ప్రొద్దుటూరుతో పాటు జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు నియోజక వర్గాల్లో బీసీల ఓట్లను పోగొట్టుకోవాల్సి వస్తుందనే ఆందోళన నెలకుంది. ఇప్పటికైనా పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలపై వైసీపీ పెద్దలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేకపోతే సీఎం సొంత జిల్లాలోనే అధికార పార్టీకి షాక్ తప్పదు!